న్యూఢిల్లీ: కొత్త సంవత్సర సంబరాల నేపథ్యంలో హోటళ్లు, రిసార్ట్‌లలో ఛార్జీలకు రెక్కలొచ్చేశాయి. ముఖ్యంగా రాజస్తాన్‌లోని హోటళ్లు టారిఫ్‌ల పండుగ చేసుకుంటున్నాయి. ఈ నెల 31వ తేదీ కోసం రాజస్తాన్‌లోని లగ్జరీ హోటళ్లు రూ.11 లక్షల వరకు వసూలు చేస్తుండడం డిమాండ్‌ను తెలియజేస్తోంది. సంపన్నులు ఖరీదైన హోటళ్లలో వేడుకలకు ఆసక్తి చూపిస్తుండడం హోటళ్లకు కలిసొస్తోంది. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ డిసెంబర్ 31న సూట్ కోసం రూ.11.03 లక్షలను చార్జ్ చేస్తోంది. ఉదయ్‌పూర్‌లోని తాజ్ లేక్ ప్యాలస్ టారిఫ్ జనవరి 1న అయితే రూ.11 లక్షలు దాటేసింది. అంతేకాదు ఈ నెల 31వ తేదీకి బుకింగ్‌లు కూడా అయిపోయాయి. జైపూర్‌లోని తాజ్ రామ్‌భాగ్ ప్యాలస్ గతేడాదితో పోలిస్తే ఈ నెల 31కి 7 శాతం అధికంగా రూ.8.53 లక్షల టారిఫ్‌ను వసూలు చేస్తోంది.
‘‘సాధారణంగా ప్రత్యేకమైన గదుల చార్జీలు సాధారణ వాటితో పోలిస్తే అధికంగా ఉంటాయి. కానీ, డిసెంబర్ 31 వంటి ప్రత్యేక సందర్భాల్లో వీటి చార్జీలు కూడా గణనీయంగా పెరిగిపోతుంటాయి. ఈ ఏడాది టారిఫ్‌లు 40 శాతం పెరిగాయి’’ అని తాజ్ రామ్‌భాగ్ ప్యాలస్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది రాజస్తాన్‌లో పర్యాటకం మంచి ఊపుతో ఉందని, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హోటళ్లలో ఆక్యుపెన్సీ రేషియో (భర్తీ) 90 శాతానికి చేరిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘దేశంలోని కొన్ని పట్టణాల్లోనే రాజస్తాన్ లో మాదిరిగా హోటళ్లు, రిసార్ట్‌ల టారిఫ్‌లు అధికంగా ఉన్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు రాజస్తాన్‌లోని చారిత్రక వారసత్వం ఉన్న ప్రాపర్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. డబ్బులు వారికి ద్వితీయ ప్రాధాన్యం. మంచి అనుభవం, గోప్యత, సౌకర్యాలకే వారి మొదటి ప్రాధాన్యం’’ అని ఐటీసీ రాజ్‌పుతానా జనరల్ మేనేజర్ శేఖర్ సావంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment