మేళ్లచెరువు: సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైహోమ్ సిమెంట్స్ మైనింగ్ లీజు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో కొన్ని రోజులుగా వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. మైహోమ్ సంస్థకు ‘మీరంటే - మీరు అమ్ముడుపోయారు’ అంటూ ఇరు పార్టీల నాయకులు సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి తెర తీశారు. ఈ వివాదం నేపథ్యంలో బీజేపీ నాయకులు ప్రమాణానికి సిద్ధమయ్యారు.
అందులో భాగంగా తన నిజాయతీని నిరూపించుకునేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి శివాలయంలో ప్రమాణం చేసేందుకు బుధవారం ఆలయానికి వచ్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
వేపలమాధారం, మేళ్లచెరువు గ్రామాల పరిధిలోని 631 ఎకరాల్లో మైనింగ్ విస్తరణను మై హోం సంస్థ చేపట్టాలని భావించింది. దీనిపై ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. దీనిపై దాదాపు 15 రోజులుగా వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. మైనింగ్ విస్తరణతో కాలుష్యం పెరుగుతుందని, పొలాల్లో పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని స్థానిక ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. మై హోం సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment