ఆర్బీఐ ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంక్ రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు (బుధవారం ) పాలసీ రివ్యూను ప్రకటించనుంది. ముఖ్యంగా బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ సమీక్షలో పాలసీ రేట్లను మార్చకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం మీడియా టెర్మ్ టార్గెట్‌ను రీచ్ అయినప్పటికీ కనీసం 2019 మధ్యవరకు అయినా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని రాయిటర్స్ పోల్ అంచనా వేసింది. ఆర్‌బీఐ కీలక ప్రస్తుతవడ్డీ రేట్లను కొనసాగిస్తుందని, రెపో 6 శాతం, రివర్స్ రిపో 5.75 శాతం వద్ద ఉంచుతుందనే అభిప్రాయం బడ్జెట్ ప్రకటన తర్వాత తీసుకున్న 60 మంది ఆర్థికవేత్తల పోల్‌లో వ్యక్తమైంది.
ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉండడంతో.. రాబోయే కాలంలో ధరల అదుపునకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లలో మార్పులను చేసే ఆలోచన చేయదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత 17 నెలలలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుందని భావించారు. ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రభుత్వం ముందుగా చెప్పిన ద్రవ్య పరపతి మార్గాల నుంచి వైదొలగిందని, దీంతో ఆర్‌బీఐ రేట్లపెంపు ఒత్తిడి బాగా ఉందనీ, అయితే సమీప కాల వ్యవధిలో యథాతథాన్నే తాము ఆశిస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ సీనియర బ్యాంక్ ఆర్థికవేత్త తుషార్ అరోరా పేర్కొన్నారు. బడ్జెట్‌లో తీసుకున్న కనీస మద్దతు ధరల పెంపు నిర్ణయం, జీడీపీ అంశాలు ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయని మరో ఎనలిస్ట్ శశాంక్ మెండిరట్టా వ్యాఖ్యానించారు.
డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రాబోయే 12 నెలల్లో ఆర్‌బీఐ 4 శాతం లక్ష్యాన్ని మించకుండా ఉంటుందని భావిస్తున్నారు. మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది. మరోవైపు అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ఆయిల్ ధరలు కూడా ద్రవ్యోల్బణ పెరుగుదలకు కారణం అయింది. రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచే చర్యల్లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యయాన్ని పెంచారు. అలాగే ఫిబ్రవరి 1 నాటి తన వార్షిక బడ్జెట్ ప్రసంగంలో పెద్ద ఆర్థిక లోటు లక్ష్యం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment