
న్యూఢిల్లీ: పెట్టుబడి సాధనంగా ఓ వెలుగు వెలిగిన గోల్డ్ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్) ప్రాభవం తగ్గుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ – అక్టోబర్ మధ్య కాలంలో ఈ తరహా సాధనాల నుంచి ఇన్వెస్టర్లు సుమారు రూ. 420 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కు తీసుకోవటమే దీనికి నిదర్శనం. మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య యాంఫీ విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
వీటి ప్రకారం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో 14 పసిడి ఆధారిత ఈటీఎఫ్‌ల నుంచి నికరంగా రూ.422 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. గతేడాది ఇదే వ్యవధిలో ఈ మొత్తం రూ.519 కోట్లు. దీంతో ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రూ. 5,480 కోట్లుగా ఉన్న గోల్డ్ ఫండ్స్ నిర్వహణలోని అసెట్స్ (ఏయూఎం) విలువ అక్టోబర్ ఆఖరు నాటికి రూ. 5,017 కోట్లకు తగ్గింది.
నాలుగేళ్లుగా ఇదే తీరు..
గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాలుగా గోల్డ్ ఈటీఎఫ్‌లలో ట్రేడింగ్ ఒక మోస్తరుగానే ఉంటోంది. 2016–16లో రూ. 775 కోట్లు, 2015–16లో రూ. 903 కోట్లు, 2014–15లో రూ. 1,475 కోట్లు, 2013–14లో రూ. 2,293 కోట్ల మేర పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు.
మరోవైపు, ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సేవింగ్ స్కీములలో (ఈఎల్‌ఎస్‌ఎస్) మాత్రం గణనీయ స్థాయిలో ఏకంగా రూ. 96,000 కోట్ల మేర పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఒక్క గత నెలలోనే ఏకంగా రూ. 17,000 కోట్లు వచ్చాయి. స్టాక్‌మార్కెట్లు కొంగొత్త గరిష్ట స్థాయులను తాకుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం, ఇతర సాధనాల కన్నా కూడా ఈక్విటీలవైపే మొగ్గు చూపుతున్నారని కోటక్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ అన్షుల్ సైగల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment