సాక్షి, న్యూఢిల్లీ: టెలికం మార్కెట్ సంచలనం రిలయన్స్ జియో తన వృద్ధి రేటులో దూసుకపోతోంది. కంపెనీ ప్రారంభించిన మూడేళ్లలోనే జియో గ్లోబల్ 100 డిస్ట్రప్టివ్ పవర్ బ్రాండ్ల జాబితాలో చేరింది. అంతేకాదు ప్రస్తుత వృద్ధి రేటుతో మూడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన 100 బ్రాండ్లలో ఒకటిగా ఉంటుందని కమ్యూనికేషన్ సర్వీసెస్ ప్రొవైడర్ డబ్ల్యుపీపీ, మార్కెట్ పరిశోధనా సంస్థ కాంతర్ మిల్వార్డ్ బ్రౌన్ తాజా నివేదికలో ఈవిషయాన్ని వెల్లడించింది.
2016లో ప్రారంభించినప్పటికీ, 1995లోమార్కెట్లోకి ప్రవేశించిన ఎయిర్‌టెల్, వోడాఫోన్ లాంటి ప్రధాన ప్రత్యర్థులకు భిన్నంగా భారత వినియోగదారులు జియోను ఆదరించారని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో టాప్ 100 మోస్ట్ వాల్యుబుల్ గ్లోబల్ బ్రాండ్‌గా దూసుకురానుందని నివేదించింది. మొదటి ఆరు నెలలు ఉచిత సేవలతో కస‍్లమర్లను ఆకర్షించి, ఆతరువాత సరసమైన ధరల్లో డేటా సేవలను అందించి, మార్కెట్ లీడర్లు ఎయిర్‌టెల్, వోడాఫోన్ లాంటి కంపెనీలను ప్రభావితం చేసిందని పేర్కొంది. దీంతో అవి కూడా వినియోగదారులను నిలబెట్టుకునేందుకు డేటా టారిఫ్‌ల విషయంలో దిగొచ్చాయని నివేదిక వ్యాఖ్యానించింది.
కొత్త బ్రాండ్‌గా మార్కెట్లోకి ప్రవేశించి, వినియోగదారులందరికీ భారీ ప్రయోజనాలతో, ఆ సెక్టార్ చరిత్రనే తిరగరాసిన ఘనత జియోకే దక్కుతుందని కాంతర్ గ్లోబల్ బ్రాండ్జెడ్ రీసెర్చ్ డైరెక్టర్ మార్టిన్ గెరిరియా అన్నారు. 340 మిలియన్లకు పైగా చందాదారులతో జియో ప్రస్తుత బ్రాండ్ విలువ 4.1 బిలియన్లు అని నివేదిక తెలిపింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆపిల్, గూగుల్‌లను అధిగమించి టాప్ 100 మోస్ట్ వాల్యూబుల్ గ్లోబల్ బ్రాండ్స్‌లో మొదటి ర్యాంకును దక్కించుకుంది. సంవత్సరానికి 52 శాతం పెరుగుదలతో, అమెజాన్ బ్రాండ్ విలువ 315.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
కాగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన 100 బ్రాండ్ల జాబితాలో తొలిసారిగా చైనాకు చెందిన నాలుగు కంపెనీలు, ఇండియాకు చెందిన రెండు కంపెనీలు స్థానాన్ని దక్కించుకున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ (68వ ర్యాంకు), ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ 97వ ర్యాంకుతో కొత్తగా స్థానాన్ని సంపాదించాయి.
Comments
Please login to add a commentAdd a comment