ఆర్‌బీఐ బంగారం విలువ డౌన్!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద ఉన్న బంగారం విలువ గడచిన అకౌంటింగ్ ఇయర్‌లో (జూలై 2013-జూన్ 2014) భారీగా పడింది. అయితే పరిమాణంలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. 557.75 టన్నుల బంగారం ఆర్‌బీఐ వద్ద ఉంది. ఈ పరిమాణం విలువ 2012-13 అకౌంటింగ్ ఇయర్‌లో రూ.1,28,685 కోట్లు కాగా, 2013-14 అకౌంటింగ్ ఇయర్‌లో రూ.1,24,002 కోట్లకు తగ్గింది. అంటే ఈ విలువ దాదాపు రూ. 4,683 కోట్లు తగ్గిందన్నమాట. అంతర్జాతీయంగా ఈ మెటల్ విలువ తగ్గడం దీనికి కారణం. ఆర్‌బీఐ గురువారం విడుదల చేసిన తన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది.
15 శాతం తగ్గిన మిగులు
కాగా ఆర్‌బీఐ మిగులు(లాభం) గడచిన అకౌంటింగ్ ఇయర్‌లో 14.75 శాతం తగ్గింది. రూ. 52,679 కోట్లుగా నమోదయ్యింది. విదేశీ సావరిన్ బాండ్లపై చేసిన పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయం తగ్గడమే తన మిగులు తగ్గడానికి కారణమని ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. పెట్టుబడులు పెరిగినప్పటికీ వడ్డీ ఆదాయం మాత్రం తగ్గినట్లు తెలిపింది. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ 10 శాతం పెరిగింది. రూ.23,90,700 కోట్ల నుంచి రూ.26,24,400 కోట్లకు చేరింది. ఆర్‌బీఐ స్థూల ఆదాయం 13.10 శాతం తగ్గి రూ.64,617 కోట్లకు పడింది. వ్యయం 4.9 శాతం తగ్గి రూ.11,934 కోట్లకు దిగింది. నికర మిగులు మొత్తం రూ.52,679 కోట్లను ఆర్‌బీఐ ఈ నెల 11న కేంద్రానికి బదలాయించింది.