రిలయన్స్ జియో అందరికీ ఫ్రీ..!
♦ 4జీ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు
♦ ఓపెన్ మార్కెట్లో ప్రివ్యూ ఆఫర్
♦ 90 రోజులపాటు అన్‌లిమిటెడ్
♦ టెలికం రంగంలో జియో సంచలనం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మీదగ్గర 4జీ స్మార్ట్‌ఫోన్ ఉందా? ఇంకేం ఎంచక్కా 90 రోజులపాటు అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్ ఎంజాయ్ చేయండి. అదీ ఉచితంగా. నమ్మశక్యంగా లేదు కదూ. టెలికం మార్కెట్లో పెను సంచలనానికి రిలయన్స్ జియో తెరతీసింది. ఇప్పటి వరకు కొందరికే పరిమితమైన జియో ప్రివ్యూ ఆఫర్ ఇక నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. 4జీ స్మార్ట్‌ఫోన్ ఉన్న కస్టమర్లు ఎవరైనా జియో సిమ్‌ను ఉచితంగా తీసుకోవచ్చు. 90 రోజులపాటు అపరిమితంగా జియో సేవలను ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో వాణిజ్యపర కార్యకలాపాలను ఇంకా ప్రకటించక ముందే తీసుకున్న తాజా నిర్ణయం టెలికం మార్కెట్‌ను షేక్ చేయనుంది.
ఆకట్టే ప్రివ్యూ ఆఫర్..
రిలయన్స్ జియో ఆరు నెలల క్రితం ప్రివ్యూ ఆఫర్‌ను ప్రారంభించింది. దీని కింద 4జీ డేటా, వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ కాల్స్, 10 రకాల జియో ప్రీమియం యాప్స్‌ను అపరిమితంగా వినియోగించుకోవచ్చు. తొలుత రిలయన్స్ ఉద్యోగులు, వారి బంధువులకు దీనిని అమలు చేసింది. ఆ తర్వాత లైఫ్ స్మార్ట్‌ఫోన్ కొన్న కస్టమర్లకు 90 రోజులపాటు ప్రివ్యూ ఆఫర్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 8 లక్షల పైచిలుకు కార్పొరేట్ కంపెనీలను జియో సంప్రదించింది. ఈ కంపెనీల ఉద్యోగులకు ఇప్పటి వరకు ఏ టెలికం సంస్థా ఇవ్వనటువంటి అత్యుత్తమ సీయూజీ ప్యాక్‌ను ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. అలాగే లైఫ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ కొనుక్కోకపోయినా కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులందరికీ ప్రివ్యూ ఆఫర్‌ను అమలు చేస్తోంది. దీనినిశామ్‌సంగ్, హెచ్‌పీ వినియోగదార ్లకు విస్తరించింది. తాజాగా 4జీ స్మార్ట్‌ఫోన్ ఏ కంపెనీదైనా సరే. ప్రతి ఒక్క కస్టమర్‌కు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లు సమీపంలోని రిలయన్స్ డిజిటల్ లేదా అధీకృత స్టోర్‌ను సంప్రదించి ఉచిత సిమ్‌ను పొందవచ్చు.
గణనీయంగా కస్టమర్లు..
ప్రివ్యూ ఆఫర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా 25 లక్షలపైచిలుకు కస్టమర్లను జియో సొంతం చేసుకుంది. వీరిలో ఒకట్రెండు లక్షలు మినహా మిగిలినవారంతా లైఫ్ స్మార్ట్‌ఫోన్ కస్టమర్లే. రూ.3 వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లైఫ్ బ్రాండ్ ప్రకటించడం సంచలనం సృష్టించింది. దీనికితోడు ప్రివ్యూ ఆఫర్ ఉండడంతో కస్టమర్ల సంఖ్య అనూహ్యంగా దూసుకెళ్తోంది. మరోవైపు జియోఫై వైఫై హాటాస్పాట్‌కు ఏకంగా 31 ఉపకరణాల ను అనుసంధానించవచ్చు. వైఫై ఫీచర్ ఉన్న ప్రతి ఉపకరణంలో 4జీ స్పీడ్ ఎంజాయ్ చేయవచ్చు. చేతిలో ఇమిడిపోయే ఈ గ్యాడ్జెట్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ధర రూ.2,899. దీనిపైనా ప్రివ్యూ ఆఫర్ ఉంది. కస్టమర్ల వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్ వాయిస్ ఓవర్ ఎల్‌టీఈని సపోర్ట్ చేయకపోయినా సరే. జియో జాయిన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. దీనిద్వారా 2జీ, 3జీ ఫోన్లలో హెచ్‌డీ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మెసేజింగ్ సౌకర్యం పొందవచ్చు.
