న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డుల సంస్థ ఎస్‌బీఐ కార్డ్ త్వరలో రూపే పేమెంట్ నెట్‌వర్క్ ఆధారిత కార్డులను జారీ చేయనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)తో కుదుర్చుకోవాల్సిన ఒప్పందం ఒకటి ఉందని, ఇది పూర్తయిన వెంటనే రూపే కార్డులకు సంబంధించి కొన్ని ఉత్పత్తులను ప్రవేశపెడతామని ఎస్‌బీఐ కార్డ్ ఎండీ హర్‌దయాళ ప్రసాద్ తెలిపారు. జాతీయతా భావం రగులుతున్న నేపథ్యంలో రూపే కార్డులే కావాలని అడుగుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ జారీ చేసే మూడో వంతు కార్డులు ఇవే ఉంటున్నాయని వివరించారు. దీన్ని బట్టి చూస్తుంటే రూపే కార్డుల వాడకం మరింతగా పెరుగుతుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డుల్లో ఎక్కువ శాతం కార్డులు అమెరికన్ పేమెంట్ గేట్‌వేస్ వీసా, మాస్టర్‌కార్డ్ ఆధారితమైనవే ఉంటున్నాయి. జూలై ఆఖరు నాటికి ఎస్‌బీఐ కార్డుకు 90 లక్షల ఖాతాదారులు, 17.9 శాతం మార్కెట్ వాటా ఉంది. 2018 డిసెంబర్ నుంచి ప్రతి నెలా 3 లక్షల కార్డులు అదనంగా జతవుతున్నాయని ప్రసాద్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment