టాటా గ్రూప్ ఏ ఒక్కరిదో కాదు..
అది వాటాదారులందరిదీ
ట్రస్ట్‌ల వ్యవహారంపై జోక్యం చేసుకోండి
ప్రభుత్వాన్ని కోరిన సైరస్ మిస్త్రీ
టీసీఎస్ ఈజీఎం నేపథ్యంలో వాటాదారులకు మిస్త్రీ లేఖ
ముంబై: టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ... టాటాలపై ముఖ్యంగా రతన్‌టాటాపై పోరును మరింత ఉధృతం చేశారు. టాటా ట్రస్ట్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 10 వేల కోట్ల డాలర్ల టాటా సామ్రాజ్యానికి హోల్డింగ్ కంపెనీ అరుున టాటా సన్‌సను టాటా ట్రస్టే నిర్వహిస్తోంది. ‘‘నిర్ణయాధికారం ఒక్క మనిషి చేతిలో ఉండటమనేది మంచిది కాదు. ఇలాంటి అధిష్టానం నీతిబాహ్యం, మోసపూరితం’’ అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
టాటా గ్రూప్ ఏ ఒక్కరిదో కాదని, అది వాటాదరులందరికీ చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ‘‘టాటా గ్రూప్ ఏ ఒక్క వ్యక్తి సొత్తూ కాదు. టాటా ట్రస్ట్‌ల ట్రస్టీలదో, టాటా సన్‌స డెరైక్టర్లదో లేదా టాటా కంపెనీలను నిర్వహిస్తున్న ఆయా కంపెనీల డెరైక్టర్లదో కాదు. అది టాటా గ్రూప్ వాటాదారులందరిదీ’’ అని ఆయన పేర్కొన్నారు. 20 లక్షలకు పైగా మైనారిటీ వాటాదారులకు రాసిన లేఖలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు.
ఇష్టానుసారం రతన్ టాటా నిర్ణయాలు..
టీసీఎస్ నుంచి మిస్త్రీని డెరైక్టర్ల బోర్డ్ నుంచి తొలగించడానికి ఈ నెల 13న టీసీఎస్ అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని (ఈజీఎమ్) నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన వాటాదారులకు ఒక లేఖ రాశారు. రతన్ టాటా బాధ్యత లేకుండా తన చిత్తానుసారం నిర్ణయాలు తీసుకున్నారని లేఖలో మిస్త్రీ విమర్శించారు. పరిణామాల గురించి ఆలోచించకుండా రతన్ టాటా పలు తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. పరోక్షంగా వ్యక్తిగత ప్రయోజనాలు పొందే నిర్ణయాలపై నియంత్రణ ఉండాల్సిన అవసరముందన్నారు. టాటా సన్‌సలో మిస్త్రీ కుటుంబానికి 18.4 శాతం వాటా ఉండగా, దాన్లో 66 శాతానికి పైగా వాటాలున్న వివిధ టాటా ట్రస్ట్‌లకు రతన్ టాటా జీవిత కాల చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించండి
గ్రూప్ కంపెనీలపై టాటా ట్రస్ట్‌ల్లోని నామినీ డెరైక్టర్లకున్న వీటో అధికారాలను రతన్ టాటా దుర్వినియోగం చేశారని మిస్త్రీ విమర్శించారు. ఇటీవలి పరిణామాల కారణంగా టాటా ట్రస్ట్‌లు, టాటా సన్‌సల్లో గవర్నెన్‌స పూర్తిగా స్తంభించిపోరుుందని తెలిపారు. ‘‘టాటా మోటార్స్‌కు ఉత్పాదకతతో కూడిన ప్రోత్సాహకాలివ్వాలనే నా కీలకమైన సంస్కరణను రతన్ టాటా తుంగలో తొక్కారు. వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి కాకుండా ఇంటా బయటా వస్తున్న ప్రమాదాల నుంచి టాటా గ్రూప్‌ను రక్షించడానికే నేను పనిచేశా. నా నాలుగేళ్ల చైర్మన్ పదవీ కాలంలో మీడియాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. చైర్మన్‌గా పనిచేసిన కాలం నాకు సంతృప్తికరంగా ఉంది. మంచి ఫలితాలు వచ్చారుు’’ అని మిస్త్రీ పేర్కొన్నారు. వాటాదారులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా, స్పష్టంగా వెల్లడించాలంటూ ఈ లేఖను ఆయన ముగించారు.
నష్టాలకు మిస్త్రీయే బాధ్యుడు: టాటా సన్స్
టాటా సన్‌స ట్రస్ట్‌ల గవర్నెన్‌స సవ్యంగా లేదంటూ సైరస్ మిస్త్రీ చేసిన ఆరోపణలను టాటా సన్‌స తోసిపుచ్చింది. జెంషెడ్జీ టాటా, ఆయన ఇరువురి కుమారులు, దొరాబ్జి టాటా, రతన్‌జీ టాటా, ఇతర వ్యవస్థాపకుల ఆశయాలకనుగుణంగానే టాటా ట్రస్ట్‌లు పనిచేస్తున్నాయని టాటా సన్‌స పేర్కొంది. గ్రూప్ కంపెనీలకు భారీగా ఆర్థిక నష్టాలు రావడానికి సైరస్ మిస్త్రీయే కారణమని విమర్శించింది. టాటా సన్‌స చైర్మన్ అరుున తర్వాత సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్‌ను సొంత సామ్రాజ్యంగా మార్చుకున్నారని, ఏక్షపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని దాడి చేసింది.
సైరస్‌కు ఐఎస్‌ఎస్ బాసట..
కాగా టీసీఎస్, ఇతర టాటా గ్రూప్ కంపెనీల నుంచి డెరైక్టర్‌గా సైరస్ మిస్త్రీని తొలగించడానికి వ్యతిరేకంగా వాటాదారులు ఓటు వేయాలని గ్లోబల్ ప్రాక్సీ సలహా సంస్థ ఐఎస్‌ఎస్ కోరింది. మిస్త్రీని తొలగించడానికి టాటా సన్‌స సరైన ఆధారాలు చూపలేకపోరుుందని అభిప్రాయపడింది. మరోవైపు మరో రెండు ప్రాక్సీ అడ్వైజరీ సంస్థలు-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (ఐఐఏఎస్), ఎస్‌ఈఎస్‌లు మాత్రం మిస్త్రీని తొలగించే ప్రతిపాదనకే ఓటు వేయాలని మైనారిటీ వాటాదారులను కోరారుు.