Luxury hotels
-
ఒబెరాయ్ గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత
ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, రిసార్ట్స్ ఛైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్(94) మంగళవారం ఉదయం అనారోగ్యం కారణంతో కన్నుమూశారు. 2002లో అతను తన తండ్రి మోహన్ సింగ్ ఒబెరాయ్ మరణం తర్వాత ఐఈహెచ్ లిమిటెడ్ ఛైర్మన్, డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2013 వరకు సంస్థ సీఈఓగా కొనసాగారు. మే 2022 వరకు పృథ్వీ రాజ్ సింగ్ ఈఐహెచ్ లిమిటెడ్ ఛైర్మన్, డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం తన పదవిని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన మేనల్లుడు అర్జున్ సింగ్ ఒబెరాయ్‌ను ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమించారు. ఒబెరాయ్ ఆరోగ్యం కోసం ఎక్కువ సమయం కేటాయించేవారని ఆయన కుమారుడు ఒబెరాయ్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ ఒబెరాయ్ తెలిపారు. పృథ్వీ రాజ్ సింగ్ ఇండియా, యూకే, స్విట్జర్లాండ్‌లో చదువు పూర్తిచేశారు. 1967లో దిల్లీలో ది ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్‌ని స్థాపించారు. టూరిజం, హాస్పిటాలిటీ రంగాల్లో చేసిన సేవలకు గాను 2008లో ఒబెరాయ్‌కు పద్మవిభూషణ్ లభించింది. 2008లో బిజినెస్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. లగ్జరీ హోటళ్లలో కలిస్తున్న వసతులకుగాను 2010లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. నవంబర్ 2010లో కార్పొరేట్ హోటలియర్ ఆఫ్ ది వరల్డ్ అవార్డు గెలుచుకున్నారు. ఫిబ్రవరి 2013లో ది ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ద్వారా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. 2015లో సీఎన్‌బీసీ టాప్ 15 భారతీయ వ్యాపార దిగ్గజాల్లో ఒకరిగా ఎంపికయ్యారు. -
హోటళ్ల వ్యాక్సినేషన్ ప్యాకేజీలు.. కేంద్రం కన్నెర
కరోనా టైంలో విలాసవంతమైన హోటల్స్ ఐసోలేషన్ సెంటర్లుగా మారిపోయాయి. ఈమధ్య అయితే ఏకంగా వ్యాక్సిన్ డోసులూ అందిస్తున్నాయి. వ్యాక్సినేషన్ పేరిట స్పెషల్ ప్యాకేజీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. హైదరాబాద్ సహా దేశంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ప్రైవేట్ ఆస్పత్రులతో చేతులు కలిపి లగ్జరీ హోటల్స్ ఈ దందాను నడిపిస్తున్నాయి. అయితే ఈ చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కన్నెర చేసింది. న్యూఢిల్లీ: ప్రైవేట్ ఆస్పత్రులు, హోటల్స్‌తో కలిసి నడిపిస్తున్న వ్యాక్సినేషన్ దందాలను సహించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్, వ్యాక్సినేషన్ గైడ్లెన్స్ కూడిన లేఖల్ని శనివారం పంపించారు. #Unite2FightCorona Health Ministry writes to States/UTs on some private hospitals giving package for #COVID19 Vaccination in collaboration with some hotels. Says it is against the guidelines issued for the National Covid Vaccination Program. pic.twitter.com/qum9SqOJtW — Ministry of Health (@MoHFW_INDIA) May 29, 2021 ఈమధ్య కొవిడ్ వ్యాక్సినేషన్ ప్యాకేజీల పేరుతో లగ్జరీ హోటల్స్ యాడ్స్ ఇచ్చుకుంటున్నాయి. ఫలానా రోజులకి, ఫలానా రేటంటూ ప్రకటించుకుంటున్నాయి. ఫుడ్, బెడ్, వైఫైలతో పాటు పేరుమోసిన పెద్ద ఆస్పత్రుల నుంచి సిబ్బందిని తెప్పించి కస్టమర్లకు వ్యాక్సిన్ డోసులు అందిస్తున్నాయి. ఈ ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. ఈ తరుణంలోనే కేంద్రం స్పందించింది. స్టార్ హోటళ్లలో టీకాలు వేయడం రూల్స్ విరుద్ధమని, తక్షణం కార్యక్రమాన్ని నిలిపివేసేలా చూడాలని, అవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆ మార్గదర్శకాల్లో ఆరోగ్యశాఖ కార్యదర్శి గట్టిగానే సూచించారు. కాగా, ఒకవైపు వ్యాక్సిన్ కొరత కొనసాగుతున్న వేళ.. ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ డోసులు అందించడంపై కొన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో తాజా ఆదేశాలు కొంచెం ఊరట ఇచ్చే అంశమే. ఇప్పటిదాకా మన దేశంలో 21 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఎక్కడెక్కడంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు, వర్క్ ప్లేసులు, వయసు మళ్లినవాళ్ల కోసం హోం కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు, గ్రూప్ హౌజింగ్ సొసైటీల దగ్గర వైకల్యం ఉన్నవాళ్లకు, ఆర్డబ్ల్యూఏ ఆఫీసుల్లో, కమ్యూనిటీ సెంటర్లలో, పంచాయితీ భవన్లలో, విద్యా సంస్థల్లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో టెంపరరీ బేస్ మీద వ్యాక్సిన్ అందించాలని కేంద్రం గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. ఈ మేరకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిశితంగా పరిశీలించాలని, అవకతవకలు జరిగితే కేసులు నమోదు చేయాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య శాఖ సూచించింది. -
31 జోష్.. ఒక్క రాత్రికి హోటల్ చార్జ్ 11 లక్షలు!
