రండి..రండి దయచేయండి!
పెద్ద హోటళ్లలో తగ్గిన ఆక్యుపెన్సీ
నోట్ల రద్దుతో ‘ఆతిథ్యానికి’ భారీ ఎఫెక్ట్
గ్రేటర్‌లో రెండు నెలలుగా ఇదే పరిస్థితి
మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడే భారీ తగ్గుదల
సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని లగ్జరీ హోటళ్లకు పెద్ద నోట్ల రద్దు దెబ్బ తగిలింది. ఆక్కుపెన్సీ రేటు భారీగా పడిపోయింది. అతిథుల కోసం స్టార్ హోటళ్లు సైతం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే గత రెండునెలలుగా నగరంలోనే హోటల్స్ బుకింగ్స్ అధికంగా తగపట్టినట్లు గుర్గావ్‌లోని ‘హోటల్ రీసెర్చ్ అసోసియేషన్’ అనే సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరంలో బుకింగ్స్ నామమాత్రంగానే తగ్గాయి. అక్కడ 71.6 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదవగా..ఢిల్లీలో 62.3 శాతం, ఆ తర్వాత కోల్‌కతాలో 60 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదైంది.
పొరుగునే ఉన్న బెంగళూరు నగరంలో 57.8 శాతం, చెన్నైలో 57 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదవగా..మన గ్రేటర్‌హైదరాబాద్ నగరంలో మాత్రం 56.4 శాతమే ఆక్యుపెన్సీ ఉందని ఆ సర్వే తేల్చింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగరంలోని పలు కార్పొరేట్, ఐటీ, బీపీఓ, కేపీఓ, బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక, ఆర్థికేతర సంస్థలు, ప్రభుత్వ విభాగాలు లగ్జరీ హోటళ్లను కాస్త దూరం పెట్టాయి. బడ్జెట్ హోటళ్లలోనే సాదాసీదాగా సమావేశాలు, సదస్సులు నిర్వహించడమూ దీనికి ప్రధాన కారణమని హోటల్‌రంగ నిపుణులు తెలిపారు.
ఆక్యుపెన్సీ తగ్గేందుకు పలు కారణాలు..
►నోట్ల రద్దు నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో కార్పొరేట్లు, ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల యజమానుల ఆలోచనా విధానం మారింది.
►అవనవసర ఖర్చులు, ప్రణాళికేతర వ్యయాన్ని బాగా తగ్గించడం. కాస్ట్‌కటింగ్ చర్యలకు ప్రాధాన్యతనివ్వడం.
►లగ్జరీ హోటళ్ల స్థాయిలో కాకపోయినా.. బడ్జెట్ హోటళ్లలోనూ సేవలు, ఆతిథ్యం, వసతులు మరింత మెరుగవడం.
►వివిధ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, మెడికల్‌టూరిజం, మార్కెటింగ్ తదితరాల పనుల నిమిత్తం నగరానికి వచ్చే విదేశీ, స్వదేశీ టూరిస్టులు సైతం లగ్జరీ హోటల్స్ కంటే బడ్జెట్ హోటళ్ల వైపు మొగ్గుచూపడం.
►మెట్రో నగరాల్లో గత రెండునెలలుగా లగ్జరీ హోటళ్లలో నమోదైన ఆక్యుపెన్సీ శాతం ఇలా ఉంది.
భవిష్యత్ బడ్జెట్ హోటల్స్‌దే...
రాబోయే రెండేళ్లలో(2017–19) పలు మెట్రో నగరాల్లో లగ్జరీ, సెవన్‌స్టార్, ఫైవ్‌స్టార్ హŸటల్స్ కంటే బడ్జెట్ హోటళ్లకే గిరాకీ అధికంగా ఉంటుందని తాజా సర్వే ఆధారంగా హోటల్స్ రీసెర్చ్ అసోసియేషన్ సంస్థ అంచనా వేసింది. ఆక్యుపెన్సీ(అతిథుల భర్తీ) విషయంలో బడ్జెట్‌హోటళ్ల సెగ్మెంట్లలో ఆయా నగరాల్లో పెరుగుదల శాతం ఇలా ఉంటుందని అంచనా వేసింది.
విమానయానానికి తగలని నోట్లరద్దు సెగ...
పెద్ద నోట్ల రద్దు దెబ్బకు నగరంలోని అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతోపాటు రైల్వే, ఆర్టీసీ వంటి సంస్థలకూ లాభాలు తగ్గిన విషయం విదితమే. అయితే నగరం నుంచి నిత్యం రాకపోకలు సాగించే 370 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు మాత్రం గిరాకీ ఏమాత్రం తగ్గలేదని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రోజువారీగా సుమారు 40 వేల మంది ప్రయాణికులు దేశంలోని వివిధ నగరాలతోపాటు విదేశాలకు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. పెద్దనోట్లు రద్దుతో దేశీయ,అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గించుకోలేదని పేర్కొన్నారు. విమాన టిక్కెట్లను ముందుగానే బుకింగ్‌చేసుకునే అవకాశం ఉండడం,నోట్లు రద్దయిన అనంతరం కూడా పాతనోట్లను చాలా కాలం టిక్కెట్ల బుకింగ్‌కు స్వీకరించడం, అత్యవసర ప్రయాణాలు అనివార్యం కావడం వంటి అంశాల కారణంగా విమాన ప్రయాణికులు తగ్గలేదని విశ్లేషించారు.