
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్‌లో విలీనాలకు తగిన సమర్థవంతమైన, పటిష్ట విధానాలు అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ వై వేణుగోపాల రెడ్డి పేర్కొన్నారు. ఆశించిన ఫలితాలు రావాలంటే ‘తగిన’ బ్యాంకింగ్ విలీన విధానం అవసరమని ఆయన సూచించారు. అసోచామ్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన జేఆర్‌డీ టాటా స్మారక ఉపన్యాసం చేశారు.
‘ఒక బలహీన బ్యాంక్‌ను ఒక పటిష్ట బ్యాంకుతో విలీనం చేసినంత మాత్రాన తగిన ఫలితం వచ్చేస్తుందనుకుంటే పొరపాటు. బలహీన బ్యాంకుకు వ్యవస్థాగత సమస్యలు ఉంటే ఈ విలీనంతో అవి పరిష్కారం అయిపోవు. బలహీన బ్యాంక్ పటిష్ట బ్యాంకుగా మారిపోదు’ అని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
బ్యాంకింగ్ విలీనాలకు సంబంధించిన ప్రణాళికలను సూత్రప్రాయ ఆమోదం కోసం త్వరలో ఆయా అంశాలను సమీక్షిస్తున్న ఆల్టర్నేటివ్ మెకానిజమ్ (ఏఎం) ప్యానల్ ముందు ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికశాఖ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో వైవీ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ప్యానల్‌కు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వం వహిస్తునారు.
వడ్డీరేట్లు మరింత తగ్గింపుతో కష్టమే
ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీరేటు మరింత తగ్గించే అవకాశాలు లేవని కూడా ఆయన వై.వి.రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ధోరణి బ్యాంకింగ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నా రు.
‘‘బ్యాంకుల్లో ప్రజలు డిపాజిట్లు చేయకపోతే రుణ మంజూరీలు కష్టమవుతాయి. ఎన్‌ఆర్‌ఐ పొదుపుల జమ తగ్గిపోతే, కరెంట్ అకౌంట్ లోటు కూడా ప్రతికూలంగా మారుతుంది’’ అని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఇదంతా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment