బేరియాట్రిక్ సర్జరీతో అన్ని స్థూలకాయాలూ తగ్గుతాయా?
నేను స్థూలకాయంతో బాధపడుతున్నాను. ఒక్కసారి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే ఇక దాంతో ఈ స్థూలకాయం సమస్యనుంచి విముక్తి పొందవచ్చుకదా అనే ఆశతో ఉన్నాను. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి.
- వి. రమేశ్, భీమవరం
నిజానికి మీరు అడిగిన ప్రశ్న ఒకింత సంక్లిష్టమైనది. ఎందుకంటే స్థూలకాయం ఉన్న ప్రతి ఒక్కరికీ బరువు తగ్గడానికి ఇదేమీ సింగిల్ టైమ్ షార్ట్‌కట్ మార్గం కాదు. దీనికి అందరూ అర్హులు కాలేరు. బీఎమ్‌ఐ 40 కంటే ఎక్కువ ఉన్నవారు లేదా బీఎమ్‌ఐ 35 ఉన్నా స్థూలకాయానికి సంబంధించిన దుష్ర్పభావాలతో బాధపడుతున్నవారూ, తాము ఉండాల్సిన బరువుతో పోలిస్తే 45 కేజీలు ఎక్కువ బరువున్నవారూ, బరువు తగ్గడానికి జీవనశైలి మార్గాలను చాలా కచ్చితంగా పాటించి కూడా బరువు తగ్గలేనివారూ, కూల్‌డ్రింక్స్ లేదా ఆల్కహాల్ ఎక్కువగా తాగనివారూ... వీళ్లకు బేరియాట్రిక్ సర్జరీ చివరి ఆప్షన్‌గా పనికి వస్తుంది. కానీ ఇక ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత సమస్యలన్నీ ఆటోమేటిగ్గా మాయమై పోతాయని చెప్పలేం. ఆరోగ్య సమస్యలు తగ్గడానికి, స్థూలకాయ దుష్పరిణామాల నివారణకు బేరియాట్రిక్ సర్జరీ మొదటిమెట్టుగా మాత్రమే పరిగణించాలి. వ్యాధిగా పరిగణించదగిన స్థూలకాయం ఉన్నవారి జీవితాన్ని పొడిగించడానికీ, వారి జీవనాన్ని వీలైనంత మెరుగ్గా, సౌకర్యవంతంగా ఉండేలా చేయడానికి ఇదొక మార్గమని గ్రహించాలి. పైగా రోగి ఈ ఆపరేషన్‌ను తట్టుకునేంత ఆరోగ్యంగానూ ఉండాలి. బరువు తగ్గడానికి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకునే ముందు వ్యాధిగ్రస్థస్థాయిలో ఉన్న స్థూలకాయులు అన్ని కోణాలనుంచి, అనేక ప్రశ్నలను అడిగి తెలుసుకోవాలి.
వారు తమ డైటీషియన్‌ను, ఫిజియోథెరపిస్ట్‌నూ, సైకాలజిస్ట్‌నూ, ఫిజీషియన్‌నూ కూడా సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకోవడం మేలు. దాంతోపాటు రోగి వయసు, ఆరోగ్యచరిత్రను పరిగణనలోకి తీసుకొని, డాక్టర్లు పేషెంట్‌కు ఆపరేషన్‌కు ముందు చేయాల్సిన కొన్ని పరీక్షలు... అంటే కార్డియాక్ వర్కప్, బ్లడ్ వర్క్, స్లీప్ స్టడీ, రోగి మానసిక పరిస్థితిని అంచనా వేయడం వంటి పరీక్షలు నిర్వహిస్తారు. రోగికి శస్త్రచికిత్స విజయవంతం కావాలంటే అతడు ఆపరేషన్‌కు ముందు తీసుకోవాల్సిన ఆహారం కూడా చాలా ముఖ్యభూమిక నిర్వహిస్తుంటుంది. దీని వల్లనే ఆపరేషన్ తర్వాత రోగిలోని కీలక అవయవాలైన స్ప్లీన్, లివర్ వంటి వాటి చుట్టూ ఉన్న కొవ్వు తొలగిపోయి, రక్తస్రావం అయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ రోగి ఆపరేషన్‌కు ముందుగా తీసుకోవాల్సిన ఆహారనియమాలను సరిగా పాటించకపోతే, డాక్టర్లు శస్త్రచికిత్సను వాయిదావేస్తారు. ఇక ఒక్కోసారి ఆపరేషన్ తర్వాత రోగికి అందాల్సిన పోషకాలన్నీ సమర్థంగా అందక మరికొన్ని సమస్యలు రావచ్చు. ఇక ఈ రోగుల్లో డయాబెటిస్, రక్తపోటు లాంటి వ్యాధులున్నాయా అన్న విషయం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే. అందుకే బేరియాట్రిక్ సర్జరీ అన్నది రోగులందరికీ ఒకేలాంటి సలహా ఇచ్చి, అందరూ దీన్ని చేయించుకోండి అంటూ చెప్పగలిగేది కాదు. ప్రతి రోగి పరిస్థితిని బట్టి అతడికి ఇది అవసరం కావచ్చూ, కాకపోవచ్చూ. అందుకే బరువు తగ్గాలనుకున్నవారు ఎలాంటి బిడియం లేకుండా మొదట తాము బేరియాట్రిక్ సర్జరీకి అర్హులా కాదా అన్న విషయాలను డాక్టర్లతో చాలా నిశితంగా మాట్లాడాకే నిర్ణయం తీసుకోవాల్సిన శస్త్రచికిత్స ఇది.
డాక్టర్ ఆనంద కుమార్
చీఫ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హెచ్‌బీపీ అండ్ బేరియాట్రిక్ సర్జరీ
సన్‌షైన్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
బేరియాట్రిక్ సర్జరీ కౌన్సెలింగ్
Published Fri, Jul 10 2015 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM
Advertisement
Advertisement