నగదు రహితం సాధ్యమేనా..
డిజిటల్ లావాదేవీలపై
అవగాహన లేని గ్రామీణులు
బ్యాంకులకు వెళ్లడమే
ఏడాదికి ఒకటి, రెండు సార్లు..
జిల్లాలో నిరక్షరాస్యులే అధికం..
నర్సంపేట : నల్లధనం వెలికితీత పేరుతో పెద్ద నోట్లను కేంద్రప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి మొదలైన సామాన్యుల కష్టాలు ఇంకా తీరడం లేదు. నోట్ల డిపాజిట్, మార్పిడికి గడువు ముగిసిన నేపథ్యంలో.. నగదు రహిత లావాదేవీల నిర్వహణ సాధ్యమేనా అనే అనుమానాలు పలువురిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్న జనాభాలో 93.01 శాతం గ్రామాల్లో నివసిస్తుండడం.. సగం మంది కూడా అక్షరాస్యులు కాకపోవడంతో ఈ జిల్లాలో నగదు రహిత లావాదేవీలు కత్తి మీద సామేనని పలువురు భావిస్తున్నారు.
విరుగుడు ఇదే.. పెద్ద నోట్లను రద్దు చేశాక
ఏర్పడిన అనూహ్య పరిస్థితులు సద్దుమణగాలంటే నగదు రహిత చెల్లింపులే మార్గమని ప్రభుత్వం చెబుతోంది. దీనికి అనుగుణంగా పూర్తిస్థాయిలో ప్రజలకు సాంకేతిక సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇది సాధ్యమేనా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ, సగం జనాభా కూడా అక్షరాస్యులు లేని వరంగల్ రూరల్ జిల్లాలో నగదు రహిత లావాదేవీలు చేయడం సాధ్యం కాక ఆయా వర్గాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. నోట్ల మార్పిడికి బ్యాంకుల్లో ద్రువీకరణ పత్రం రాసేందుకు పేదలు ఇతరులపై ఆధారపడుతుండగా నగదు రహిత వ్యవస్థకు వరంగల్ జిల్లా ఎంత దూరమో ఇట్టే చెప్పొచ్చు.