న్యూఢిల్లీ: కొత్త సంవత్సర సంబరాల నేపథ్యంలో హోటళ్లు, రిసార్ట్‌లలో ఛార్జీలకు రెక్కలొచ్చేశాయి. ముఖ్యంగా రాజస్తాన్‌లోని హోటళ్లు టారిఫ్‌ల పండుగ చేసుకుంటున్నాయి. ఈ నెల 31వ తేదీ కోసం రాజస్తాన్‌లోని లగ్జరీ హోటళ్లు రూ.11 లక్షల వరకు వసూలు చేస్తుండడం డిమాండ్‌ను తెలియజేస్తోంది. సంపన్నులు ఖరీదైన హోటళ్లలో వేడుకలకు ఆసక్తి చూపిస్తుండడం హోటళ్లకు కలిసొస్తోంది. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ డిసెంబర్ 31న సూట్ కోసం రూ.11.03 లక్షలను చార్జ్ చేస్తోంది. ఉదయ్‌పూర్‌లోని తాజ్ లేక్ ప్యాలస్ టారిఫ్ జనవరి 1న అయితే రూ.11 లక్షలు దాటేసింది. అంతేకాదు ఈ నెల 31వ తేదీకి బుకింగ్‌లు కూడా అయిపోయాయి. జైపూర్‌లోని తాజ్ రామ్‌భాగ్ ప్యాలస్ గతేడాదితో పోలిస్తే ఈ నెల 31కి 7 శాతం అధికంగా రూ.8.53 లక్షల టారిఫ్‌ను వసూలు చేస్తోంది. ‘‘సాధారణంగా ప్రత్యేకమైన గదుల చార్జీలు సాధారణ వాటితో పోలిస్తే అధికంగా ఉంటాయి. కానీ, డిసెంబర్ 31 వంటి ప్రత్యేక సందర్భాల్లో వీటి చార్జీలు కూడా గణనీయంగా పెరిగిపోతుంటాయి. ఈ ఏడాది టారిఫ్‌లు 40 శాతం పెరిగాయి’’ అని తాజ్ రామ్‌భాగ్ ప్యాలస్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది రాజస్తాన్‌లో పర్యాటకం మంచి ఊపుతో ఉందని, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హోటళ్లలో ఆక్యుపెన్సీ రేషియో (భర్తీ) 90 శాతానికి చేరిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘దేశంలోని కొన్ని పట్టణాల్లోనే రాజస్తాన్ లో మాదిరిగా హోటళ్లు, రిసార్ట్‌ల టారిఫ్‌లు అధికంగా ఉన్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు రాజస్తాన్‌లోని చారిత్రక వారసత్వం ఉన్న ప్రాపర్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. డబ్బులు వారికి ద్వితీయ ప్రాధాన్యం. మంచి అనుభవం, గోప్యత, సౌకర్యాలకే వారి మొదటి ప్రాధాన్యం’’ అని ఐటీసీ రాజ్‌పుతానా జనరల్ మేనేజర్ శేఖర్ సావంత్ తెలిపారు. -
రండి..రండి దయచేయండి!
