
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.6,500 కోట్ల మేర లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూ)లకు సంబంధించి ఏడు బ్యాంకులకు చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. అలాగే, మిగిలిన ఎల్‌వోయూలు, ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎఫ్‌ఎల్‌సీ)లు సైతం గడువు తీరినప్పుడు వాటికి సంబంధించి కూడా చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
నీరవ్ మోడీ పీఎన్‌బీ నుంచి ఎల్‌వోయూలు సంపాదించి వాటి ద్వారా విదేశీ బ్యాంకు శాఖల్లో రూ.13,000 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగవేసిన విషయం తెలిసిందే. ఈ విధంగా మోసపూరిత ఎల్‌వోయూల ఆధారంగా రుణాలు మంజూరు చేసిన ఏడు బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.6,500 కోట్లు చెల్లించనున్నట్టు బ్యాంకు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ విషయమై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది.