పేటీఎమ్‌ ‘యస్‌’ డీల్‌! | Rana Kapoor talks with Paytm to sell stake in Yes Bank | Sakshi
Sakshi News home page

పేటీఎమ్‌ ‘యస్‌’ డీల్‌!

Published Wed, Sep 11 2019 5:38 AM | Last Updated on Wed, Sep 11 2019 5:42 AM

Rana Kapoor talks with Paytm to sell stake in Yes Bank - Sakshi

న్యూఢిల్లీ/ముంబై: యస్‌ బ్యాంక్‌లో కొంత వాటాను డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజ సంస్థ, పేటీఎమ్‌ కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాణా కపూర్, ఆయనకు సంబంధించిన సంస్థలకు యస్‌బ్యాంక్‌లో 9.6 శాతం మేర వాటా ఉంది. ఈ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేయడానికి పేటీఎమ్‌  యాజమాన్య సంస్థ, వన్‌97 కమ్యూనికేషన్స్‌ చర్చలు జరుపుతోందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఆర్‌బీఐ ఆమోదాన్ని బట్టి ఒప్పందం స్వరూపం ఆధారపడి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పేటీఎమ్‌ వ్యవస్థాపకులు విజయ్‌ శేఖర శర్మకు ఇప్పటికే పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో వాటా ఉండటంతో ఆర్‌బీఐ ఆమోదాన్ని బట్టి డీల్‌ స్వరూపం ఉంటుందని ఆ వర్గాలు వివరించాయి.

ప్రస్తుతానికైతే, సంస్థాగత ఇన్వెస్టర్లు ఒక బ్యాంక్‌లో  5 శాతం మేర ఇన్వెస్ట్‌ చేయవచ్చు. కాగా ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి పేటీఎమ్, యస్‌బ్యాంక్‌లు  నిరాకరించగా, రాణా కపూర్‌ అందుబాటులో లేరు. యస్‌ బ్యాంక్‌ ఇటీవలనే క్యూఐపీ(క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌) ద్వారా రూ.1,930 కోట్ల నిధులు సమీకరించింది. మరిన్ని పెట్టుబడులు సమీకరించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో యస్‌ బ్యాంక్‌కు రూ.1,507 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. బ్యాంక్‌ చరిత్రలో ఇవే అత్యధిక నష్టాలు. మొండిబకాయిలకు కేటాయింపులు కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.114 కోట్ల నికర లాభం సాధించింది.  

టెక్‌ కంపెనీకి వాటా  
యస్‌ బ్యాంక్‌లో మైనారిటీ వాటా విక్రయాన్ని అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థకు విక్రయించే ఒప్పందం దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ డీల్‌లో భాగంగా 10 శాతం కంటే తక్కువ వాటాను ప్రపంచంలోనే టాప్‌ త్రీ టెక్నాలజీ కంపెనీల్లో ఒకదానికి విక్రయించనున్నామని యస్‌ బ్యాంక్‌ సీఈఓ, ఎమ్‌డీ రవ్‌నీత్‌ గిల్‌ పేర్కొన్నారు. ఆ సంస్థ ఇంతవరకూ భారత్‌లోని ఏ బ్యాంక్‌లో ఇన్వెస్ట్‌ చేయలేదని కూడా ఆయన తెలిపారు. సంస్థ పేరును ఆయన వెల్లడించలేదు. ఈ టెక్నాలజీ కంపెనీ పెట్టుబడుల వల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ సంస్థతో పాటు మరో రెండు మూడు సంస్థలు 20 కోట్ల డాలర్ల నుంచి 25 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేయడానికి ఆసక్తిగా ఉన్నాయని వెల్లడించారు.  
 యస్‌ బ్యాంక్‌ షేర్‌ సోమవారం బీఎస్‌ఈలో 4.5 శాతం లాభపడి రూ.63.10 వద్ద ముగిసింది.

పేటీఎమ్‌ నష్టాలు రూ.4,217 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో పేటీఎమ్‌ నష్టాలు భారీగా పెరిగాయి. 2019, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పేటీఎమ్‌ నష్టాలు 193 శాతం ఎగసి రూ.4,217 కోట్లకు పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.1.604 కోట్లుగా ఉన్నాయి. ఇక ఆదాయం రూ.3,052 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.3,232 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.4,864 కోట్ల నుంచి 60 శాతం ఎగసి రూ.7,730 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు పంపిన వార్షిక నివేదికలో ఈ వివరాలను పేటీఎమ్‌ వెల్లడించింది. కాగా ఈ వివరాలకు సంబంధించిన కాపీని పేటీఎమ్‌ ఇంకా కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించలేదు. వ్యాపార విస్తరణ కోసం గత రెండేళ్లలో రూ.14,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేశామని, రానున్న రెండేళ్లలో రూ.21,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నామని ఇటీవలే పేటీఎమ్‌ వెల్లడించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement