
ఆర్‌బీఐ పాలసీ, ఈ వారంలో వెలువడే కొన్ని దిగ్గజ కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకమని నిపుణులంటున్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం గమనం, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి కూడా ఈ వారం స్టాక్ సూచీల కదలికలను నిర్దేశిస్తాయని వారంటున్నారు. ఇక నేడు(సోమవారం) వెలువడే సేవల రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్‌ఐ) గణాంకాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు.
వెయ్యి కంపెనీల ఫలితాలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరిదైన ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ సమావేశం మంగళవారం(రేపు) మొదలై బుధవారం ముగుస్తుంది. కీలక రేట్లపై ఈ నెల 7(బుధవారం)న ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఈ వారంలో దాదాపు వెయ్యి వరకూ కంపెనీలు క్యూ3 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, టాటా మోటార్స్, హీరో మోటొకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, భెల్, సెయిల్, లుపిన్, సిప్లా, అరబిందో ఫార్మా, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ తదితర కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయి.
ఎల్‌టీసీజీ ప్రభావం తాత్కాలికమే...
వచ్చే ఆర్థిక సంవత్సర ద్రవ్యలోటు అంచనాలను మించడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం తదితర అంశాల కారణంగా వడ్డీరేట్ల విషయమై ఆర్‌బీఐ కఠినంగా వ్యవహరించే అవకాశాలున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఎల్‌టీసీజీ విధింపు తాత్కాలికంగానే ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. బడ్జెట్ సంబంధిత ఒడిదుడుకులు ఎక్కువ కాలం కొనసాగిన దాఖలాలు లేవని, మార్కెట్ దృష్టి కంపెనీల ఫలితాలు, ఇతర ఆర్థిక విషయాలపైకి మరలుతుందన్నారు.
గత రెండు నెలలుగా మార్కెట్ అధిక వేల్యూయేషన్‌తో ట్రేడవుతోందని, బడ్జెట్ తర్వాత పతనమైందని యాక్సిస్ సెక్యూరిటీస్ ఎమ్‌డీ, సీఈఓ అరుణ్ తుక్రల్ తెలిపారు. ఎల్‌టీసీజీతో ఇన్వెస్టర్లు నిరాశ చెందారని అరిహంత్ క్యాపిటల్ డైరెక్టర్ అనితా గాంధీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకునేలా బడ్జెట్ ఉందని, భారత వృద్ధిని మరో మెట్టుపైకి తీసికెళ్లేలా బడ్జెట్ ఉందని, అయితే అమలు కీలకం కానున్నదని పేర్కొన్నారు. ద్రవ్యలోటు లక్ష్యాన్ని మీరకుండా బడ్జెట్‌లో ప్రతిపాదించిన భారీ పథకాలు అమలు సాధ్యాసాధ్యాలపై అనిశ్చితి నెలకొన్నదని జియోజిత్ ఫైనాన్షియల్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు.
గెలాక్సీ లిస్టింగ్...: గెలాక్సీ సర్ఫ్‌క్టాంట్స్ కంపెనీ షేర్ ఈ నెల 8న (గురువారం) స్టాక్‌మార్కెట్లో లిస్ట్ కానున్నది. గత నెల 29–31 మధ్య రూ. 1,470–1,480 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.937 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ 20 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది.
జనవరిలో రూ.22,000 కోట్ల విదేశీ పెట్టుబడులు..
విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన క్యాపిటల్ మార్కెట్లో గత నెలలో భారీగా పెట్టుబడులు పెట్టారు. కంపెనీల క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలు, బాండ్ల ఈల్డ్‌లు ఆకర్షణీయంగా ఉండడం, కొత్త ఏడాది ఖాతాల ప్రారంభం సందర్భంగా కొనుగోళ్లు చోటు చేసుకోవడం తదితర కారణాల వల్ల ఈ ఏడాది జనవరిలో మన క్యాపిటల్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.22,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఎఫ్‌పీఐలు మన స్టాక్ మార్కెట్లో రూ.13,781 కోట్లు, డెట్‌మార్కెట్లో రూ.8,473 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment