సౌర విద్యుత్‌లోకి మై హోమ్
ప్యూరెనర్జీతో ఎంవోయూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ, సిమెంట్, విద్యుత్, విద్యా రంగంలో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న మై హోమ్ గ్రూప్.. తాజాగా సౌర విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టింది. అబ్జా పవర్ (గతంలో మై హోమ్ పవర్ ప్రై.లి.), ఐఐటీ–హైదరాబాద్‌లో ఇంక్యుబేట్ అయిన ప్యూరెనర్జీతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో మై హోమ్ గ్రూప్ సౌర విద్యుత్ రంగంతో పాటూ రూఫ్‌టాప్, యుటిలిటీ స్కేల్ ప్రాజెక్ట్స్‌తో నివాస, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో సౌర విద్యుత్ అవసరాలను తీరుస్తుందని మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ రామేశ్వర్ రావు జూపల్లి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సోలార్ సిస్టమ్స్, ఐఓటీ ఆధారిత విద్యుత్ నిర్వహణ, సౌర ప్లాంట్ల పర్యవేక్షణ, అభివృద్ధి, పరిశోధన వంటి వాటిల్లో ఉమ్మడి ప్రాజెక్ట్‌లను చేస్తామని పేర్కొన్నారు. అబ్జా పవర్ ప్రాజెక్ట్ నిర్వహణపై దృష్టి కేంద్రీకరిస్తే, ప్యూరెనర్జీ మాత్రం డిజైన్, అభివృద్ధి విభాగాలను పర్యవేక్షిస్తుందన్నారు. ఈ అవగాహన ఒప్పందంలో ౖమై హోమ్ పవర్ ప్రై.లి. ఈడీ జగపతిరావు జూపల్లి, అబ్జా పవర్ డైరెక్టర్ అండ్ సీఈఓ రాయ్ చౌదరి, ప్యూరెనర్జీ ఫౌండర్, ఐఐటీ–హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిశాంత్ దొంగరీ పాల్గొన్నారు.