మీ టికెట్ కన్‌ఫమ్ అవుతుందా? | Railway tickets can be pre Confirmation | Sakshi
Sakshi News home page

మీ టికెట్ కన్‌ఫమ్ అవుతుందా?

Published Sat, Aug 22 2015 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM

మీ టికెట్ కన్‌ఫమ్ అవుతుందా?

మీ టికెట్ కన్‌ఫమ్ అవుతుందా?

రైల్వే టికెట్ల కన్‌ఫర్మేషన్ ముందే తెలుసుకోవచ్చు...
♦ మొబైల్ యాప్‌లో కూడా కన్‌ఫమ్ టికెట్ డాట్ కామ్
♦ లక్ష డాలర్ల నిధుల సమీకరణ...
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎవరైనా సరే! రైల్వే టికెట్ బుక్ చేయగానే ముందుగా అడిగే ప్రశ్న.. ‘వెయిటింగ్ లిస్ట్ ఎంత అని’! ఇక వెయిట్ లిస్ట్ నంబరు చెప్పాక అడిగే రెండో ప్రశ్న... కన్‌ఫమ్ అవుతుందా?... అని. మొదటి ప్రశ్నకైతే సమాధానం దొరుకుతుంది కానీ... రెండో ప్రశ్నకు ప్రయాణం చివరి క్షణం వరకూ జవాబుండదు. ఆ రైలు బయలుదేరే రెండుమూడు గంటల ముందు... చార్ట్ ప్రిపేర్ అయ్యాక మాత్రమే తెలుస్తుంది మన టికెట్ కన్‌ఫమ్ అయిందో లేదో!!. ఇక అప్పుడు తెలిశాక లాభమేముంటుంది చెప్పండి? ప్రత్యామ్నాయం చూసుకోవాలనుకున్నా కష్టం. ప్రయాణం రద్దు చేసుకోవాల్సిందే.

ఇవన్నీ అనుభవించిన వాళ్లు ప్రారంభించిందే ‘‘కన్‌ఫమ్ టికెట్ డాట్ కామ్(www.conformtkt.com)’’. మీక్కావల్సిన రైళ్ల వివరాలను, వాటి టికెట్ల స్టేటస్‌ను ముందే చెప్పేస్తుంది. అప్పటికి వెయిట్‌లిస్ట్ టికెట్ వచ్చినా... మీరు ప్రయాణించే సమయానికి అది కన్‌ఫమ్ అవుతుందో లేదో కచ్చితంగా చెప్పటమే దీని ప్రత్యేకత. ‘‘మీ ప్రయాణాన్ని కన్‌ఫమ్ చేయడమే మా పని’’ అంటారు సంస్థ వ్యవస్థాపకులు శ్రీపద్ వైద్య, దినేష్‌కుమార్. శ్రీపద్‌ది నిజామాబాద్ కాగా... దినేష్‌ది ఖమ్మం. తమ సంస్థకు సంబంధించి శ్రీపద్ ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే...

 అందరికీ ఇదే సమస్య...
 నేను, దినేష్ ఇద్దరం బెంగళూరులోని ఐబీఎంలో పనిచేసే వారం. సెలవుల్లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా మాకు ఎదురయ్యే ప్రధాన సమస్య టికెట్ బుకింగే. రెండు మూడు నెలల ముందు నుంచే టికెట్లను బుక్ చేస్తే తప్ప కన్‌ఫమ్ కాని పరిస్థితి. ప్రయాణం అత్యవసరమైతే ఎక్కువ డబ్బులు పెట్టి వెళ్లాల్సిందే. మాకే కాదు. చాలా మందిది ఇదే పరిస్థితి. అప్పుడే అనిపించింది. టెక్నాలజీని ఉపయోగించి టికెట్ కన్‌ఫమ్ అవుతుందో లేదో ముందే చెప్పేస్తే ఎంతో బాగుంటుంది కదా!! అని. దీంతో అవసరమైతే ఇతర మార్గాల ద్వారా ప్రయాణం చే స్తాం.. లేకపోతే టికెట్లు మరింత ముందుగా బుక్ చేసుకుంటాం. పెపైచ్చు టికెట్ కన్‌ఫమ్ అవుతుందో లేదో అనే ఒత్తిడి తగ్గుతుంది. ఇలా పుట్టుకొచ్చిందే కన్‌ఫమ్ టికెట్.కామ్. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, యాప్, ఫంక్షన్స్ డెవలప్‌మెంట్ కోసం రెండేళ్లు శ్రమించి రూ.15 లక్షల పెట్టుబడితో 2014 జూలైలో దీన్ని ప్రారంభించాం.

