ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు కొత్త చైర్‌పర్శన్‌గా రోషిణీ నాడార్ మల్హోత్రా ఎంపికయ్యారు. ఇందుకు వీలుగా రోషిణీ తండ్రి శివ్‌నాడార్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. అయితే కంపెనీ ఎండీగా ప్రధాన వ్యూహకర్త(సీఎస్‌వో) బాధ్యతలను శివ్‌నాడార్ చేపట్టనున్నారు. క్యూ1 ఫలితాల విడుదల సందర్భంగా రోషిణీ నాడార్ ఎంపిక వివరాలను హెచ్‌సీఎల్ టెక్ వెల్లడించింది.
సంపన్న మహిళ
38 ఏళ్ల రోషిణీ నాడార్ ఇప్పటివరకూ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. హెచ్‌సీఎల్ ఎంటర్‌ప్రైజ్ సీఈవోగానూ విధులు నిర్వర్తిస్తున్నారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి రోషిణీ ఎంబీఏ పూర్తి చేశారు. ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హ్యూరన్ 2019 ర్యాంకింగ్‌ల ప్రకారం దేశీయంగా అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా రోషిణీ నిలిచారు. రోషిణీ సంపద రూ. 36,800 కోట్లుగా ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ పేర్కొంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు చెందిన అనుబంధ దాతృత్వ సంస్థ బాధ్యతలను రోషిణీ నిర్వహిస్తున్నారు.
రూ. 2 డివిడెండ్
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ. 2925 కోట్ల నికర లాభం ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన ఇది 31.7 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 8.6 శాతం పెరిగి రూ. 17,841 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. వాటాదారులకు షేరుకి రూ. 2 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. జూన్ చివరికల్లా కంపెనీలో 1,50,287 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ తెలియజేసింది. జూన్ త్రైమాసికంలో స్థూలంగా 7,005 మందికి కంపెనీలో ఉపాధి కల్పించినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment