
2022 నాటికి రియల్టీలో 7.5 కోట్ల ఉద్యోగాలు!
కేపీఎంజీ నివేదిక
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ అండ్ కన్‌స్ట్రక్షన్ రంగం 2022 నాటికి 7.5 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తుందని కేపీఎంజీ ఇండియా అంచనా వేస్తోంది. దీంతో ఈ రంగం దేశంలోనే ఉపాధి కల్పనలో అగ్రస్థానంలో నిలుస్తుందని అభిప్రాయపడింది. అలాగే 2030 నాటికి దేశ జీడీపీలో దీని వాటా 15 శాతానికి చేరుతుందని పేర్కొంది.
ఇదే సమయంలో దేశంలో కన్‌స్ట్రక్షన్ మార్కెట్ 1 ట్రిలియన్ డాలర్లను అధిగమించొచ్చని తెలిపింది. కేపీఎంజీ ఇండియా, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ శుక్రవారం ఒక సంయుక్త నివేదికను విడుదల చేశాయి. ఇందులో పట్టణీకరణ, రియల్ ఎస్టేట్ రంగంలోని సవాళ్లు, వీటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు, వాటి తీరుతెన్నులను చర్చించడం జరిగింది. నివేదిక ప్రకారం..
⇔ గతేడాది 42 కోట్లుగా ఉన్న దేశీ పట్టణ జనాభా 2030 నాటికి 40 శాతం వృద్ధితో 58 కోట్లకు పెరగొచ్చు.
⇔ రీట్స్, జీఎస్‌టీ, రియల్ ఎస్టేట్ బిల్ వంటి పాలసీలు సహా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీస్, అందరికీ ఇల్లు, అమృత్ వంటి కార్యక్రమాల వల్ల పట్ణణ జనాభా పెరిగినా అంతగా సమస్యలు ఉత్పన్నం కాకపోవచ్చు.
⇔ 2020 నాటికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పౌరులందరికీ నివాసం కల్పించాలంటే దాదాపు 11 కోట్ల గృహాల నిర్మాణం జరగాలి.
⇔ 2000-15 మధ్యకాలంలో రియల్టీ రంగం 24 బిలియన్ డాలర్లకుపైగా ఎఫ్‌డీఐలను ఆకర్షించింది.
⇔ అందరికీ ఇల్లు కార్యక్రమానికి 2022 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్లు అవసరం.