 గుట్టంతా ఆల్గోరిథంలోనే..
 వెయింటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ కన్‌ఫమ్ అవుతుందో లేదో చెప్పాలంటే కాసింత శ్రమ తప్పదు. దీనికి టెక్నాలజీని జోడించి ప్రత్యేకమైన ఆల్గోరిథంను రూపొందించాం. అంటే పీఎన్‌ఆర్ నంబర్‌ను ఎంటర్ చేయగానే... సరిగ్గా అక్కడి నుంచి రెండు మూడు ఏళ్ల కిందటి వరకూ అదే నెలలో ఎన్ని టికెట్లు బుకింగ్ అయ్యాయి.. ఎన్ని రిజర్వ్ అయ్యాయి.. ఎన్ని క్యాన్సిల్ అయ్యాయి.. వంటి వివరాలన్నీ క్షణాల్లో తెలిసిపోతాయి. వీటి ఆధారంగా ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ కన్‌ఫమ్ అవుతుందో లేదో అంచనా వేస్తాం. టికెట్ కన్‌ఫర్మేషన్ అవకాశాలు 70 శాతం కంటే ఎక్కువుంటే కన్‌ఫమ్ అని, 30-70 శాతం మధ్య ఉంటే ప్రోబబుల్ అని, 30 శాతం కంటే తక్కువుంటే అవకాశం లేదని సూచిస్తాం. టికెట్ స్టేటస్ వివరాలను ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ రూపంలో తెలియజేస్తాం. టికెట్ కన్‌ఫమ్ కాగానే పీఎన్‌ఆర్ స్టేటస్ వివరాలు సరాసరి ఈ-మెయిల్‌కు పంపిస్తాం.

 90 శాతం నిజమవుతాయ్..
 ఇప్పటివరకు కన్‌ఫమ్ టికెట్.కామ్‌లో దేశంలోని 2,500 రైళ్ల నంబర్లు రిజిస్టరై ఉన్నాయి. ప్రస్తుతం మా సైట్‌ను రోజుకు 4వేల మంది, మొబైల్ యాప్‌ను రోజుకు 16 వేల మంది వినియోగించుకుంటున్నారు. వారాంతాల్లో, సెలవు దినాల్లో కూడా టికెట్ల కన్‌ఫర్మేషన్‌ను 90 శాతం కచ్చితంగా అంచనా వేస్తాం. ప్రస్తుతానికి ఉచితంగానే సేవలందిస్తున్నాం. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెలరోజుల్లో ఐఓఎస్ యాప్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తాం. ఒక్కోసారి డెరైక్ట్ రైళ్లలో టికెట్లు దొరక్కపోతే... సగం దూరం ఒకటి.. మరో సగం ఇంకో రైలు లాంటివి కూడా సూచిస్తాం.
 
 త్వరలో టికెట్ల బుకింగ్ కూడా..
 ఇటీవలే బెటర్‌ప్లేస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కో-ఫౌండర్ ప్రవీణ్ అగర్వాల్ లక్ష డాలర్ల పెట్టుబడి పెట్టారు. ‘‘పీఎన్‌ఆర్ స్టేటస్ వివరాలు చెప్పడం వరకే ఎందుకు పరిమితమయ్యారు? మీరే టికెట్ బుకింగ్ చేయొచ్చు కదా!’’ అని మా కస్టమర్లు చాలా మంది అడుగుతున్నారు. అందుకే రైల్వే శాఖతో సంప్రతింపులు జరిపాం. 4 నెలల్లో మా సైట్, యాప్ నుంచి రైలు టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తాం. ఆ తర్వాత బస్సు, విమానాల టికెట్లనూ బుక్ చేసుకునే సేవలను అందుబాటులోకి తెస్తాం. ఒక్కమాటలో చెప్పాలంటే సీటు దొరకలేదని ప్రయాణాన్ని విరమించకుండా.. కూర్చొని ప్రయాణం చేసేలా చేయడమే మా లక్ష్యం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement