
సెబీకి రూ.300 కోట్లు చెల్లిస్తాం
సుప్రీంకు సహారా వెల్లడి
న్యూఢిల్లీ: మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి రూ.300 కోట్లు చెల్లిస్తామని సహారా చీఫ్ సుబ్రతారాయ్ శుక్రవారం సుప్రీంకోర్టుకు విన్నవించారు. అయితే ఈ మొత్తాన్ని బ్యాంక్ గ్యారెంటీగా పరిగణించాలని కోరారు. సెప్టెంబర్ 16 లోపు రూ.300 కోట్ల చెల్లింపు షరతుపై రాయ్ ప్రస్తుతం పెరోల్‌పై ఉన్నారు. రెండు గ్రూప్ సంస్థలు మదుపరులకు డబ్బు (వడ్డీతో కలిపి దాదాపు రూ.36,000 కోట్లు) పునఃచెల్లింపుల వైఫల్యం కేసులో సహారా చీఫ్ దాదాపు రెండేళ్లు తీహార్ జైలులో గడిపారు.
ఆయన బెయిల్ మంజూరుకు రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇందులో రూ.5,000 కోట్లను బ్యాంక్ గ్యారెంటీగా సమర్పించాల్సి ఉంది. తల్లి మృతి నేపథ్యంలో పెరోల్‌పై బయటకు వచ్చిన రాయ్, బెయిల్ పొందడానికి చెల్లించాల్సిన రూ.10,000 కోట్లలో కొంత నిర్దిష్ట మొత్తాలను వాయిదాల రూపంలో చెల్లిస్తూ.. పెరోల్‌పై కొనసాగుతున్నారు.