
బ్యాంకుల సమ్మెతో స్తంభన
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలలో ఎక్కడా రూపాయి లేదు. బ్యాంకుకు వెళ్లి డ్రా చేసుకుందామంటే ఒక్క బ్యాంకూ పనిచేయట్లేదు. వేసిన చెక్కులు వేసినట్లే, క్లియరెన్సు లేకుండా ఆగిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆర్థిక వ్యవస్థ మొత్తం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది, అధికారులు సమ్మె చేస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వేతనాలు సవరించాలని డిమాండు చేస్తూ సిబ్బంది ఈ రెండురోజులూ సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ లాంటి ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం పని చేస్తుండటంతో వినియోగదారులకు కొద్ది ఊరట లభించింది.
వేతనాల సవరణకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ముందుకు రాకపోవడంతో తాము సమ్మెకు దిగక తప్పలేదని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) కన్వీనర్ ఎంవీ మురళి తెలిపారు. వేతనాలను పది శాతం పెంచుతామంటూ ఐబీఏ చేసిన ఆఫర్ను యూనియన్లు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుండటంతో ఈ పెంపు ఏమాత్రం సరిపోదని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి అశ్వినీ రాణా అన్నారు.