ముంబై: రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) పరపతి విధాన సమీక్ష, కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు వంటి దేశీ అంశాలకు తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించిన నిర్ణయం ఈ వారం స్టాక్ మార్కెట్‌కు అత్యంత కీలక కానున్నట్లు దలాల్ స్ట్రీట్ పండితులు సూచిస్తున్నారు. ఆగస్టు 1న వెలువడనున్న ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం సమీపకాలంలో మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘ద్రవ్యోల్బణం డేటా ఆధారంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఆర్‌బీఐ వైఖరి తటస్థం నుంచి కఠినతరమైన నిర్ణయం వైపునకు మళ్లింది. వడ్డీరేట్ల అంశం ఏవిధంగా ఉండనుందనే అంశం ఆధారం గానే సమీపకాలంలో మార్కెట్ దిశానిర్దేశం ఉంటుంది’ అని డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి విశ్లేషించారు. 8 కీలక రంగాల ఉత్పత్తి, ద్రవ్య లోటు లాంటి అంశాలు సైతం ఈ వారంలో మార్కెట్‌కు అత్యంత కీలకంగా మారనున్నాయని అన్నారు. ఇదే వారంలో వెల్లడికానున్న ఆటోమొబైల్ అమ్మకాల డేటా, నికాయ్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) సమాచారంపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించినట్లు తెలియజేశారు. ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని ఎస్‌ఎమ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు.
క్యూ1 ఫలితాలపై ఫోకస్..!
ఈ వారంలో వెల్లడయ్యే కార్పొరేట్ ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నట్లు హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ అన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్ర ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో ఎంపిక చేసిన షేర్ల కొనుగోలు విధానంలోనే తాము ఉన్నట్లు వెల్లడించారు. ‘తొలి త్రైమాసిక ఫలితాల ప్రభావం మార్కెట్‌పై కొనసాగుతుంది. ఆయా షేర్లు, రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది’ అని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ఐడియా సెల్యూలార్, ఐడీఎఫ్‌సీ, శ్రీ సిమెంట్ జులై 30న ఫలితాలు ప్రకటించనుండగా.. బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాబర్ ఇండియా, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, వేదాంత 31న ఫలితాలను వెల్లడించనున్నాయి.
జూలైలో విదేశీ ఇన్వెస్టర్ల నికర కొనుగోళ్లు
జూలై 2–27 మధ్యలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.1,848 కోట్ల షేర్లను నికరంగా కొనుగోలుచేశారు. అయితే, ఇదే సమయంలో డెట్ మార్కెట్‌లో రూ.482 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఏప్రిల్–జులై కాలంలో రూ.20,000 కోట్ల విలువైన షేర్లను అమ్మివేసిన విదేశీ పెట్టుబడిదారులు.. జులైలో నికరంగా కొనుగోళ్లు జరపడాన్ని ఇప్పుడే సానుకూల అంశంగా భావించలేమని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకులు హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. ఇది ఒక స్వల్పకాలిక ఎత్తుగడగా తాము భావిస్తున్నట్లు చెప్పారు.
11,410 వద్ద కీలక నిరోధం
‘నిఫ్టీకి అత్యంత కీలక నిరోధం 11,410 పాయింట్ల వద్ద ఉంది. దిగువస్థాయిలో 11,071 వద్ద మద్దతు ఉంది.’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు.
ఈ వారం ప్రధానాంశాలు
జూలై 31 మౌలిక పరిశ్రమల గణాంకాలు
ఆగస్టు 1 ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం
ఆగస్టు 1 ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం
ఆగస్టు 1 నికాయ్ తయారీ పీఎంఐ
ఆగస్టు 3 నికాయ్ సేవల పీఎంఐ
నేడే టీసీఎన్‌ఎస్ క్లోతింగ్ లిస్టింగ్
మహిళల దుస్తుల తయారీ సంస్థ టీసీఎన్‌ఎస్ క్లోతింగ్ సోమవారం (జులై 30, 2018న) లిస్టింగ్ కానుంది. రూ.1,125 కోట్ల నిధుల సమీకరణ కోసం జులై 18–20 తేదీలలో ఐపీఓకు వచ్చిన ఈ సంస్థకు ప్రైమరీ మార్కెట్‌లో భారీ స్పందన లభించింది. 1.57 కోట్ల షేర్లకు పబ్లిక్ ఆఫర్ ఇవ్వగా, 5 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఇష్యూ ధర రూ.714–716.
Comments
Please login to add a commentAdd a comment