బేరియాట్రిక్ సర్జరీకీ ఓ పాలసీ..
మీ ఎత్తు అయిదడుగుల ఆరంగుళాలు.. బరువు 120 కేజీల పైనే ఉందా? మీ సమాధానం అవును అయితే.. దీన్ని కచ్చితంగా చదవాల్సిందే. ఒకవేళ మీ ఎత్తూ, బరువూ గణాంకాలు దాదాపు ఇవే కాకపోయినా.. ఊబకాయం ఉన్న వారికి సైతం ఇది ఉపయోగకరమైనదే. ఎందుకంటే అధిక బరువున్న వారికి డయాబెటిస్ మెలిటస్ టైప్ 2 వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తరహా మధుమేహం వచ్చిన వారి శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా వినియోగించుకోలేదు. పెపైచ్చు.. చికిత్సకూ ఇది ఓ పట్టాన లొంగదు. చివరికి రెటీనా, గుండె, మూత్రపిండాల సమస్యలకు కూడా దారితీసే ప్రమాదముంది.
ఇది కాకుండా అధిక రక్తపోటు, కొలెస్టరాల్ లాంటివి ఉంటే మరిన్ని సమస్యలు చుట్టుముట్టక తప్పదు. వీటి చికిత్స ఖర్చులూ అసాధారణంగా ఉంటాయి. పరిస్థితిని బట్టి కేవలం మధుమేహం చికిత్స ఖర్చే నెలకు రూ.5,000-9,000 స్థాయిలో ఉంటోంది. డయాబెటిస్‌కి గుండె, కిడ్నీల సమస్యలూ తోడైతే చికిత్స వ్యయాలు నెలకు రూ. 20,000 పైనే కావొచ్చు. ఇవన్నీ అధిక బరువు వల్ల వచ్చే అదనపు సమస్యలే. అలాగని, దీని గురించి మరీ బెంగపడనక్కర్లేదు. ఎందుకంటే..
గణనీయంగా బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీ లాంటివి అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం. ఈ విధానంలో శస్త్రచికిత్సతో ఉదర పరిమాణం తగ్గించడం ద్వారా తీసుకునే ఆహార పరిమాణాన్ని నియంత్రణలోకి తెస్తారు. ఫలితంగా బరువు అదుపులోకి వస్తుంది. కానీ ఇలాంటి సర్జరీలు బాగా ఖర్చుతో కూడుకున్నవి, బీమా కవరేజీ లేకపోవడం మొదలైన కారణాల వల్ల దేశీయంగా వీటివైపు వెళ్లే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది.
కవరేజీ ఇలా..
ప్రస్తుతం సమస్య తీవ్రత, సంద ర్భం, కేసును బట్టి కొన్ని బీమా కంపెనీలు బేరియాట్రిక్ సర్జరీకి కూడా కవరేజీ ఇవ్వడం మొదలుపెట్టాయి. ఈ శస్త్రచికిత్సపై ఆసక్తిగా ఉన్న వారికి ఇది శుభపరిణామమే. అయితే, సదరు పాలసీ తీసుకునే ముందు ప్రి, పోస్ట్ హాస్పిటలైజేషన్ వ్యయాలకు కూడా కవరేజీ ఇచ్చే పాలసీలను ఎంచుకోవడం మంచిది. అలాగే, క్యాష్‌లెస్ ప్రాతిపదికన బేరియాట్రిక్ సర్జరీ క్లెయిమ్‌కు కవరేజీ ఇచ్చే వాటిని చూసుకోవాలి. దీనివల్ల మళ్లీ మన జేబునుంచి అదనంగా చెల్లించాల్సి వస్తుందేమోనన్న భయాల్లేకుండా, సర్జరీకి మానసికంగా సిద్ధం కావొచ్చు.
సాధారణంగా బేరియాట్రిక్ సర్జరీ కింద గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, అడ్జస్టబుల్ గ్యాస్ట్రిక్ బ్యాండ్ మొదలైనవి ఉంటున్నాయి. శరీరంపై మరీ ఎక్కువగా కోతలు, కుట్లు లేకుండా చిన్న గాటు మాత్రమే పడేలా ల్యాప్రోస్కోపిక్ సర్జరీ విధానంలో ఈ శస్త్రచికిత్స చేస్తుంటారు. అయితే, ఏ ప్రక్రియను అనుసరించి సర్జరీ చేశారు, ఆస్పత్రి వంటి అంశాల మీద చికిత్స వ్యయం ఆధారపడి ఉంటుంది. దేశీయంగా సగటున ఈ చికిత్స వ్యయాలు సుమారు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల దాకా ఉంటున్నాయి.
జీవితాంతం మధుమేహం, గుండె జబ్బులు, కొలెస్టరాల్, రక్త పోటు మొదలైన వాటిని భరిస్తూ, వాటిక య్యే చికిత్స వ్యయాలతో పోలిస్తే ఈ వన్‌టైమ్ ఖర్చు వల్ల ప్రయోజనాలు గణనీయంగానే ఉంటాయని చెప్పవచ్చు. పైగా మెరుగైన జీవితం గడిపేందుకు ఇది తోడ్పడగలదు. ఊబకాయం ఉన్న వారు సాధ్యమైనంత వరకు చిన్న వయస్సులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. భవిష్యత్‌లో బేరియాట్రిక్ సర్జరీ వంటి శస్త్రచికిత్స వ్యయాలు, ప్రీమియాల భారం తగ్గించుకోవచ్చు. కాబట్టి సరైన పాలసీ ఎంచుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించండి.