
అమెరికా స్టాక్ మార్కెట్ ఈ వారం భారీగా పడిపోవడంతో అపర కుబేరుడు, వారెన్ బఫెట్ సంపద కూడా భారీగా పతనమైంది. ఈ వారం స్టాక్ మార్కెట్ క్షీణతతో వారెన్ బఫెట్‌కు 374 కోట్ల డాలర్ల (రూ.24,300 కోట్లు) నష్టం వచ్చింది. వారెన్ బఫెట్ సంపదే కాకుండా ఇతర సంపన్నుల సంపద కూడా భారీ స్థాయిలోనే హరించుకుపోయింది. ఫేస్‌బుక్ మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ లారీ పేజ్, సెర్గీ బ్రిన్ తదితరులు పెద్ద మొత్తంలోనే నష్టపోయారు. బఫెట్‌కు చెందిన బెర్కషైర్ హాతవే మార్కెట్ విలువ తాజా పతనం తరవాత రూ.32.5 లక్షల కోట్లు.
మొత్తం12,800 కోట్ల డాలర్లు హుష్‌కాకి...
సోమవారం నుంచి అమెరికా స్టాక్ మార్కెట్ పతనం కావడంతో 500 మందికి పైగా కుబేరులు 12,800 కోట్ల డాలర్ల (రూ.8,32,000 కోట్లు) మేర నష్టపోయారు. ఇది నెట్‌ఫ్లిక్స్, లేదా మెక్‌డొనాల్డ్ కార్ప్‌ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు సమానం. ఇలా నష్టపోయిన కుబేరుల్లో అమెరికాకు చెందిన వారి సంపద 5,500 కోట్ల డాలర్లు కాగా... చైనాకు చెందినవారిది 1,400 కోట్ల డాలర్లు.
ఎందుకు ఈ నష్టాలు.. ?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టిన జెరోమి పావెల్ ఇటీవలే అమెరికా సెనేట్‌లో ప్రసంగించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీ పటిష్టంగా ఉందని, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో నిమిత్తం లేకుండా రేట్లు పెంచుతామని సంకేతాలిచ్చారు. అమెరికా వ్యవస్థ అంచనాలకు మించి పుంజుకుం టుండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా అంచనాలను మించిన వేగంతో రేట్లను పెంచుతుందన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. దీంతో ఈ మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్ భారీగానే నష్టపోయింది. ఇక తాజాగా అమెరికాకు దిగుమతి అవుతున్న ఉక్కు ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియమ్ ఉత్పత్తులపై 10 శాతం మేర సుంకాలు విధిస్తామని, ఈ సుంకాలు వచ్చే వారం నుంచే ఆరంభమవుతాయని, దీర్ఘకాలం పాటు అమల్లో ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో అమెరికా స్టాక్ మార్కెట్ గురువారం భారీగా పతనమైంది. ఈ సుంకాల విధింపు వాణిజ్య యుద్ధాలకు దారితీస్తుందని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషణ.