న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం భారత్‌కు చేయూతనందిస్తామని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) పేర్కొంది. అందులో భాగంగానే ఇండియాకు ఇచ్చే నిధులను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే మూడేళ్ల కాలంలో (2016-18) 10-12 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయమందిస్తామని వెల్లడించింది. ఏడీబీ ప్రెసిడెంట్ తకిహికొ నకయో శుక్రవారం ఆర్థిక మంత్రి జైట్లీని కలిశారు. అంతర్జాతీయంగా వృద్ధి మందగించడం, ఫైనాన్షియల్ మార్కెట్లలో సంక్షోభ పరిస్థితులు, కమోడిటీ ధరలు నేలకు దిగిరావడం వంటి ప్రతికూల అంశాల్లోనూ భారత్ మంచి వృద్ధిని నమోదు చేస్తోందని కితాబునిచ్చారు. కేంద్ర ప్రభుత్వపు చర్యల కారణంగా ప్రపంచంలోనే ఇండియా ఈ ఏడాది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా అవతరిస్తుందని అంచనా వేశారు. తాజా బడ్జెట్ కూడా వృద్ధికి దోహదపడేలా ఉందన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 7 శాతంపైగా ఉంటుందని ఏడీబీ అంచనా వేసింది.