HCL Technologies Company
-
తొలి కంప్యూటర్ అందించిన టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎవరో తెలుసా?
పారిశ్రామికవేత్త టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు, దాత శివ్ నాడార్ (జూలై 14) 78వ పడిలోకి అడుగుపెట్టారు. సెల్ఫ్-మేడ్ ఇండియన్ బిలియనీర్ శివ నాడార్ తన దూరదృష్టి , మార్గదర్శక నిర్ణయాలతో దేశీయంగా తొలి వ్యక్తిగత కంప్యూటర్ను అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారతదేశం అగ్రగామిగా ఎదగడానికి సహాయం చేసినవారిలో శివ నాడార్ ప్రముఖుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు విద్యా, గ్రామీణాభివృద్ధిపై శివ నాడార్ ఫౌండేషన్, ఇతర అనేక స్వచ్ఛంద సంస్థలద్వారా భూరి విరాళాలిచ్చే గొప్ప పరోపకారి కూడా. ఎక్కడ పుట్టారు? తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని తిరుచందూర్ దగ్గర్లోని మూలైపోజి అనే పల్లెటూర్లో పుట్టారు శివనాడార్. కోయంబత్తూర్‌లోని పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత, నాడార్ 1967లో పూణేలోని వాల్చంద్ గ్రూప్ కూపర్ ఇంజనీరింగ్‌లో కరియర్ ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ క్లాత్ మిల్స్ డిజిటల్ ఉత్పత్తుల విభాగంలో ఉద్యోగానికి మారారు. (జయహో! రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్) 1975లో హెచ్‌సీఎల్ ఆవిర్భావం ఆ తర్వాత 1975లో, తన స్నేహితులు, సహోద్యోగులతో కలిసి మైక్రోకాంప్ లిమిటెడ్ అనే పేరుతో తన సొంత వెంచర్‌ను ప్రారంభించాడు. కంపెనీలో అతిపెద్ద వాటాదారు అయిన నాడార్‌తో సహా 8 మంది భాగస్వాములు ఉన్నారు. కంపెనీ తొలుత టెలి-డిజిటల్ కాలిక్యులేటర్లను విక్రయించడంపై దృష్టి సారించింది. 1976లో ఐబీఎం ఇండియా నుంచి వెళ్లిపోవడంతో నాడార్ భారతదేశంలోని కంప్యూటర్ మార్కెట్ అవకాశాలపై దృష్టి పెట్టారు. కేవలం 18,700 రూపాయల ప్రారంభ పెట్టుబడితో హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) ఆవిష్కరించారు. హెచ్సీఎల్ను మొదటి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పిపిపి)గా మార్చే కంపెనీలో 26 శాతం వాటాకు బదులుగా రూ. 20 లక్షల అదనపు గ్రాంట్‌తో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మద్దతిచ్చింది. 1999లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో హెచ్‌సీఎల్‌టెక్ లిస్ట్ అయింది. తొలి పీసీ, ఐటీ రంగంపై అంచనాలు ఐబీఎం, యాపిల్ కంటే ముందే దేశంలో తొలి హెచ్‌సీఎల్ 8సీ తొలి పీసీ 1978లో అందించిన ఘనత శివ నాడార్ దక్కించుకున్నారు. సొంత యాజమాన్య హార్డ్‌వేర్‌తో హార్డ్‌వేర్ కంపెనీగా ప్రారంభమై పర్సనల్ కంప్యూటర్ కంపెనీగా రూపాంతరం చెందింది. తొలి ఏడాదిలోనే రూ. 10 లక్షల అమ్మకాలతో 1979 నాటికి రూ. 3 కోట్ల విలువైన కంపెనీగా నిలిచింది. అంతేనా ఐటీ రంగం, ఐటీ సేవలను ప్రాధాన్యతను అప్పట్లోనే పసిగట్టి, ఇందుకోసం సింగపూర్‌కు మారారు. అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. (ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, 2022లో, సంస్థ 11.5 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సాధించింది.బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, శివ్ నాడార్ నికర విలువ సుమారు 25.9 బిలియన్ల డాలర్లు అని అంచనా. 2020లో దేశంలో మూడో అతి పెద్ద ఐటీ కంపనీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఛైర్మన్‌గా తన బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఏకైక కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. శివసుబ్రమణ్య నాడార్ పేరుతో పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపిస్తే శివ నాడార్ స్థాపించారు. 1994లో నాడార్ తన దాతృత్వ సంస్థ శివ్ నాడార్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. తండ్రికి తగ్గ కూతురిగా రోషిణి నాడార్ తన తండ్రి శివ నాడార్ పేరిట "శివనాడార్ విశ్వవిద్యాలయం" స్థాపించడం విశేషం. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రఫీ జాబితాలో -2022 జాబితాలో శివ్ నాడార్ టాప్‌లో నిలిచారు. 2021-22 మధ్య ఆయన ఏకంగా రూ.1,161 కోట్లు విరాళం ఇచ్చారు. అంటే సగటున రోజుకు శివ్ నాడార్ రూ.3 కోట్లు విరాళం గొప్ప పరోపకారిగా నిలిచారు. -
శ్రీలంక ఉద్యోగుల పనితీరు భేష్! హెచ్‌సీఎల్ ప్రశంసల వర్షం!
న్యూఢిల్లీ: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో వ్యాపార కార్యకలాపాల కొనసాగింపునకు తగిన ప్రణాళికలున్నట్లు ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా వెల్లడించింది. అదనపు పనిభారాన్ని నిర్వహించేందుకు ఇండియా, తదితర ప్రాంతాలలోని ఉద్యోగులకు అవసరమైనంత అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలియజేసింది. శ్రీలంకలో కంపెనీ తరఫున 1,500 మంది విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ సమస్యలున్నప్పటికీ సర్వీసులు కొనసాగిస్తున్నట్లు కంపెనీ సీఈవో విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇందుకు మద్దతుగా దేశీ బృంద సభ్యులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సవాళ్ల నేపథ్యంలోనూ శ్రీలంకలోని ఉద్యోగులు సక్రమంగా బాధ్యతలు నెరవేరుస్తున్నట్లు ప్రశంసించారు. -
నిరుద్యోగులకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తీపికబురు
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ టెక్ నిరుద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా శుభవార్త తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు క్లౌడ్‌లోకి మారేందుకు సిద్ద పడుతున్న ఈ సమయంలో దానికి సంబంధించిన సేవలను వేగంగా అందించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ బిజినెస్ యూనిట్(ఏడబ్ల్యూఎస్ బీయూ)ను బుధవారం (నవంబర్ 3)న ప్రారంభించింది. ఈ ప్రత్యేక వ్యాపార యూనిట్ కోసం ఏడబ్ల్యుఎస్ ఇంజనీరింగ్, సొల్యూషన్స్, బిజినెస్ టీమ్‌లు సహకరిస్తాయని ఒక ప్రకటన తెలిపింది. "ప్రస్తుతం ఏడబ్ల్యుఎస్ టెక్నాలజీ కోసం దాదాపు 10వేల మంది సిబ్బందికి హెచ్‌సీఎల్ శిక్షణ ఇచ్చింది. భవిష్యత్తులో ఈ సంఖ్యను 20,000 మందికి పైగా నిపుణులకు పెంచాలని యోచిస్తున్నట్లు" సంస్థ తెలిపింది. కొత్త వ్యాపార యూనిట్ మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్లను ఆధునికీకరించడానికి, క్లౌడ్ టెక్నాలజీ ప్రాజెక్టులను దక్కించుకోవడానికి, లక్ష్యాలను సాధించడానికి నిపుణులు అవసరం అని సంస్థ తెలిపింది. హెచ్‌సీఎల్ అనేది ఎడబ్ల్యుఎస్ ప్రీమియర్ కన్సల్టింగ్ పార్టనర్. ఇది మౌలిక సదుపాయాల కల్పన, అప్లికేషన్లు & డేటాను ఆధునీకరించడంలో, వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడం కోసం తీసుకొచ్చినట్లు పేర్కొంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ & హెడ్(ఎకోసిస్టమ్స్) కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ.. "కంపెనీ #HCLCloudSmart వ్యూహంలో ఏడబ్ల్యూఎస్ బీయూ ఒక ముఖ్యమైన భాగం. వినియోగదారులకు పోటీదారుల కంటే ముందుగా బలమైన క్లౌడ్ వ్యవస్థల నిర్మాణం, సేవలు అందించడంలో ఇది సహాయపడుతుంది" అని అన్నారు. (చదవండి: ప్రతి నెల రూ.1500 పొదుపు చేస్తే.. రూ.35 లక్షలు మీ సొంతం!) -
గ్రాడ్యుయేట్స్‌కి బంపర్ ఆఫర్.. లక్షకు పైగా ఉద్యోగాలు
దేశంలోని పలు టాప్ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే టీసీఎస్ 43వేల మంద్రి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌ని నియమించుకోగా.. ఇప్పుడు మరో 35 వేల మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీసీఎస్‌తో పాటు మిగిలిన టెక్ కంపెనీలు సైతం ఈ ఫ్రెషర్స్‌ను నియమించుకునేందుకు ప్లాన్ చేస్తుండగా.. ఈ ఏడాది చివరి నాటికి మరో లక్షమందికి పైగా ఫ్రెషర్స్ ఉద్యోగ అవకాశాల్ని కల్పించనున్నట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆయా కంపెనీలు త్రైమాసిక ఆదాయాల గణాంకాల విడుదల సందర్భంగా ఫ్రెషర్స్ నియామకంపై స్పందించాయి. వర్చువల్ వర్క్ డిమాండ్ పెరగడంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీలు లక్షమందిని నియమించుకోనున్నట్లు తెలిపాయి. టీసీఎస్ నియామకాలు గతవారం దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్ సందర్భంగా మరో 35వేల మంది ఫ్రెషర్స్ ను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం 78వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించినట్లవుతుంది. టీసీఎస్ ఇప్పటికే గత ఆరునెలల్లో 43వేల మందిని ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. ఇన్ఫోసిస్ నియామకాలు గతంలో ఇన్ఫోసిస్ 35వేల మందిని నియమించుంటున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. కానీ అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస సమస్య) రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో వారి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ప్రవీణ్ రావు తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే లోపల మరో 10వేల మందిని ఎంపిక చేసుకోనున్నట్లు చెప్పారు. విప్రో నియామకాలు రెండో ఆర్ధిక సంవత్సరంలో (ఏప్రిల్, మే,జూన్) మొత్తం 8,100 ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా సెలక్ట్ చేసుకున్నట్లు విప్రో సీఈఓ థియరీ డెలాపోర్ట్ చెప్పారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో మరో 25వేల మందిని ఎంపిక చేసుకోనున్నట్లు తెలిపారు. హెచ్‌సీఎల్ లో నియామకాలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సైతం ఈ ఏడాది చివరి నాటికి 20వేల నుంచి 22వేల మందిని, వచ్చే ఏడాదిలో మరో 30వేల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో! -
విజయవాడ హెచ్‌సీఎల్‌లో వెయ్యి ఐటీ ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: విజయవాడ క్యాంపస్(గన్నవరం)లో పనిచేసేందుకు గానూ వెయ్యి మంది ఉద్యోగుల ఎంపిక కోసం వచ్చే నెల 12, 13 తేదీల్లో నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ తెలిపారు. ‘హెచ్‌సీఎల్ న్యూ విస్టాస్’ కార్యక్రమం కింద వర్చువల్ విధానంలో నిర్వహించే ఈ నియామక ప్రక్రియకు ఇంజనీరింగ్ ఫ్రెషర్స్‌తో పాటు 2 ఏళ్ల నుంచి 8 ఏళ్ల అనుభవం ఉన్నవారు కూడా అర్హులేనని చెప్పారు. విజయవాడ సమీపంలోని గన్నవరంలో ఉన్న హెచ్‌సీఎల్ క్యాంపస్‌లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఇక్కడ 1,500 మంది ఐటీ ఉద్యోగులున్నారని చెప్పారు. నాలుగేళ్లలో ఈ సంఖ్యను 5 వేలకు చేర్చాలన్నది తమ లక్ష్యమని వివరించారు. అనుభవజ్ఞులకు జావా, చిప్ డిజైనింగ్, డాట్నెట్ తదితర అంశాలపై టెస్ట్‌లు నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఈ డ్రైవ్ జరుగుతుందన్నారు. వచ్చే నెల 11లోగా https://www.hcltech.com/ careers/vijayawadaలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్ అర్హతతో ఐటీ ఉద్యోగాల కోసం ‘టెక్ బి’ ఇంటర్మీడియెట్ అర్హతతో ఐటీ కెరీర్‌ను ప్రారంభించేందుకు హెచ్‌సీఎల్ అవకాశం కల్పిస్తోందని శ్రీమతి శివశంకర్ తెలిపారు. ఇందుకోసం ‘టెక్ బి’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నవారితో పాటు గత రెండేళ్లలో ఇంటర్ పాస్ అయిన వారు దీనికి అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ‘హెచ్‌సీఎల్ టెక్ బి’ కార్యక్రమం కింద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఏడాది పాటు ‘టెక్ బి’ శిక్షణ ఇచ్చి.. హెచ్‌సీఎల్‌లో ఉద్యోగమిస్తామని చెప్పారు. వీరు బిట్స్ పిలాని, శాస్త్ర యూనివర్సిటీల ద్వారా ఉన్నత విద్య అభ్యసించేందుకు కూడా సహకరిస్తామన్నారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏపీ ఐటీ ఉద్యోగులు.. తమ రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసేందుకుగానూ విజయవాడ క్యాంపస్ ద్వారా ‘కమ్ బ్యాక్ హోమ్’ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. అలాగే ఏపీ ప్రభుత్వ సహకారంతో విజయవాడ క్యాంపస్‌లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్వహిస్తున్నామన్నారు. -
హెచ్‌సీఎల్ టెక్ రికార్డ్- జీవోసీఎల్ జోరు
సరిహద్దు వద్ద చైనాతో వివాదాల నేపథ్యంలో అటూఇటుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. కాగా.. ఐటీ సర్వీసుల ఆస్ట్రేలియన్ కంపెనీ డీడబ్ల్యూఎస్ లిమిటెడ్‌ను సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించడంతో సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు యూకే అనుబంధ సంస్థ ద్వారా క్వేకర్ హాటన్ కంపెనీలో 2 లక్షల షేర్లను విక్రయించనున్నట్లు పేర్కొనడంతో లూబ్రికెంట్స్ దిగ్గజం జీవోసీఎల్ కార్పొరేషన్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఐటీ సర్వీసుల ఆస్ట్రేలియన్ కంపెనీ డీడబ్ల్యూఎస్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా పేర్కొంది. ఇందుకు 15.82 కోట్ల డాలర్లు(రూ. 1160 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా కొనుగోలు ప్రక్రియ పూర్తికావచ్చని తెలియజేసింది. ఐటీ, బిజినెస్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సేవల కంపెనీ డీడబ్ల్యూఎస్.. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్లలో సర్వీసులను అందిస్తున్నట్లు వివరించింది. తద్వారా ఆయా ప్రాంతాలలో సాఫ్ట్వేర్ సేవల విస్తరణకు వీలు కలగనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ పేర్కొంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 850 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 844 వద్ద ట్రేడవుతోంది. జీవోసీఎల్ కార్పొరేషన్ యూకే అనుబంధ సంస్థ హెచ్జీహెచ్ఎల్ హోల్డింగ్స్ ద్వారా క్వేకర్ హాటన్ కంపెనీలో 2 లక్షల షేర్లను విక్రయించేందుకు నిర్ణయించినట్లు జీవోసీఎల్ కార్పొరేషన్ వెల్లడించింది. క్వేకర్ కెమికల్ కార్పొరేషన్లో 4.27 లక్షల షేర్లను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. షేరుకి 175 డాలర్లలో 2 లక్షల షేర్లను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు పేర్కొంది. తద్వారా రూ. 257 కోట్లు సమకూరగలవని తెలియజేసింది. వీటికి పన్ను వర్తించదని తెలియజేసింది. ఈ నేపథ్యంలో జీవోసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 14 శాతంపైగా దూసుకెళ్లి రూ. 210ను తాకింది. ప్రస్తుతం 11 శాతం జంప్‌చేసి రూ. 204 వద్ద ట్రేడవుతోంది. -
హెచ్‌సీఎల్ టెక్ కొత్త అధినేత రోషిణీ
ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు కొత్త చైర్‌పర్శన్‌గా రోషిణీ నాడార్ మల్హోత్రా ఎంపికయ్యారు. ఇందుకు వీలుగా రోషిణీ తండ్రి శివ్‌నాడార్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. అయితే కంపెనీ ఎండీగా ప్రధాన వ్యూహకర్త(సీఎస్‌వో) బాధ్యతలను శివ్‌నాడార్ చేపట్టనున్నారు. క్యూ1 ఫలితాల విడుదల సందర్భంగా రోషిణీ నాడార్ ఎంపిక వివరాలను హెచ్‌సీఎల్ టెక్ వెల్లడించింది. సంపన్న మహిళ 38 ఏళ్ల రోషిణీ నాడార్ ఇప్పటివరకూ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. హెచ్‌సీఎల్ ఎంటర్ప్రైజ్ సీఈవోగానూ విధులు నిర్వర్తిస్తున్నారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి రోషిణీ ఎంబీఏ పూర్తి చేశారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హ్యూరన్ 2019 ర్యాంకింగ్‌ల ప్రకారం దేశీయంగా అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా రోషిణీ నిలిచారు. రోషిణీ సంపద రూ. 36,800 కోట్లుగా ఐఐఎఫ్ఎల్ వెల్త్ పేర్కొంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు చెందిన అనుబంధ దాతృత్వ సంస్థ బాధ్యతలను రోషిణీ నిర్వహిస్తున్నారు. రూ. 2 డివిడెండ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ. 2925 కోట్ల నికర లాభం ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన ఇది 31.7 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 8.6 శాతం పెరిగి రూ. 17,841 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. వాటాదారులకు షేరుకి రూ. 2 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. జూన్ చివరికల్లా కంపెనీలో 1,50,287 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ తెలియజేసింది. జూన్ త్రైమాసికంలో స్థూలంగా 7,005 మందికి కంపెనీలో ఉపాధి కల్పించినట్లు వెల్లడించింది. -
హెచ్‌సీఎల్ టెక్.. Q1 ఓకే- షేరు అప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అంచనాలకు అనుగుణమైన ఫలితాలు ప్రకటించింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో హెచ్‌సీఎల్ టెక్ రూ. 2925 కోట్ల నికర లాభం ఆర్జించింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇది 7.3 శాతం తక్కువకాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 3154 కోట్ల లాభం నమోదైంది. ఇక మొత్తం ఆదాయం సైతం 4 శాతం క్షీణించి రూ. 17,481 కోట్లను తాకింది. గత(2019-20) క్యూ4లో రూ. 18,590 కోట్ల ఆదాయం సాధించింది. డాలర్ల రూపేణా ఆదాయం 7.4 శాతం నీరసించి 2356 మిలియన్లకు చేరింది. అంతక్రితం 2543 మిలియన్ డాలర్ల ఆదాయం నమోదైంది. గైడెన్స్ ఇలా రానున్న మూడు క్వార్టర్లలో డాలర్ల ఆదాయం 1.5-2.5 శాతం మధ్య పుంజుకోగలదని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అంచనా వేస్తోంది. నిర్వహణ లాభ మార్జిన్లు 19.5-20.5 శాతం స్థాయిలో నమోదుకాగలవని భావిస్తోంది. కాగా.. ఈ క్యూ1లో హెచ్‌సీఎల్ టెక్ నిర్వహణ లాభం(ఇబిట్) 5.7 శాతం వెనకడుగుతో రూ. 3660 కోట్లను తాకింది. ఇబిట్ మార్జిన్లు 20.8 శాతం నుంచి 20.5 శాతానికి నామమాత్రంగా బలహీనపడ్డాయి. ఈ కాలంలో 11 కొత్త ట్రాన్స్ఫార్మేషనల్ డీల్స్‌ను కుదుర్చుకున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలియజేసింది. పలు విభాగాలలో డిమాండ్ కనిపిస్తున్నదని, డీల్ పైప్‌లైన్ రీత్యా ఈ ఏడాది సైతం పటిష్ట ఫలితాలు సాధించే వీలున్నట్లు యాజమాన్యం అంచనా వేస్తోంది. కోవిడ్-19 నేపథ్యంలో తలెత్తిన అనిశ్చిత పరిస్థితులు కొంతమేర ఆదాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు ఫలితాల విడుదల సందర్భంగా తెలియజేసింది. 36 శాతం ప్లస్ ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 1.3 శాతం పుంజుకుని రూ. 636 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 640 వరకూ ఎగసింది. ఫలితాల విడుదలకు ముందురోజు అంటే గురువారం ఈ షేరు రూ. 652 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకడం గమనార్హం! ఈ ఏడాది మార్చి 19న రూ. 376 దిగువన 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. గత మూడు నెలల్లో ఈ షేరు 36 శాతం ర్యాలీ చేయడం విశేషం! -
5వేల ఉద్యోగాలిస్తాం -హెచ్‌సీఎల్ టెక్
సాక్షి, లక్నో: ప్రముఖ ఐటీ సేవల దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమంలో భాగంగా విద్య, ఆరోగ్యం, విద్యుత్ రంగాలలో భాగంగా రూ. 160 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ నేపథ్యంలో రానున్న సంవత్సరాల్లో 5 వేల మందిని నియమించుకోనుంది. స్థానికులకు ప్రోత్సాహమిస్తూ.. వచ్చే ఏడాది మరో 2 వేలమందిని రిక్రూట్ చేసుకుంటామని కంపెనీ ప్రకటించింది. సీఎస్ఆర్లో భాగంగా రూ.160 కోట్లు ఖర్చు చేస్తామని తద్వారా గ్రామాల అభివృద్ధికి సహాయపడనున్నామని ఉత్తరప్రదేశ్ పెట్టుబడిదారుల సదస్సులో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. తద్వారా 5వేలు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ముఖ్యంగా టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగంలో ఇప్పటికే 2 వేల ఉద్యోగాలులిచ్చామని, రాబోయే 12 నెలల్లో 2 వేల ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తామన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 700 గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా గ్రామస్తులకు వైద్య సదుపాయం, విద్యుత్, వ్యవసాయ ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని చెప్పారు. యూపీని "కర్మభూమి" గా అభివర్ణించిన ఆయన 1976లో నోయిడాలో చైర్మన్ శివ్ నాడర్‌తో కలిసి కేవలం నలుగురితో ప్రారంభమైన సంస్థలో ఇప్పుడు 1.2 లక్షల మంది పనిచేస్తున్నారనీ, 7.5 బిలియన్ డాలర్ల సంస్థగా ఎదిగిందని గుప్తా చెప్పారు. -
అంచనాలను బీట్ చేసిన హెచ్‌సీఎల్
సాక్షి,ముంబై: భారతీయ నాలుగవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల ఎగుమతిదారు అయిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రెండో త్రైమాసికంలో నికరలాభంలో 9.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంచనాలను బీట్ చేస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్( సెప్టెంబర్) ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. బుధవారం వెల్లడించిన సెప్టెంబరు 30 తో ముగిసిన క్యూ2(జూలై-సెప్టెంబర్) ఫలితాల్లో త్రైమాసిక ప్రాతిపదికన మూడు నెలల్లో నికర లాభం రూ. 2,207 కోట్లనుసాధించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 2,015 కోట్లను ఆర్జించింది. మొత్తం ఆదాయం 2.3 శాతం పెరిగి రూ. 12,433 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 4 శాతం పుంజుకుని రూ. 3037 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 0.39 శాతం బలపడి 24.4 శాతంగా నమోదయ్యాయి. కార్యకలాపాల ఆదాయం 8 శాతం పెరిగి రూ. 12,433 కోట్లు. స్థిరమైన కరెన్సీపరంగా వార్షిక రెవెన్యూ గైడెన్స్ 10.5 - 12.5 శాతం మధ్య వృద్ధిని అంచనా వేస్తున్నట్టుగా పేర్కొంది. అలాగే ఒక్కో షేరుకు కూ.2రూ. డివిడెండ్ ప్రకటించింది. కాగా ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 1,783 కోట్లు
- 3 శాతం క్షీణత - ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్ న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.1,783 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముం దటి ఏడాది ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.1,834 కోట్లు)తో పోల్చితే 3 శాతం క్షీణత నమోదైందని కంపెనీ పేర్కొంది. విక్రయ, సాధారణ, నిర్వహణ వ్యయాలు అధికంగా ఉండడం వల్ల నికర లాభం తగ్గిపోయిందని వివరించింది. గత ఏప్రిల్-జూన్ క్వార్టర్లో రూ.8,424 కోట్లుగా ఉన్న ఆదాయం(కన్సాలిడేటెడ్) ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు 16 శాతం వృద్ధితో రూ.9,777 కోట్లకు పెరిగిందని ప్రెసిడెంట్, సీఈఓ అనంత్ గుప్తా చెప్పారు. ఈ కంపెనీ జూలై-జూన్ ఆర్థిక సంవత్సరాన్ని పాటిస్తోంది. ఇక డాలర్ రూపేణా కంపెనీ నికర లాభం 9 శాతం క్షీణించింది. గత ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 31 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు 28 కోట్ల డాలర్లకు తగ్గిందని అనంత్ గుప్తా తెలిపారు. ఆదాయం 140 కోట్ల డాలర్ల నుంచి 9 శాతం వృద్ధితో 153 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 12 శాతం వృద్ధితో 116 కోట్ల డాలర్లకు, ఆదాయం 11 శాతం వృద్ధితో 595 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. రెండంకెల్లో వృద్ధి 2014-15లో తమ కంపెనీ అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధిని సాధించిందని గుప్తా పేర్కొన్నారు. కొత్తగా చేరిన 9,448 మంది ఉద్యోగులతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,06,107కు పెరిగిందని తెలిపారు. జూన్ 30, 2015తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.6,369 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.7,254 కోట్లకు, ఆదాయం రూ.32,917 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.37,061 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. కాగా కంపెనీ ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీ డివిడెండ్ ప్రకటించడం వరుసగా 50వ క్వార్టర్. ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో కంపెనీ షేర్ ఎన్ఎస్ఈలో 6 శాతం క్షీణించి రూ.939 వద్ద ముగిసింది.