Subhash Chandra Garg
-
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకూడదంటే.. ఇక అదొక్కటే మార్గం..?
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడంతో అప్పటి నుంచి అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ మంటను చల్లార్చేందుకు కేంద్రం ప్రభుత్వం అచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో చాలా మంది దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు గత కొద్ది రోజుల నుంచి వినిపిస్తుంది. అయితే, కేంద్రం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా ఉండటానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తుంది. ప్రపంచ ముడిచమురు ధరల ప్రభావం నుంచి వినియోగదారులను రక్షించడానికి డీజిల్, పెట్రోల్ విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని రూ.10-12 తగ్గించాల్సి అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం ముందు వేరే మార్గం లేదని మాజీ ఆర్థిక కార్యదర్శి తెలిపారు. "ఆదాయంపై ప్రభావం పడకుండా చమురు రిటైల్ ధరలు తగ్గే మార్గం లేదు. ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 నుంచి రూ.12కు తగ్గించాల్సి ఉంది. ప్రస్తుతం వేరే మార్గం లేదు" అని సుభాష్ చంద్ర గార్గ్ సీఎన్ బిసీ-టీవీ18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మార్చి 7న బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధరలు 139 డాలర్లకు చేరుకున్నాయి. అమెరికా, యూరోపియన్ మిత్రదేశాలు రష్యన్ చమురుపై నిషేధాన్ని విధిస్తాయని వచ్చిన వార్తల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగిన తర్వాత రూపాయి మారకం విలువ భారీగా క్షీణించింది. ఇది దేశీయ ఇంధన ధరలపై ఎక్కువగా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు. చమురు ధరలు పెంచడం వల్ల ద్రవ్యోల్పణం పెరిగి జీడిపీ మీద ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలిపారు. అలాగే, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది అని సుభాష్ అన్నారు. (చదవండి: అబ్బే..అలాంటిదేం లేదు! రష్యా వార్నింగ్‌తో మాట మార్చిన అమెరికా?) -
నా బదిలీకి నిర్మలా పట్టుబట్టారు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి పని చేయడం కష్టమని ఆ శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ శనివారం బ్లాగ్‌లో పేర్కొన్నారు. తనను ఆర్థిక శాఖ నుంచి బదిలీ చేయాలంటూ ఆమె పట్టుబట్టారని తెలిపారు. స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) చేసిన ఏడాది తర్వాత అందుకు గల కారణాలను ఆయన బహిర్గతం చేశారు. తన బ్లాగ్ పోస్టులో పలు అంశాలను ప్రస్తావించారు. నిర్మలా సీతారామన్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టమని తాను భావించానని, అందుకే వీఆర్ఎస్ తీసుకున్నానని వివరించారు. ఆమెతో తనకు కలిసి రాలేదన్నారు. ఆమె తన బదిలీ కోరేకంటే ముందే తమ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కాకుండా మరో శాఖలో పనిచేయాలని తాను భావించలేదని పేర్కొన్నారు. దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పోలిస్తే నిర్మలది భిన్నమైన వ్యక్తిత్వమని, అరుణ్ జైట్లీతో పనిచేయడం తనకు వృత్తిపరంగా సంతృప్తినిచ్చిందన్నారు. -
నిర్మలా సీతారామన్‌తో పనిచేయడం కష్టం..
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఏడాది తరువాత దీనికి గల కారణాలపై మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది అక్టోబర్ 31న స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన శనివారం సుదీర్ఘమైన బ్లాగ్ పోస్ట్‌లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. తాను ఎందుకు రాజీనామా చేసిందీ బ్లాగులో ప్రచురించారు. ముఖ్యంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి పనిచేయడం కష్టంగా తాను భావించానని పేర్కొన్నారు. ఆమెతో తనకు కలిసి రాలేదన్నారు. వాస్తవానికి ఆర్థికమంత్రి తన బదిలీ కోరేకంటే ముందే తమ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనీ చెప్పారు. తన రాజీనామా నిర్ణయం వెనుక రెండు కారణాలున్నాయని గార్గ్ చెప్పారు. మొదటిది 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థనుంచి కేంద్రం పక్కకుపోవడం, రెండవది ఆర్థిక మంత్రితో తన సంబంధాలు బాగా లేకపోవడం కారణమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్థికమంత్రిత్వ శాఖ కాకుండా మరో శాఖలో పనిచేయాలని తాను భావించలేదన్నారు. భిన్నమైన వ్యక్తిత్వం, నాలెడ్జ్ ఎండోమెంట్, నైపుణ్యం, ఎకనామిక్ పాలసీలకు సంబంధించి సరియైన విధానాన్ని కలిగి ఉన్నారంటూనే ఆమెతో పనిచేయడం కష్టమని గార్గ్ వ్యాఖ్యానించారు. అలాగే 10 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంనుంచి కేంద్రం పక్కకుపోయిందనీ, ఇది సాధ్యంకాదనే విషయం తనకు ప్రారంభంలోనే స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. అలాగే దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి పనిచేయడం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనకు చాలా ఉత్తమమైనదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజా విధాన సమస్యల నాడిని అవగతం చేసుకున్న మాస్టర్ మైండ్ జైట్లీ అని కొనియాడారు. విధానాల అమలు, శాఖ నిర్వహణ తదితర అంశాలను ఆయన కార్యదర్శులకు విడిచిపెట్టేవారని గుర్తు చేసుకున్నారు.నిర్మలా సీతారామన్‌కు కూడా తనపై నమ్మకం ఉన్నట్టు అనిపించలేదనీ, చాలా అసౌకర్యంగా ఉన్నట్టు గుర్తించానని గార్గ్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆర్ బీఐ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్, నాన్-బ్యాంకింగ్ సంస్థలు, పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ పథకం విషయాలపై ఇద్దరి మధ్య తీవ్రమైన తేడాలు ఏర్పడ్డాయని మాజీ ఆర్థిక కార్యదర్శి చెప్పారు. దీంతో అధికారికంగా, వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో బాధ్యతలు స్వీకరించిన ఒక నెలలోనే, 2019 జూన్‌లో తన బదిలీ కోసం సీతారామన్ పట్టుబట్టినట్లు గార్గ్ పేర్కొన్నారు. అందుకే బడ్జెట్ సమర్పించిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నాను. జూలై 24 న విద్యుత్ మంత్రిత్వ శాఖకు బదిలీ ఉత్తర్వు జారీ అయిన అరగంటలోనే స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దాఖలు చేశానని చెప్పారు. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయానని తన బ్లాగులో చెప్పారు. -
