మనీలా: అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 65– 66 స్థాయిలో ఉంటే సముచితమైనదేనని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కరెన్సీ పతనం ప్రతికూల ప్రభావాల గురించి ఆందోళన అక్కర్లేదని, రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ముడిచమురు ధర బ్యారెల్‌కు 75 డాలర్ల స్థాయిలో స్థిరపడుతుండటం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్‌ను (ఎఫ్‌పీఐ) ట్రెజరీ బిల్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించడం తదితర పరిణామాలతో రూపాయి మారకం విలువ కొంతకాలం పాటు 66–67 స్థాయిలో ఉండొచ్చన్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గర్గ్ ఈ విషయాలు తెలిపారు.
రూపాయి మారకం విలువ 64 స్థాయిలో ఉండటం సరైన ఎక్స్చేంజీ రేటుగా పరిగణించలేమని, ఈ స్థాయిలో ఉంటే ఎగుమతులకు ప్రతికూలమని చెప్పారాయన. ‘రూపాయి మారకం విలువ 64 స్థాయికి పెరిగినప్పుడు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపింది. మళ్లీ 65– 66 స్థాయికి వస్తే సముచిత మారకం విలువగానే పరిగణించవచ్చు. దీని గురించి ఆందోళన అవసరం లేదు‘ అని గర్గ్ తెలిపారు.
ఈ ఏడాది బాగా పతనమైన ఆసియా కరెన్సీల్లో రూపాయి రెండో స్థానంలో ఉంది. డాలర్‌తో పోలిస్తే గతేడాది 6.4 శాతం పెరగ్గా, ఈ ఏడాది ఇప్పటిదాకా 2.4 శాతం మేర క్షీణించింది. భారత్ ఇంధన అవసరాల్లో 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నందున... రూపాయి మారకం విలువ క్షీణిస్తే కరెంటు అకౌంటు లోటుపైనా ప్రభావం పడుతుంది.
పుష్కలంగా విదేశీ మారక నిల్వలు: ఏడీబీ
పుష్కలంగా విదేశీ మారక నిల్వలు ఉన్న భారత్... ప్రస్తుతం కరెన్సీ ఒడిదుడుకుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏడీబీ చీఫ్ ఎకనమిస్ట్ యసుయుకి సవాడా చెప్పారు. అయితే, రూపాయి క్షీణత వల్ల ఎగుమతుల రంగానికి ప్రయోజనం ఉన్నప్పటికీ.. ఎకానమీలో ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లు తలెత్తే అవకాశం ఉందన్నారు.
మరోవైపు, ఇప్పటికే 75 డాలర్లకు చేరిన ముడిచమురు బ్యారెల్ ధర మరింత భారీగా పెరగకపోవచ్చని యసుయుకి తెలిపారు. ఏప్రిల్ 6తో ముగిసిన వారాంతంలో భారత విదేశీ మారక నిల్వలు ఆల్‌టైం గరిష్టమైన 424.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఐదు రోజుల్లో మొదటి పతనం!
ముంబై: అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ ఐదురోజుల్లో తొలిసారి శుక్రవారం 23 పైసలు బలహీనపడింది. ఇంట్రాడే ఫారెక్స్ మార్కెట్‌లో 66.87 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల బలహీనత, క్రమంగా వెనక్కెళుతున్న పెట్టుబడులు, క్రూడ్ ధరల పరుగు, దీనితో క్యాడ్ భయాలు వంటి అంశాలు ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఏప్రిల్ 25వ తేదీన రూపాయి 14 నెలల కనిష్టస్థాయి 66.91 స్థాయిని తాకి అటు తర్వాత కొంత రికవరీ అవుతూ వచ్చింది. అయితే నేటి బలహీనతతో వారం చివరకు 21పైసలు బలహీనపడింది.
క్రూడ్ ధరలు బెంబేలు..
మరోవంక ఈ వార్త రాసే సమయం రాత్రి 10.30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయిలను చూశాయి. బ్రెంట్ బ్యారల్ ధర 75.06 డాలర్లను తాకింది. ఇక నైమెక్స్ ధర 69.97ను చేరింది. 70 డాలర్లు కీలక నిరోధం. దీనిని అధిగమిస్తే, తక్షణం 72 డాలర్లకు ఎగిసే అవకాశం ఉందని నిపుణుల విశ్లేషణ.
Comments
Please login to add a commentAdd a comment