సాక్షి, లక్నో: ప్రముఖ ఐటీ సేవల దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా విద్య, ఆరోగ్యం, విద్యుత్ రంగాలలో భాగంగా రూ. 160 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ నేపథ‍్యంలో రానున్న సంవత్సరాల్లో 5 వేల మందిని నియమించుకోనుంది. స్థానికులకు ప్రోత్సాహమిస్తూ.. వచ్చే ఏడాది మరో 2 వేలమందిని రిక్రూట్ చేసుకుంటామని కంపెనీ ప్రకటించింది.
సీఎస్‌ఆర్‌లో భాగంగా రూ.160 కోట్లు ఖర్చు చేస్తామని తద్వారా గ్రామాల అభివృద్ధికి సహాయపడనున్నామని ఉత్తరప్రదేశ్ పెట్టుబడిదారుల సదస్సులో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. తద్వారా 5వేలు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ముఖ్యంగా టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగంలో ఇప్పటికే 2 వేల ఉద్యోగాలులిచ్చామని, రాబోయే 12 నెలల్లో 2 వేల ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తామన్నారు. ఉత్తరప్రదేశ్లోని 700 గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా గ్రామస్తులకు వైద్య సదుపాయం, విద్యుత్, వ్యవసాయ ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని చెప్పారు. యూపీని "కర్మభూమి" గా అభివర్ణించిన ఆయన 1976లో నోయిడాలో చైర్మన్ శివ్ నాడర్‌తో కలిసి కేవలం నలుగురితో ప్రారంభమైన సంస్థలో ఇప్పుడు 1.2 లక్షల మంది పనిచేస్తున్నారనీ, 7.5 బిలియన్ డాలర్ల సంస్థగా ఎదిగిందని గుప్తా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment