న్యూఢిల్లీ: ఆర్‌బీఐ బాండ్ల మార్కెట్‌లో అధిక ఈల్డింగ్ ఒత్తిళ్లకు అతిగా స్పందించొద్దని, ఈ నెల 7న జరిగే మానిటరీ కమిటీ పాలసీ సమీక్షలో రేట్ల పెంపు నిర్ణయానికి దూరంగా ఉండాలని పారిశ్రామిక సంఘం అసోచామ్ కోరింది. ‘‘రానున్న ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 3.3%గా పేర్కొనడం అన్నది క్లిష్టమైనది. బాండ్ల మార్కెట్‌కు సంబంధించిన ప్రతికూలతలు త్వరలోనే తేలికపడతాయి’’ అని అసోచామ్ బడ్జెట్ అనంతరం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
కనీస మద్దతు ధర వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిపోతుందన్నది అతిశయోక్తిగా అభివర్ణించింది. కూరగాయలకు క్షేత్ర స్థాయిలో ఎటువంటి కనీస మద్దతు ధర లేని విషయాన్ని గుర్తు చేసింది. ‘‘కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచుతామన్న కేంద్రం హామీ లు, బాండ్ల మార్కెట్లో రాబడులకు ఆర్‌బీఐ అతిగా స్పందించకూడదు. ఫిబ్రవరి 7న జరిగే మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఏ విధమైన రేట్ల పెంపునకు కూడా దూరంగా ఉండాలి’’ అని అసోచామ్ సూచించింది.
కనీస మద్దతు ధర నిర్ణయంలో రైతుల ప్రయోజనాలు, రిటైల్ ధరలను యంత్రాంగం దృష్టిలోకి తీసుకుని సమతూకం పాటిస్తుందని, ఈ విషయంలో ఏదైనా తక్షణ ఆందోళన అనేది అతియేనని, పాలసీ రేట్ల నిర్ణయంలో ఆర్‌బీఐ వీటిని పరిగణనలోకి తీసుకోరాదని పేర్కొంది. స్టాక్ మార్కెట్లో కరెక్షన్ అన్నది ఆరోగ్యకరంగా అభివర్ణించింది.
Comments
Please login to add a commentAdd a comment