జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.17%
16 శాతం తగ్గిన కూరగాయల ధరలు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2017 జనవరిలో కేవలం 3.17 శాతంగా నమోదయ్యింది. అంటే 2016 జనవరితో (5.69 శాతం) పోల్చిచూస్తే... 2017 జనవరిలో రిటైల్ బాస్కెట్ మొత్తం ధర కేవలం 3.17 శాతం పెరిగిందన్నమాట. నోట్ల రద్దుతో వినియోగ డిమాండ్ తగ్గడం మొత్తం సూచీపై ప్రభావంచూపింది. 2016 డిసెంబర్‌లో ఈ రేటు 3.41 శాతం. కొన్ని ముఖ్యాంశాలు ...
♦ ఆహారం, పానీయాల విభాగం బాస్కెట్ ద్రవ్యోల్బణం 1.29 శాతం పెరిగింది. ఇందులో కూరగాయల ధరలను వార్షికంగా చూస్తే– అసలు పెరక్కపోగా –15.62 శాతం క్షీణించాయి. పప్పు దినుసులు ఆయా ఉత్పత్తుల ధరల కూడా –18.69 శాతం క్షీణించాయి. ధరలు పెరిగిన జాబితాలో మాంసం, చేపలు (3 శాతం), గుడ్లు (3 శాతం), పాలు, పాల పదర్థాలు (4.23%), ఆయిల్ అండ్ ఫ్యాట్స్ (6%), సుగంధ ద్రవ్యాలు (5 శాతం), ఆల్కాహాలేతర పానీయాలు (3.1 శాతం), ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ (6 శాతం) ఉన్నాయి.
♦ ఇంధన విభాగంలో రేటు 3.42 శాతం పెరిగింది.
♦ గ్రామీణ ప్రాంతంలో రిటైల్ ద్రవ్యోల్బణం నెలవారీగా 3.83% నుంచి 3.36%కి తగ్గింది. పట్టణ ప్రాంతంలో ఈ రేటు 2.90% వద్ద స్థిరంగా ఉంది.