హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలతో పాటు ఈ రంగంలో సంపదను సృష్టిస్తున్న శ్రీమంతులూ పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా టాప్–15 మంది రియల్టీ కుబేరుల్లో తెలంగాణ నుంచి ‘మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్’ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు తొలిసారిగా స్థానం దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా రియల్టీ దిగ్గజాల్లో ఈయన 14వ స్థానంలో నిలిచారు. ఈ మేరకు ‘గ్రోహె– హురున్ ఇండియా రియల్ ఎస్టేట్’ 2018వ సంవత్సరానికి సంబంధించిన జాబితా విడుదల చేసింది.
హైదరాబాద్ నుంచి తొలి స్థానంలో నిలిచిన రామేశ్వర్ రావు సంపద... రూ.3,300 కోట్లు. హైదరాబాద్ నుంచి రెండో స్థానంలో నిలిచింది... తాజ్ అండ్ జీవీకే హోటల్స్ అధినేత జీవీకే రెడ్డి, ఆయన కుటుంబం. వీళ్ల సంపద విలువ రూ.1,080 కోట్లు! దేశవ్యాప్తంగా వంద మంది రియల్టీ కుబేరుల జాబితాలో జీవీకే 63వ స్థానంలో నిలిచారు. ఇక, రూ.980 కోట్ల సంపదతో అపర్ణా కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రతినిధులు సి.వెంకటేశ్వర రెడ్డి, ఎస్ సుబ్రమణ్యం రెడ్డిలు మూడో స్థానంలో నిలిచారు. గ్రోహే జాతీయ జాబితాలో వీళ్లది 66వ స్థానం!
లెక్కించింది ఇలా...
జర్మనీకి చెందిన ప్రీమియం శానీటరీ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రోహే. మన దేశంలో పుట్టి, ఇక్కడే పెరిగిన రియల్టీ వ్యాపారస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించారు. దేశంలోని 100 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల మొత్తం సంపద విలువ రూ.2,36,610 కోట్లు. 2017తో పోలిస్తే ఇది 27 శాతం పెరిగింది. 2017లో వీళ్ల సంపద రూ.1,86,700 కోట్లుగా ఉంది. 2018 గ్రోహే హురూన్ రియల్టీ ధనవంతుల్లో లోధా గ్రూప్‌నకు చెందిన మంగల్ ప్రభాత్ లోధా మొదటి స్థానంలో నిలిచారు. ఈయన సంపద రూ.27,150 కోట్లు. రూ.23,160 కోట్లతో ఎంబసీ అధినేత జితేంద్ర విర్వాణీ రెండో స్థానంలో, రూ.17,690 కోట్ల సంపదతో డీఎల్‌ఎఫ్‌కు చెందిన రాజీవ్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు.
జాబితాలో తొలిసారిగా మహిళలకూ చోటు
2018 గ్రోహే హ్యూరన్ రియల్టీ ధనవంతుల్లో తొలిసారిగా మహిళలూ చోటు దక్కించుకున్నారు. ఈసారి రియల్టీ టైకూన్స్‌లో 9 మంది మహిళలు ఉండటం విశేషం. మహిళా విభాగంలో డీఎల్‌ఎఫ్ నుంచి రేణుకా తల్వార్ మొదటి స్థానంలో నిలిచారు. ఈమె సంపద రూ.2,780 కోట్లు. మొత్తం 100 మంది జాబితాలో ఈమెది 19వ స్థానం.
24 ఏళ్లకే బిజినెస్ టైకూన్..
గ్రోహే హురూన్ –2018 జాబితాలో 59 శాతం తొలితరం పారిశ్రామికవేత్తలే ఉన్నారు. ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు ఆర్‌ఎంజెడ్ అధినేత కునాల్ మెండా (24 సంవత్సరాలు). బెంగళూరుకు చెందిన కునాల్ సంపద రూ.530 కోట్లు. వయసులో బాగా సీనియర్ మాత్రం... ఈస్ట్ ఇండియా హోటల్స్ అధినేత పృథ్వీరాజ్ సింగ్ ఓబెరాయ్ (89 సంవత్సరాలు) కావటం గమనార్హం. న్యూ ఢిల్లీకి చెందిన ఈయన సంపద రూ.3,290 కోట్లు.
ముంబై... శ్రీమంతుల నగరం..
టాప్–100 రియల్టీ శ్రీమంతుల్లో 78 మంది ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరులోనే ఉన్నారు. ఒక్క ముంబైలోనే 35 మంది ఉండగా.. ఢిల్లీలో 22 మంది, బెంగళూరులో 21, పుణెలో 5, నోయిడా, చెన్నై, గుర్గావ్, కొచ్చిల్లో 2, కోల్‌కతా, థానే, అహ్మదాబాద్‌లో ఒక్కరు చొప్పున ఉన్నారు.
టాప్–100లో ముగ్గురు హైదరాబాదీ రియల్టర్లు
Published Thu, Nov 22 2018 12:54 AM | Last Updated on Thu, Nov 22 2018 11:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment