
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) లాభాల్లో రికార్డుల మోత మోగింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (2017–18, క్యూ3) కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.9,423 కోట్లకు ఎగబాకింది. ఒక కార్టర్‌లో కంపెనీ ఇంత భారీస్థాయి లాభాన్ని ఆర్జించడం ఇదే తొలిసారి.
క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.7,533 కోట్లతో పోలిస్తే 25.1 శాతం దూసుకెళ్లింది. ప్రధానంగా పెట్రో కెమికల్స్ వ్యాపారంలో రికార్డు స్థాయి రాబడులు, టెలికం అనుబంధ సంస్థ రిలయన్స్ జియో తొలిసారిగా లాభాల్లోకి రావడం కంపెనీకి కలసి వచ్చింది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం క్యూ3లో రూ.1,09,905 కోట్లుగా నమోదైంది.
కిందటేడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.84,189 కోట్లు. దీంతో పోలిస్తే 30.5 శాతం వృద్ధి చెందింది. సాండ్ అలోన్ ప్రాతిపదికన (ప్రధానమైన పెట్రోకెమికల్స్, రిఫైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారాలు) కూడా కంపెనీ క్యూ3 నికర లాభం రికార్డు స్థాయిలో రూ.8,454 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 5 శాతం పెరిగింది.
జీఆర్‌ఎం జోరు...
డిసెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ స్థూల రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్‌ఎం) 11.6 డాలర్లుగా నమోదైంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురును శుద్ధి చేసి పెట్రో ఉత్పత్తులుగా మార్చడం ద్వారా ఆర్జించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 10.8 డాలర్లుగా ఉంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (క్యూ2) జీఆర్‌ఎం 12 డాలర్లు.
ఇతర ముఖ్యాంశాలు...
♦ క్యూ3లో పెట్రోకెమికల్స్ వ్యాపారం స్థూల లాభం రికార్డు స్థాయిలో రూ.5,753 కోట్లకు ఎగిసింది. గతేడాది క్యూ3లో స్థూల లాభం రూ.3,326 కోట్లు మాత్రమే.
♦ముడిచమురు రిఫైనింగ్, మార్కెటింగ్ వ్యాపారంలో స్థూల లాభం స్వల్ప తగ్గుదలతో రూ.6,194 కోట్ల నుంచి రూ.6,165 కోట్లకు చేరింది. ఇక క్యూ2తో పోలిస్తే 7% తగ్గింది.
♦ చమురు–గ్యాస్ వ్యాపారంలో స్థూల నష్టం రూ.291 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ3లో స్థూల నష్టం రూ.295 కోట్లుగా ఉంది.
♦ రిటైల్ వ్యాపారం స్థూల లాభం రూ.231 కోట్ల నుంచి రూ.487 కోట్లకు రెట్టింపయింది. దేశంలో ఈ రంగానికి సంబంధించి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీగా రిలయ న్స్ రిటైల్ నిలుస్తోందని ఆర్‌ఐఎల్ పేర్కొంది. ఆదాయం రెట్టింపు స్థాయిలో రూ.8,688 కోట్ల నుంచి రూ.18,798 కోట్లకు ఎగబాకింది. అయితే, ఈ విభాగంలో ఇప్పటివరకూ ఇంకా నికర లాభం నమోదుకాలేదు. కాగా, క్యూ3లో కంపెనీ కొత్తగా 72 విభిన్న స్టోర్లను ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 750 నగరాల్లో 3,751కి చేరింది.
♦ 2017 డిసెంబర్ చివరినాటికి రిలయన్స్ మొత్తం రుణ భారం రూ.2,13,206 కోట్లుగా ఉంది. 2016 డిసెంబర్ నాటికి రుణ భారం రూ.2,14,145 కోట్లు.
♦ ఇక కంపెనీ వద్ద నగదు నిల్వలు రూ.77,014 కోట్ల నుంచి రూ.78,617 కోట్లకు పెరిగాయి.
♦ రిలయన్స్ షేరు శుక్రవారం 1% లాభంతో రూ.929కు చేరింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి.
వారెవ్వా... జియో!
ఆర్‌ఐఎల్ టెలికం అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కంపెనీ వాణిజ్య పరంగా కార్యకలాపాలను ప్రారంభించిన రెండో త్రైమాసికంలోనే నికర లాభాలను కళ్లజూసింది. ఈ ఏడాది క్యూ3లో జియో తొలిసారిగా రూ.504 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మొబైల్ డేటా (4జీ) నెట్‌వర్క్‌గా జియో నిలుస్తోందని... తమ మొత్తం వినియోగదారులు డిసెంబర్ చివరినాటికి 16.01 కోట్లకు పెరిగారని ఆర్‌ఐఎల్ పేర్కొంది.
2016 సెప్టెంబర్‌లో 4జీ సేవలను ఆరంభించిన జియో.. ఉచిత ఆఫర్లతో దేశీ టెలికం రంగంలోని పోటీ కంపెనీలకు ముచ్చెమటలు పట్టించింది. వాణిజ్య పరంగా(బిల్లింగ్) సేవలను మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మొదలుపెట్టింది. క్యూ2లో నికర నష్టం రూ.271 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ ఆదాయాలు 11.9% పెరిగి రూ.6,879 కోట్లకు చేరాయి.
పెట్రోకెమికల్స్ వ్యాపారంలో విస్తరణ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడం, టెలికం విభాగమైన రిలయన్స్ జియో తొలిసారి నికర లాభాన్ని ఆర్జించడం మూడో త్రైమాసికంలో కీలక మైలురాళ్లుగా నిలిచాయి. రిఫైనింగ్ వ్యాపారంలో వరుసగా 12 క్వార్టర్ల పాటు రెండంకెల రిఫైనింగ్ మార్జిన్లను సాధించడం కూడా కంపెనీ అద్భుత నిర్వహణ పనితీరు, పటిష్టమైన మూలాలకు అద్దం పడుతోంది.
పెట్రోకెమికల్స్ రంగంలో మేం వెచ్చించిన భారీస్థాయి పెట్టుబడుల ఫలాలే ఈ రికార్డు లాభాలకు మూల కారణం. ఇక జియో సాధించిన పటిష్టమైన ఫలితాలు గమనిస్తే... ఈ వ్యాపారంలో బలంగా వేళ్లూనుకున్నామన్నది తేటతెల్లమవుతుంది. సంస్థ సామర్థ్యం, తగిన వ్యూహాత్మక నిర్ణయాలే జియో జోరుకు నిదర్శనం. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ
Comments
Please login to add a commentAdd a comment