అంతా 4జీ మయం..
జియో కస్టమర్లు నెలకు సగటున 30 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. పంజాబ్‌లో 100 జీబీ దాకా నమోదైంది. అంటే ఈ స్థాయిలో డేటాకు డిమాండ్ పెరుగుతోంది. లైఫ్ స్మార్ట్‌ఫోన్లు రూ.3 వేల నుంచి లభించడం, అపరిమిత ఉచిత డేటా.. వెరశి భారత్‌లో మొబైల్ వినియోగదార్లు జియో 4జీకి ఆకర్షితులు అవడం ఖాయంగా కనపడుతోంది. పైగా ప్రివ్యూ ఆఫర్ తర్వాత ఒక జీబీకి చార్జీ రూ.100 లోపే ఉండే అవకాశం ఉంది. ఇదే నిజమైతే టెలికం మార్కెట్ అంతా ఒకవైపుకు పోవడం ఖాయమని పరిశ్రమ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. 2003లో రిలయన్స్ ఇన్ఫోకామ్ మాన్సూన్ హంగామా పేరుతో రూ.501లకే సీడీఎంఏ ఫోన్లను ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే జియో అమ లు చేస్తున్న వ్యూహం అటు మొబైల్ ఫోన్ మార్కెట్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.
కస్టమర్ జేబులో రూ.20 వేలు..
ప్రస్తుతం జియో కస్టమర్ సగటున రోజుకు 1 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. మార్కెట్‌లో ఉన్న టెలికం కంపెనీల డేటా చార్జీలను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో జీబీకి ఎంత కాదన్నా రూ.200 అవుతుంది. అంటే 30 రోజులకు రూ.6 వేలు. అలా 90 రోజులంటే రూ.18 వేలు. ఉచిత వాయిస్ కాల్స్ విలువ మూడు నెలలకు రూ.2 వేలు అవుతుందని అనుకుంటే.. మొత్తంగా ప్రివ్యూ ఆఫర్ కింద ఒక్కో కస్టమర్ రూ.20 వేల విలువ చేసే ప్యాకేజీని ఫ్రీగా ఎంజాయ్ చేస్తారన్న మాట.
టెలికం కార్యదర్శితో ముకేశ్ అంబానీ భేటీ
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ శుక్రవారంనాడు టెలికం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్‌తో సమావేశమయ్యారు. తమ టెలికం వెంచర్ రిలయన్స్ జియో 4జీ ఆవిష్కరణ ప్రణాళికపై వీరిరువురు చర్చించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. టెలికం ఆపరేటర్లు తమ ట్రయల్ సర్వీసులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని జియో అందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ సహా పలు ఇతర టెలికం కంపెనీలతో కూడిన సీవోఏఐ ఇటీవల డాట్‌కి ఒక ఉత్తరం రాస్తూ... జియో నిబంధనలకు విరుద్ధంగా తన 15 లక్షల మంది యూజర్లకు ట్రయల్స్ చాటున పూర్తి స్థాయి సేవలను అందిస్తోందని ఆరోపించింది. తాజా పరిణామాల నేపథ్యంలో తాజా ముకేశ్ అంబానీ, దీపక్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ముకేశ్ వెంట ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీ కూడా ఉన్నారు. ఇటీవలే టెలికం కార్యదర్శితో భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, రిలయన్స్ జియో ప్రతినిధి కూడా సమావేశం అయ్యారు.