పెద్ద హోటళ్లలో తగ్గిన ఆక్యుపెన్సీ నోట్ల రద్దుతో ‘ఆతిథ్యానికి’ భారీ ఎఫెక్ట్ గ్రేటర్లో రెండు నెలలుగా ఇదే పరిస్థితి మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడే భారీ తగ్గుదల సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని లగ్జరీ హోటళ్లకు పెద్ద నోట్ల రద్దు దెబ్బ తగిలింది. ఆక్కుపెన్సీ రేటు భారీగా పడిపోయింది. అతిథుల కోసం స్టార్ హోటళ్లు సైతం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే గత రెండునెలలుగా నగరంలోనే హోటల్స్ బుకింగ్స్ అధికంగా తగపట్టినట్లు గుర్గావ్లోని ‘హోటల్ రీసెర్చ్ అసోసియేషన్’ అనే సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరంలో బుకింగ్స్ నామమాత్రంగానే తగ్గాయి. అక్కడ 71.6 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదవగా..ఢిల్లీలో 62.3 శాతం, ఆ తర్వాత కోల్‌కతాలో 60 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదైంది. పొరుగునే ఉన్న బెంగళూరు నగరంలో 57.8 శాతం, చెన్నైలో 57 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదవగా..మన గ్రేటర్హైదరాబాద్ నగరంలో మాత్రం 56.4 శాతమే ఆక్యుపెన్సీ ఉందని ఆ సర్వే తేల్చింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగరంలోని పలు కార్పొరేట్, ఐటీ, బీపీఓ, కేపీఓ, బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక, ఆర్థికేతర సంస్థలు, ప్రభుత్వ విభాగాలు లగ్జరీ హోటళ్లను కాస్త దూరం పెట్టాయి. బడ్జెట్ హోటళ్లలోనే సాదాసీదాగా సమావేశాలు, సదస్సులు నిర్వహించడమూ దీనికి ప్రధాన కారణమని హోటల్‌రంగ నిపుణులు తెలిపారు. ఆక్యుపెన్సీ తగ్గేందుకు పలు కారణాలు.. ►నోట్ల రద్దు నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో కార్పొరేట్లు, ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల యజమానుల ఆలోచనా విధానం మారింది. ►అవనవసర ఖర్చులు, ప్రణాళికేతర వ్యయాన్ని బాగా తగ్గించడం. కాస్ట్‌కటింగ్ చర్యలకు ప్రాధాన్యతనివ్వడం. ►లగ్జరీ హోటళ్ల స్థాయిలో కాకపోయినా.. బడ్జెట్ హోటళ్లలోనూ సేవలు, ఆతిథ్యం, వసతులు మరింత మెరుగవడం. ►వివిధ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, మెడికల్టూరిజం, మార్కెటింగ్ తదితరాల పనుల నిమిత్తం నగరానికి వచ్చే విదేశీ, స్వదేశీ టూరిస్టులు సైతం లగ్జరీ హోటల్స్ కంటే బడ్జెట్ హోటళ్ల వైపు మొగ్గుచూపడం. ►మెట్రో నగరాల్లో గత రెండునెలలుగా లగ్జరీ హోటళ్లలో నమోదైన ఆక్యుపెన్సీ శాతం ఇలా ఉంది. భవిష్యత్ బడ్జెట్ హోటల్స్‌దే... రాబోయే రెండేళ్లలో(2017–19) పలు మెట్రో నగరాల్లో లగ్జరీ, సెవన్‌స్టార్, ఫైవ్‌స్టార్ హŸటల్స్ కంటే బడ్జెట్ హోటళ్లకే గిరాకీ అధికంగా ఉంటుందని తాజా సర్వే ఆధారంగా హోటల్స్ రీసెర్చ్ అసోసియేషన్ సంస్థ అంచనా వేసింది. ఆక్యుపెన్సీ(అతిథుల భర్తీ) విషయంలో బడ్జెట్హోటళ్ల సెగ్మెంట్లలో ఆయా నగరాల్లో పెరుగుదల శాతం ఇలా ఉంటుందని అంచనా వేసింది. విమానయానానికి తగలని నోట్లరద్దు సెగ... పెద్ద నోట్ల రద్దు దెబ్బకు నగరంలోని అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతోపాటు రైల్వే, ఆర్టీసీ వంటి సంస్థలకూ లాభాలు తగ్గిన విషయం విదితమే. అయితే నగరం నుంచి నిత్యం రాకపోకలు సాగించే 370 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు మాత్రం గిరాకీ ఏమాత్రం తగ్గలేదని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రోజువారీగా సుమారు 40 వేల మంది ప్రయాణికులు దేశంలోని వివిధ నగరాలతోపాటు విదేశాలకు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. పెద్దనోట్లు రద్దుతో దేశీయ,అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గించుకోలేదని పేర్కొన్నారు. విమాన టిక్కెట్లను ముందుగానే బుకింగ్చేసుకునే అవకాశం ఉండడం,నోట్లు రద్దయిన అనంతరం కూడా పాతనోట్లను చాలా కాలం టిక్కెట్ల బుకింగ్‌కు స్వీకరించడం, అత్యవసర ప్రయాణాలు అనివార్యం కావడం వంటి అంశాల కారణంగా విమాన ప్రయాణికులు తగ్గలేదని విశ్లేషించారు.