![Philips to invest Rs 300 cr hire 1500 people in India - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/3/philips.jpg.webp?itok=42PreeJA)
సాక్షి, న్యూఢిల్లీ: కన్స్యూమర్ డ్యూరబుల్స్ దిగ్గజం ఫిలిప్స్ ఇండియాలో భారీ పెట్టుబడులపై దృష్టి పెట్టింది. దేశంలో రూ.300 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనున్నామని సంస్థ గ్లోబల్ సీఈఓ ఫ్రాన్స్ వాన్ హౌటెన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశంలో 1500 మంది ఉద్యోగులను నియమించాలని కూడా యోచిస్తోందని తెలిపారు.
దేశంలో సంస్థ కార్యకలాపాలను విస్తరించనున్నామని ఫిలిప్స్ గ్లోబల్ సీఈవో ప్రకటించారు. పుణేతో విస్తరణతోపాటు, సాఫ్ట్‌వేర్ వనరులు ఎక్కువగా ఉండే బెంగళూరులోని తమ ఇన్నోవేషన్ సెంటర్ కార్యకలాపాలకు ప్రాముఖ్యతనిస్తామన్నారు. అలాగే చెన్నైలోని తమ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌ను కూడా విస్తరిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో మొత్తంగా 1500 మంది కొత్త ఉద్యోగులను ఎంపిక చేయనున్నామని చెప్పారు.
ఫిలిప్స్ భారతదేశంపై దృష్టి సారించిందని, ఇది ఒక గొప్ప మార్కెట్ అని నమ్ముతున్నామని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో వెంటిలేటర్లు,మానిటర్లు వంటి క్లిష్టమైన సంరక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచామన్నారు. భారతదేశంలో అనేక పథకాలున్నప్పటికీ ఆరోగ్య సంరక్షణ అనేది పెద్ద సమస్యగా మారిందన్నారు మౌలిక సదుపాయాల ప్రాపత్య సవాలుగా మిగిలిపోయిన ప్రస్తుత తరుణంలో మౌలిక పరికరాలను, సదుపాయాలను అభివృద్ధి చేసి వారికి చేరువ చేయాల్సిన అవసరం ఉందని వాన్ హౌటెన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment