రిలయన్స్ రూ.51 వేల కోట్ల షేర్ల బదిలీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ప్రమోటర్ల కంపెనీల్లో షేర్ హోల్డింగ్ పునరవ్యవస్థీకరణలో భాగంగా బీఎస్‌ఈలో రూ.51,000 కోట్ల విలువైన సుమారు 39 కోట్ల షేర్లు చేతులు మారాయి. ప్రమోటర్ల కంపెనీల్లో నాలుగు కంపెనీలు 39.6 కోట్ల షేర్లను మరో రెండు కంపెనీల్లోకి బదిలీ చేశాయి. ఆదిశేష్ ఎంటర్‌ప్రైజెస్, త్రిలోకేశ్ కమర్షియల్స్, అభయప్రద ఎంటర్‌ప్రైజెస్, తరన్ ఎంటర్‌ప్రైజెస్...ఈ నాలుగు కంపెనీలు 12.21 శాతం వాటాకు సమానమైన 39.6 కోట్ల షేర్లను దేవరుషి కమర్షియల్స్, తత్వం ఎంటర్‌ప్రైజెస్‌కు బదలాయించాయి. ఒక్కో షేర్ సగటు ధర రూ.1,284 చొప్పున ఈ డీల్ విలువ రూ.50,859 కోట్లు. ఇది అంతర్గత బదిలీ అయినందున మొత్తం ప్రమోటర్ల షేర్ హోల్డింగ్‌లో ఎలాంటి మార్పు ఉండదని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.
ఈ బదిలీ నేపథ్యంలో బీఎస్‌ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 0.3 శాతం తగ్గి రూ.1,287 వద్ద ముగిసింది. ప్రమోటర్ గ్రూప్‌లోని 15 సంస్థలు 118.99 కోట్ల షేర్లను ఇదే గ్రూప్‌లోని మరో 8 సంస్థల్లోకి బదిలీ చేయనున్నాయని ఈ నెల 2న రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో చైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, పిల్లలు ఆకాశ్, అనంత్, ఇషాలను కూడా కలుపుకొని మొత్తం 63 ప్రమోటర్ గ్రూపులున్నాయి. ఈ ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు ఆర్‌ఐఎల్‌లో 45.24 శాతం వాటా (146.39 కోట్ల షేర్లు) ఉంది. ముకేశ్ అంబానీకి ఆర్‌ఐఎల్‌లో నేరుగా 36.15 లక్షల షేర్లు, నీతా అంబానీకి 33.98 లక్షలు, ఆకాశ్, ఇషాలకు చెరో 33.63 లక్షలు, అనంత్‌కు లక్ష చొప్పున షేర్లు ఉన్నాయి.