My Home Industries
-
మేళ్లచెరువు ఆలయం వద్ద ఉద్రిక్తత
మేళ్లచెరువు: సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైహోమ్ సిమెంట్స్ మైనింగ్ లీజు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో కొన్ని రోజులుగా వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. మైహోమ్ సంస్థకు ‘మీరంటే - మీరు అమ్ముడుపోయారు’ అంటూ ఇరు పార్టీల నాయకులు సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి తెర తీశారు. ఈ వివాదం నేపథ్యంలో బీజేపీ నాయకులు ప్రమాణానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా తన నిజాయతీని నిరూపించుకునేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి శివాలయంలో ప్రమాణం చేసేందుకు బుధవారం ఆలయానికి వచ్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వేపలమాధారం, మేళ్లచెరువు గ్రామాల పరిధిలోని 631 ఎకరాల్లో మైనింగ్ విస్తరణను మై హోం సంస్థ చేపట్టాలని భావించింది. దీనిపై ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. దీనిపై దాదాపు 15 రోజులుగా వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. మైనింగ్ విస్తరణతో కాలుష్యం పెరుగుతుందని, పొలాల్లో పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని స్థానిక ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. మై హోం సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పూర్తిగా జూపల్లి చేతికి ‘మై హోమ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటిదాకా ఐర్లాండ్ ప్రధాన కేంద్రంగా ఉన్న బిల్డింగ్ మెటీరియల్ కంపెనీ సీఆర్‌హెచ్ ఇండియాతో కలిసి 50:50 భాగస్వామ్య కంపెనీగా ఉన్న ‘మై హోమ్ ఇండస్ట్రీస్’ను జూపల్లి రామేశ్వరరావుకు చెందిన సంస్థలు పూర్తిగా సొంతం చేసుకోనున్నాయి. సీఆర్‌హెచ్ ఇండియాకు చెందిన 50 శాతం వాటాను మైహోమ్‌కు చెందిన నిర్మాణ సంస్థ మైహోమ్ కన్స్ట్రక్షన్స్, జూపల్లి రియల్ ఎస్టేట్ డెవలపర్స్, గ్రూప్ ప్రమోటరు జూపల్లి రామేశ్వరరావు కలిసి కొనుగోలు చేశారు. ఇందుకోసం వీరు దాదాపు రూ.1000 కోట్ల వరకూ వెచ్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి గురువారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం కూడా లభించింది. 4 ప్లాంట్స్, 10 లక్షల టన్ను..: మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం ‘మహా సిమెంట్’ బ్రాండ్ పేరిట గ్రే సిమెంట్ తయారీ, సరఫరాలో ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ పాండిచ్చేరి వంటి 11 రాష్ట్రాల్లో సిమెంట్ సరఫరా చేస్తోంది. సుమారు 5 వేల మందికి పైగా డీలర్లు ఉన్నారు. 10 లక్షల టన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. సంస్థకు తెలంగాణలోని సూర్యాపేటతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, విశాఖ జిల్లాల్లోనూ, అదేవిధంగా తమిళనాడులో కలిపి మొత్తం నాలుగు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఇక మై హోమ్ గ్రూప్... సిమెం ట్, కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్, పవర్, కన్సల్టెన్సీ, మీడియా, ఫార్మాసూటికల్స్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ వంటి పలు రంగాల్లో విస్తరించి ఉంది. -
మై హోమ్ రామేశ్వర్రావు సంపద రూ.3,300 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలతో పాటు ఈ రంగంలో సంపదను సృష్టిస్తున్న శ్రీమంతులూ పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా టాప్–15 మంది రియల్టీ కుబేరుల్లో తెలంగాణ నుంచి ‘మై హోమ్ కన్స్ట్రక్షన్స్’ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు తొలిసారిగా స్థానం దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా రియల్టీ దిగ్గజాల్లో ఈయన 14వ స్థానంలో నిలిచారు. ఈ మేరకు ‘గ్రోహె– హురున్ ఇండియా రియల్ ఎస్టేట్’ 2018వ సంవత్సరానికి సంబంధించిన జాబితా విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి తొలి స్థానంలో నిలిచిన రామేశ్వర్ రావు సంపద... రూ.3,300 కోట్లు. హైదరాబాద్ నుంచి రెండో స్థానంలో నిలిచింది... తాజ్ అండ్ జీవీకే హోటల్స్ అధినేత జీవీకే రెడ్డి, ఆయన కుటుంబం. వీళ్ల సంపద విలువ రూ.1,080 కోట్లు! దేశవ్యాప్తంగా వంద మంది రియల్టీ కుబేరుల జాబితాలో జీవీకే 63వ స్థానంలో నిలిచారు. ఇక, రూ.980 కోట్ల సంపదతో అపర్ణా కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రతినిధులు సి.వెంకటేశ్వర రెడ్డి, ఎస్ సుబ్రమణ్యం రెడ్డిలు మూడో స్థానంలో నిలిచారు. గ్రోహే జాతీయ జాబితాలో వీళ్లది 66వ స్థానం! లెక్కించింది ఇలా... జర్మనీకి చెందిన ప్రీమియం శానీటరీ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రోహే. మన దేశంలో పుట్టి, ఇక్కడే పెరిగిన రియల్టీ వ్యాపారస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించారు. దేశంలోని 100 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల మొత్తం సంపద విలువ రూ.2,36,610 కోట్లు. 2017తో పోలిస్తే ఇది 27 శాతం పెరిగింది. 2017లో వీళ్ల సంపద రూ.1,86,700 కోట్లుగా ఉంది. 2018 గ్రోహే హురూన్ రియల్టీ ధనవంతుల్లో లోధా గ్రూప్‌నకు చెందిన మంగల్ ప్రభాత్ లోధా మొదటి స్థానంలో నిలిచారు. ఈయన సంపద రూ.27,150 కోట్లు. రూ.23,160 కోట్లతో ఎంబసీ అధినేత జితేంద్ర విర్వాణీ రెండో స్థానంలో, రూ.17,690 కోట్ల సంపదతో డీఎల్ఎఫ్కు చెందిన రాజీవ్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు. జాబితాలో తొలిసారిగా మహిళలకూ చోటు 2018 గ్రోహే హ్యూరన్ రియల్టీ ధనవంతుల్లో తొలిసారిగా మహిళలూ చోటు దక్కించుకున్నారు. ఈసారి రియల్టీ టైకూన్స్‌లో 9 మంది మహిళలు ఉండటం విశేషం. మహిళా విభాగంలో డీఎల్ఎఫ్ నుంచి రేణుకా తల్వార్ మొదటి స్థానంలో నిలిచారు. ఈమె సంపద రూ.2,780 కోట్లు. మొత్తం 100 మంది జాబితాలో ఈమెది 19వ స్థానం. 24 ఏళ్లకే బిజినెస్ టైకూన్.. గ్రోహే హురూన్ –2018 జాబితాలో 59 శాతం తొలితరం పారిశ్రామికవేత్తలే ఉన్నారు. ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు ఆర్ఎంజెడ్ అధినేత కునాల్ మెండా (24 సంవత్సరాలు). బెంగళూరుకు చెందిన కునాల్ సంపద రూ.530 కోట్లు. వయసులో బాగా సీనియర్ మాత్రం... ఈస్ట్ ఇండియా హోటల్స్ అధినేత పృథ్వీరాజ్ సింగ్ ఓబెరాయ్ (89 సంవత్సరాలు) కావటం గమనార్హం. న్యూ ఢిల్లీకి చెందిన ఈయన సంపద రూ.3,290 కోట్లు. ముంబై... శ్రీమంతుల నగరం.. టాప్–100 రియల్టీ శ్రీమంతుల్లో 78 మంది ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరులోనే ఉన్నారు. ఒక్క ముంబైలోనే 35 మంది ఉండగా.. ఢిల్లీలో 22 మంది, బెంగళూరులో 21, పుణెలో 5, నోయిడా, చెన్నై, గుర్గావ్, కొచ్చిల్లో 2, కోల్‌కతా, థానే, అహ్మదాబాద్‌లో ఒక్కరు చొప్పున ఉన్నారు. -
ఒకే బ్రాండ్‌గా ‘మహా’ సిమెంట్
వచ్చే జనవరికల్లా తమిళనాడు ప్లాంటు రెడీ ఉత్పత్తి 10 మిలియన్ టన్నులకు ఫార్మా రంగంలోకి మై హోమ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీలో ఉన్న మై హోమ్ ఇండస్ట్రీస్ రీబ్రాండింగ్ చేపట్టింది. మహా సిమెంట్, మహా శక్తి, మహా గోల్డ్ బ్రాండ్ల స్థానంలో ఇక నుంచి ‘మహా’ పేరుతో సిమెంటును విక్రయించనుంది. దక్షిణాదిన సుస్థిర వాటాతో ఇప్పటికే 12 రాష్ట్రాల్లో అడుగు పెట్టినట్టు కంపెనీ ఈడీ ఎస్.సాంబశివరావు ఈ సందర్భంగా సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తరించాలన్న లక్ష్యంతో రీబ్రాండింగ్ చేపట్టినట్టు చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,000 మందికిపైగా కంపెనీ ద్వారా ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. నల్గొండ, కర్నూలు, వైజాగ్‌లలో ఉన్న కంపెనీ ప్లాంట్ల మొత్తం సామర్థ్యం 8.4 మిలియన్ టన్నులు. తమిళనాడులోని ట్యూటికోరిన్ వద్ద రూ.250 కోట్లతో నెలకొల్పుతున్న ప్లాంటు జనవరికల్లా సిద్ధమవుతోంది. ఈ ప్లాంటు తోడైతే కంపెనీ సామర్థ్యం 10 మిలియన్ టన్నులకు చేరనుంది. ఇదీ గ్రూప్ ప్రణాళిక..: ప్లాంట్ల వినియోగం ప్రస్తుతం 50% ఉన్నట్లు మై హోమ్ ఇండస్ట్రీస్ తెలిపింది. వినియోగం పూర్తి స్థారుుకి చేరుకున్నాక విస్తరణ చేపట్టాలని కంపెనీని ప్రమోట్ చేస్తున్న మై హోమ్ గ్రూప్ భావిస్తోంది. ఇప్పటికే గుంటూరులో స్థలాన్ని సమకూర్చుకుంది. ఇక్కడ రూ.1,500 కోట్లతో 1.5 మిలియన్ టన్నుల ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. నల్గొండ జిల్లాలోని ప్లాంటులో మరో యూనిట్‌ను మిలియన్ టన్నుల సామర్థ్యంతో రూ. 1,000 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనుంది. ఉత్తర, మధ్య, పశ్చిమ భారత్‌లో ఇప్పటికే ఉన్న ఇతర కంపెనీల ప్లాంట్లను కొనుగోలు చేయడం లేదా సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. మై హోమ్ గ్రూప్ టర్నోవరు రూ.5,000 కోట్లు. ఇందులో సిమెంటు వ్యాపారం ద్వారా రూ.3,000 కోట్లు సమకూరుతోంది. ఈ విభాగం రెండు మూడేళ్లలో రూ.5,000 కోట్లకు చేరుతుందని సంస్థ అంచనా. బల్క్ డ్రగ్, ఫార్మాలోకి..: సిమెంట్, నిర్మాణం, విద్యుత్, రవాణా రంగాల్లో ఉన్న మై హోమ్ గ్రూప్ బల్క్ డ్రగ్, ఫార్మా విభాగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. ఏ ఉత్పత్తులతో ఎంట్రీ ఇవ్వాలో అన్న అంశంపై ఒక బృందం ఇప్పటికే అధ్యయనం చేస్తోంది. ఆరు నెలల్లో స్పష్టత వస్తుందని సాంబశివరావు వెల్లడించారు.