డెలివరీ ఆలస్యం.. 7 వేల కోట్ల నష్టం!
పారిస్: కంపెనీ తీసుకున్న ఆర్డర్ల డెలివరీలో ఆలస్యం కారణంగా ఎయిర్‌బస్ భారీ మూల్యాన్ని చెల్లించుకోనుంది. నాలుగు భారీ జెట్ విమానాల కొనుగోలు కోసం చేసిన ఆర్డర్లను ఖతార్ ఎయిర్‌వేస్ వెనక్కి తీసుకుని ఎయిర్‌బస్ సంస్థకు ఊహించని షాకిచ్చింది. డెలివరీలో ఆలస్యం అయినందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఖతార్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఖతార్ ఎయిర్‌లైన్స్ ఆర్డర్ల రద్దు కారణంగా ఎయిర్‌బస్ సంస్థకు భారత కరెన్సీలో సుమారు రూ. 7,751 కోట్ల (1.2 బిలియన్ డాలర్ల) మేర నష్టం వాటిల్లనుంది.
'ఎయిర్‌బస్ సంస్థకు మేం నాలుగు జెట్ విమానాల కోసం ఆర్డరిచ్చాం. అయితే సాంకేతిక లోపాలు తలెత్తడం, ఆర్డర్ సకాలంలో ఇవ్వకపోవడం లాంటి వాటికి ఎయిర్‌బస్ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాం. కానీ డెలివరీ ఆలస్యమైన కారణంగా మా ఆర్డర్లను రద్దు చేసుకున్నామని' ఖతార్ ఎయిర్‌వేస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అక్బర్ అల్ బకార్ వివరించారు. మరోవైపు గత బుధవారం 140 ఎయిర్‌బస్ జెట్ విమానాల కొనుగోలుకు చైనా ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
ఎయిర్‌బస్ ప్రతినిథి ఒకరు మాట్లాడుతూ.. ఏ350-900 జెట్ విమానాలను సరైన సమయంలో డెలివరీ ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నించాం. కానీ కుదరలేదు. వేరొక ఆర్డరిచ్చే కంపెనీకి వీటిని రీ డిజైన్ చేసి వారికి అనుకూలమైన మార్పులతో విక్రయించాల్సి ఉంటుంది. ఇది అంత సులువైన విషయం కాదు. జరిగే నష్టాన్ని ఎంతో కొంత మేర తగ్గించుకునేందుకు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అధిక ఆర్డర్ల కారణంతో పాటు పరికరాల కొరత, అత్యంత నాణ్యత కోసం పాకులాడటం వల్లే ఈ తప్పిదం జరిగిందని కంపెనీ పేర్కొంది.