పీఎన్బీ లాభం 58 శాతం పతనం
13.75 శాతానికి స్థూల ఎన్‌పీఏలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో 58% క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.721 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో సగానికి తగ్గి, రూ.306 కోట్లకు పడిపోయిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) పేర్కొంది. గతేడాది క్యూ4లో ఈ బ్యాంక్‌కు రికార్డ్ స్థాయిలో రూ.5,367 కోట్ల నష్టాలు వచ్చాయి.
మూడు రెట్లు పెరిగిన ‘మొండి’ కేటాయింపులు...
మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,291 కోట్ల నుంచి మూడు రెట్లు పెరిగి రూ.3,620 కోట్లకు చేరాయని పీఎన్‌బీ ఎండీ ఉషా అనంతసుబ్రహ్మణ్యమ్ చెప్పారు. స్థూల మొండి బకాయిలు 12.9 శాతం నుంచి 13.75 శాతానికి, అలాగే నికర మొండి బకాయిలు 8.61 శాతం నుంచి 9.16 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. అంకెలపరంగా చూస్తే స్థూల మొండి బకాయిలు రెట్టింపై రూ. 56,654 కోట్లకు పెరిగాయని, నికర మొండి బకాయిలు గత క్వార్టర్ కంటే రూ.300 కోట్లు అధికంగా పెరిగాయని వివరించారు. నగదు రికవరీ రూ. 2,328 కోట్ల నుంచి రూ.6,006 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ. 13,432 కోట్ల నుంచి రూ.13,930కోట్లకు పెరగ్గా, వడ్డీ ఆదాయం రూ.12,035 కోట్ల నుంచి రూ.11,575 కోట్లకు తగ్గిందని వివరించారు.
10-11 శాతంగా రుణ వృద్ధి
మొండి బకాయిల సమస్య పూర్తిగా పరిష్కారమైందని ఎవరూ చెప్పలేరని ఉషా అనంతసుబ్రహ్మణ్యమ్ వ్యాఖ్యానించారు. అయితే ఎంతో కొంత మెరుగుదల సాధించామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 10-11 శాతంగా ఉండగలదని అంచనా వేశామని, రికవరీ వ్యవస్థ మెరుగ్గానే ఉందని, వీటన్నింటి ఫలితంగా స్థూల మొండిబకాయిలు 10 శాతం కంటే తక్కువకే నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంక్ షేర్ 3 శాతం వరకూ క్షీణించి రూ.129 వద్ద ముగిసింది.