Beriyatrik Surgery
-
బేరియాట్రిక్ సర్జరీకీ ఓ పాలసీ..
మీ ఎత్తు అయిదడుగుల ఆరంగుళాలు.. బరువు 120 కేజీల పైనే ఉందా? మీ సమాధానం అవును అయితే.. దీన్ని కచ్చితంగా చదవాల్సిందే. ఒకవేళ మీ ఎత్తూ, బరువూ గణాంకాలు దాదాపు ఇవే కాకపోయినా.. ఊబకాయం ఉన్న వారికి సైతం ఇది ఉపయోగకరమైనదే. ఎందుకంటే అధిక బరువున్న వారికి డయాబెటిస్ మెలిటస్ టైప్ 2 వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తరహా మధుమేహం వచ్చిన వారి శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా వినియోగించుకోలేదు. పెపైచ్చు.. చికిత్సకూ ఇది ఓ పట్టాన లొంగదు. చివరికి రెటీనా, గుండె, మూత్రపిండాల సమస్యలకు కూడా దారితీసే ప్రమాదముంది. ఇది కాకుండా అధిక రక్తపోటు, కొలెస్టరాల్ లాంటివి ఉంటే మరిన్ని సమస్యలు చుట్టుముట్టక తప్పదు. వీటి చికిత్స ఖర్చులూ అసాధారణంగా ఉంటాయి. పరిస్థితిని బట్టి కేవలం మధుమేహం చికిత్స ఖర్చే నెలకు రూ.5,000-9,000 స్థాయిలో ఉంటోంది. డయాబెటిస్‌కి గుండె, కిడ్నీల సమస్యలూ తోడైతే చికిత్స వ్యయాలు నెలకు రూ. 20,000 పైనే కావొచ్చు. ఇవన్నీ అధిక బరువు వల్ల వచ్చే అదనపు సమస్యలే. అలాగని, దీని గురించి మరీ బెంగపడనక్కర్లేదు. ఎందుకంటే.. గణనీయంగా బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీ లాంటివి అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం. ఈ విధానంలో శస్త్రచికిత్సతో ఉదర పరిమాణం తగ్గించడం ద్వారా తీసుకునే ఆహార పరిమాణాన్ని నియంత్రణలోకి తెస్తారు. ఫలితంగా బరువు అదుపులోకి వస్తుంది. కానీ ఇలాంటి సర్జరీలు బాగా ఖర్చుతో కూడుకున్నవి, బీమా కవరేజీ లేకపోవడం మొదలైన కారణాల వల్ల దేశీయంగా వీటివైపు వెళ్లే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. కవరేజీ ఇలా.. ప్రస్తుతం సమస్య తీవ్రత, సంద ర్భం, కేసును బట్టి కొన్ని బీమా కంపెనీలు బేరియాట్రిక్ సర్జరీకి కూడా కవరేజీ ఇవ్వడం మొదలుపెట్టాయి. ఈ శస్త్రచికిత్సపై ఆసక్తిగా ఉన్న వారికి ఇది శుభపరిణామమే. అయితే, సదరు పాలసీ తీసుకునే ముందు ప్రి, పోస్ట్ హాస్పిటలైజేషన్ వ్యయాలకు కూడా కవరేజీ ఇచ్చే పాలసీలను ఎంచుకోవడం మంచిది. అలాగే, క్యాష్‌లెస్ ప్రాతిపదికన బేరియాట్రిక్ సర్జరీ క్లెయిమ్‌కు కవరేజీ ఇచ్చే వాటిని చూసుకోవాలి. దీనివల్ల మళ్లీ మన జేబునుంచి అదనంగా చెల్లించాల్సి వస్తుందేమోనన్న భయాల్లేకుండా, సర్జరీకి మానసికంగా సిద్ధం కావొచ్చు. సాధారణంగా బేరియాట్రిక్ సర్జరీ కింద గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, అడ్జస్టబుల్ గ్యాస్ట్రిక్ బ్యాండ్ మొదలైనవి ఉంటున్నాయి. శరీరంపై మరీ ఎక్కువగా కోతలు, కుట్లు లేకుండా చిన్న గాటు మాత్రమే పడేలా ల్యాప్రోస్కోపిక్ సర్జరీ విధానంలో ఈ శస్త్రచికిత్స చేస్తుంటారు. అయితే, ఏ ప్రక్రియను అనుసరించి సర్జరీ చేశారు, ఆస్పత్రి వంటి అంశాల మీద చికిత్స వ్యయం ఆధారపడి ఉంటుంది. దేశీయంగా సగటున ఈ చికిత్స వ్యయాలు సుమారు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల దాకా ఉంటున్నాయి. జీవితాంతం మధుమేహం, గుండె జబ్బులు, కొలెస్టరాల్, రక్త పోటు మొదలైన వాటిని భరిస్తూ, వాటిక య్యే చికిత్స వ్యయాలతో పోలిస్తే ఈ వన్‌టైమ్ ఖర్చు వల్ల ప్రయోజనాలు గణనీయంగానే ఉంటాయని చెప్పవచ్చు. పైగా మెరుగైన జీవితం గడిపేందుకు ఇది తోడ్పడగలదు. ఊబకాయం ఉన్న వారు సాధ్యమైనంత వరకు చిన్న వయస్సులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. భవిష్యత్‌లో బేరియాట్రిక్ సర్జరీ వంటి శస్త్రచికిత్స వ్యయాలు, ప్రీమియాల భారం తగ్గించుకోవచ్చు. కాబట్టి సరైన పాలసీ ఎంచుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించండి. -
బేరియాట్రిక్ సర్జరీ కౌన్సెలింగ్
బేరియాట్రిక్ సర్జరీతో అన్ని స్థూలకాయాలూ తగ్గుతాయా? నేను స్థూలకాయంతో బాధపడుతున్నాను. ఒక్కసారి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే ఇక దాంతో ఈ స్థూలకాయం సమస్యనుంచి విముక్తి పొందవచ్చుకదా అనే ఆశతో ఉన్నాను. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. - వి. రమేశ్, భీమవరం నిజానికి మీరు అడిగిన ప్రశ్న ఒకింత సంక్లిష్టమైనది. ఎందుకంటే స్థూలకాయం ఉన్న ప్రతి ఒక్కరికీ బరువు తగ్గడానికి ఇదేమీ సింగిల్ టైమ్ షార్ట్‌కట్ మార్గం కాదు. దీనికి అందరూ అర్హులు కాలేరు. బీఎమ్ఐ 40 కంటే ఎక్కువ ఉన్నవారు లేదా బీఎమ్ఐ 35 ఉన్నా స్థూలకాయానికి సంబంధించిన దుష్ర్పభావాలతో బాధపడుతున్నవారూ, తాము ఉండాల్సిన బరువుతో పోలిస్తే 45 కేజీలు ఎక్కువ బరువున్నవారూ, బరువు తగ్గడానికి జీవనశైలి మార్గాలను చాలా కచ్చితంగా పాటించి కూడా బరువు తగ్గలేనివారూ, కూల్‌డ్రింక్స్ లేదా ఆల్కహాల్ ఎక్కువగా తాగనివారూ... వీళ్లకు బేరియాట్రిక్ సర్జరీ చివరి ఆప్షన్‌గా పనికి వస్తుంది. కానీ ఇక ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత సమస్యలన్నీ ఆటోమేటిగ్గా మాయమై పోతాయని చెప్పలేం. ఆరోగ్య సమస్యలు తగ్గడానికి, స్థూలకాయ దుష్పరిణామాల నివారణకు బేరియాట్రిక్ సర్జరీ మొదటిమెట్టుగా మాత్రమే పరిగణించాలి. వ్యాధిగా పరిగణించదగిన స్థూలకాయం ఉన్నవారి జీవితాన్ని పొడిగించడానికీ, వారి జీవనాన్ని వీలైనంత మెరుగ్గా, సౌకర్యవంతంగా ఉండేలా చేయడానికి ఇదొక మార్గమని గ్రహించాలి. పైగా రోగి ఈ ఆపరేషన్‌ను తట్టుకునేంత ఆరోగ్యంగానూ ఉండాలి. బరువు తగ్గడానికి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకునే ముందు వ్యాధిగ్రస్థస్థాయిలో ఉన్న స్థూలకాయులు అన్ని కోణాలనుంచి, అనేక ప్రశ్నలను అడిగి తెలుసుకోవాలి. వారు తమ డైటీషియన్‌ను, ఫిజియోథెరపిస్ట్నూ, సైకాలజిస్ట్నూ, ఫిజీషియన్నూ కూడా సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకోవడం మేలు. దాంతోపాటు రోగి వయసు, ఆరోగ్యచరిత్రను పరిగణనలోకి తీసుకొని, డాక్టర్లు పేషెంట్‌కు ఆపరేషన్‌కు ముందు చేయాల్సిన కొన్ని పరీక్షలు... అంటే కార్డియాక్ వర్కప్, బ్లడ్ వర్క్, స్లీప్ స్టడీ, రోగి మానసిక పరిస్థితిని అంచనా వేయడం వంటి పరీక్షలు నిర్వహిస్తారు. రోగికి శస్త్రచికిత్స విజయవంతం కావాలంటే అతడు ఆపరేషన్‌కు ముందు తీసుకోవాల్సిన ఆహారం కూడా చాలా ముఖ్యభూమిక నిర్వహిస్తుంటుంది. దీని వల్లనే ఆపరేషన్ తర్వాత రోగిలోని కీలక అవయవాలైన స్ప్లీన్, లివర్ వంటి వాటి చుట్టూ ఉన్న కొవ్వు తొలగిపోయి, రక్తస్రావం అయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ రోగి ఆపరేషన్‌కు ముందుగా తీసుకోవాల్సిన ఆహారనియమాలను సరిగా పాటించకపోతే, డాక్టర్లు శస్త్రచికిత్సను వాయిదావేస్తారు. ఇక ఒక్కోసారి ఆపరేషన్ తర్వాత రోగికి అందాల్సిన పోషకాలన్నీ సమర్థంగా అందక మరికొన్ని సమస్యలు రావచ్చు. ఇక ఈ రోగుల్లో డయాబెటిస్, రక్తపోటు లాంటి వ్యాధులున్నాయా అన్న విషయం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే. అందుకే బేరియాట్రిక్ సర్జరీ అన్నది రోగులందరికీ ఒకేలాంటి సలహా ఇచ్చి, అందరూ దీన్ని చేయించుకోండి అంటూ చెప్పగలిగేది కాదు. ప్రతి రోగి పరిస్థితిని బట్టి అతడికి ఇది అవసరం కావచ్చూ, కాకపోవచ్చూ. అందుకే బరువు తగ్గాలనుకున్నవారు ఎలాంటి బిడియం లేకుండా మొదట తాము బేరియాట్రిక్ సర్జరీకి అర్హులా కాదా అన్న విషయాలను డాక్టర్లతో చాలా నిశితంగా మాట్లాడాకే నిర్ణయం తీసుకోవాల్సిన శస్త్రచికిత్స ఇది. డాక్టర్ ఆనంద కుమార్ చీఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హెచ్బీపీ అండ్ బేరియాట్రిక్ సర్జరీ సన్‌షైన్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
డామిట్... ఈ వామిట్స్ తగ్గేదెలా?
నేడు డాక్టర్స్ డే డాక్టర్. కె.ఎస్. లక్ష్మీకుమారి, సీనియర్ కన్సల్టెంట్ - మినిమల్ యాక్సెస్, బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీ, గ్లోబల్ హాస్పిటల్స్, హైదరాబాద్ అప్పటికే ఎన్నో బేరియాట్రిక్ సర్జరీలు చేసిన అనుభవం నాది. అత్యంత సంక్లిష్టమైన కేసులు ఎదుర్కొన్న రికార్డు నాది. ఓ అంతుచిక్కని కేసు. శ్రీనివాస్ అనే పేషెంట్ అప్పటికే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో మూడుసార్లు సర్జరీ చేయించుకున్నాడు. అప్పటినుంచి కొద్దిగా ఆహారం తీసుకున్నా వాంతి అయిపోతోంది. అప్పటికే మూడు సర్జరీలు! ఇక ఏం చేయాలో తెలియక ప్రాణాన్ని రక్షించడం కోసం అవసరమైన పోషకాలు అందడానికి వీలుగా నేరుగా పొట్టలోకి, పేగుల్లోకి ఒక చిన్న పైప్ వేశారు. పైప్ ద్వారా ఘనాహారం అందించలేరు, ద్రవాలను పంపిస్తూ ఉన్నారు. తప్పు ఎక్కడ దొర్లిందో అర్థం కావడం లేదు. మళ్లీ ఒకసారి వరసక్రమంలో పరీక్షలు చేసుకుంటూ వచ్చాం. తప్పిదం ఎక్కడో తెలియలేదు. అయినా సరే... మరోమారు శ్రీనివాస్ శరీరానికి శస్త్రచికిత్స చేయాలనుకున్నాం. అయితే అప్పటికే అది నాలుగో శస్త్రచికిత్స! ఆపరేషన్ చేస్తున్నప్పుడు జరిగిన పొరబాటేమిటో తెలిసింది. గతంలో శస్త్రచికిత్స చేసే సమయంలో జీర్ణమార్గం ఉండాల్సిన రీతిలో కాకుండా, పొరబాటున దాన్ని కాస్త దారి మళ్లించినట్లు మాకు అర్థమైంది. దాన్ని సరిదిద్దడానికి మాకు చాలా వ్యవధి పట్టింది. ప్రక్రియనైతే పూర్తి చేశాం గానీ... మా అందరిలో ఎంతో ఉద్విగ్నత. శ్రీనివాస్ మామూలుగా భోజనం చేసిన రోజు మా అందరి కళ్లలోనూ తృప్తి నిండిన కాంతులే.