ఆర్థికాభివృద్ధిలో పీఎస్యూలు కీలకం
♦ మిగులు నిధులు, వనరులు
♦ సద్వినియోగం కావాలి: రాష్ట్రపతి ప్రణబ్
♦ వృద్ధి, ఉపాధి కల్పనలకు ఇది అవసరమని వ్యాఖ్య
♦ స్కోప్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) మిగులు భూమి, నిధులు ఇతర వనరులు సద్వినియోగం కావాలని రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఈ దిశలో ఆయా సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇది సంస్థల మూలధన పటిష్టతకే కాకుండా... దేశ ఆర్థికాభివృద్ధి మెరుగుదలకు, ఉపాధి కల్పన అవకాశాలు పెరగడానికి దోహదపడుతుందని విశ్లేషించారు. దేశాభివృద్ధిలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు. పబ్లిక్ సెక్టార్ డే ఉత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రభుత్వ రంగ సంస్థల- అత్యున్నత మండలి స్కోప్ (స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్) ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక ప్రముఖులకు స్కోప్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు.
ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర....
2013-14తో పోల్చితే 2014-15లో ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లింపు మూలధనం, ఉపయోగించిన మూలధనంలో 7 శాతం వృద్ధిని నమోదుచేసుకున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. పెట్టుబడుల్లో 10.5 శాతం, మొత్తం మార్కెట్ కేపిటలైజేషన్ విషయంలో 20 శాతం వృద్ధి నమోదయ్యిందని ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. 2012-13 నుంచి 2014-15 వరకూ మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటున ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తంగా రూ.1,15,426 కోట్ల లాభాలను ఆర్జించాయి. స్థూల టర్నోవర్ రూ.20,02,591 కోట్లు. డివిడెండ్ చెల్లింపులు రూ.57,115 కోట్లు. ఆర్థికాభివృద్ధిలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ఎంత కీలకమైనదన్న విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీనితో పాటు స్వచ్ఛభారత్ ఆభియాన్‌లో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర కీలకమైనది. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యతల విషయంలో ప్రభుత్వరంగ సంస్థలు నిరుపమాన సేవలు అందిస్తున్నాయి.