ఏపీ సీఎం ఆర్థిక సలహాదారుగా సుభాష్ చంద్ర
-
ఏపీ సీఎం సలహాదారుగా సుభాష్ చంద్ర గార్గ్
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సలహాదారుడిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ఆయనను నియమించింది. సుభాష్ చంద్ర గార్గ్‌కు కేబినెట్ హోదా కల్పిస్తూ రెండేళ్ల పాటు కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. సుభాష్ చంద్ర గార్గ్‌కు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవముంది. గార్గ్.. రాజస్తాన్ కేడర్-1983 ఐఏఎస్ అధికారి. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా సేవలందించడంతో పాటు ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానూ గార్గ్ వ్యవహరించారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు, సెబీ లో ఒక సభ్యునిగా కొనసాగారు. దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీలోనూ ఈయన సేవలు అందించారు. -
రూ.2000 నోటు : ఎస్సీ గార్గ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో సగానికి పైగా చలామణిలోఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి ప్రకంపనలు రేపారు. తాజాగా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్.సి.గార్గ్ డిమానిటైజేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మాట్లాడుతూ రూ. 2వేల నోటును కూడా రద్దు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో రూ. 2 వేల నోటు రద్దుపై పలు అనుమానాలు, అంచనాలు ఆందోళన రేపుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు షాకిస్తున్నాయి. ద్రవ్య చలామణిలో పెద్దదైన రూ.2వేల నోటును రద్దు చేస్తారా అనే భయాందోళనలు మరోసారి రేగాయి. నవంబర్ 8, 2016 న డీమోనిటైజేషన్ ప్రకటించిన తర్వాత ప్రవేశపెట్టిన కొత్త రూ .2000 నోట్లు ప్రధానంగా ఉన్నాయనీ ఇపుడు వీటిని అక్రమ టెండర్‌గా ప్రకటించవచ్చని సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. రూ .2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవడం వల్ల ఎలాంటి అంతరాయం కలగదని ఆయన అన్నారు. పెద్ద నోట్ల స్థానంలో తెచ్చిన రూ.2000 నోటును కూడా ఇప్పుడు రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. రూ.2000నోట్లను కూడా దాచి ఉంచుతున్నట్లు ఆధారాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. కానీ, భారత్‌లో మాత్రం అది చాలా నెమ్మదిగా సాగుతోందని గార్గ్ పేర్కొన్నారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల విలువలో మూడో వంతు రూ.2000 నోట్లే ఉన్నప్పటికీ వీటిలో చాలావరకు చెలామణిలోకి రావడం లేదన్నారు. రోజువారీ లావాదేవీలకు ప్రజలకు ఇవి అందుబాటులో ఉండడం లేదనీ, ఈ నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకోవడం లేదా రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 85 శాతానికి పైగా చెల్లింపు లావాదేవీలు ఇంకా నగదు రూపంలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల్ని డిజిటల్ చెల్లింపుల దిశగా మార్చే చర్యల్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు ఇందుకోసం నగదు చెల్లింపులపై పన్నులు, ఛార్జీలు విధించాలన్నారు. అదే సమయంలో డిజిటల్ చెల్లింపుల్ని మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా నగదు ఆధారిత చెల్లింపులు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారి ప్రజలు డిజిటల్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా నగదు లావాదేవీలకు పూర్తిగా స్వస్తి పలకాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో ఇలాంటి చర్యలే చేపట్టారని..ప్రస్తుతం ఆ దేశంలో 87శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ సైతం బ్యాంకింగేతర డిజిటల్ చెల్లింపు సాధనాల్ని వ్యవస్థలోకి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలన్నారు. కాగా 2016లో నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీని అడ్డుకోవడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూ .500, రూ .1,000 నోట్ల వాడకాన్ని నిషేధించినట్లు ప్రధానమంత్రి నరేంద మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆర్బీఐ నగదు నిల్వల నిర్వహణ ఎలా?
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న నగదు నిల్వల నిర్వహణపై (ఎకనమిక్ కమిటీ ఫ్రేమ్‌వర్క్) ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటయ్యింది. బుధవారం ఆర్బీఐ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వం వహిస్తారు. ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి రాకేష్ మోహన్ వైస్ చైర్మన్‌గా ఉంటారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కూడా ఆయన పనిచేశారు. ఆర్బీఐ వద్ద నగదు నిల్వలు ఎంత స్థాయిలో ఉండాలన్న అంశంపై ఈ కమిటీ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ కమిటీలోని సభ్యుల్లో ఉన్నారు. వీరితోపాటు భరత్ దోషి, సుధీర్ మన్కడ్ కూడా కమిటీలో సభ్యులు. వీరు ప్రస్తుతం ఆర్బీఐ సెంట్రల్ బోర్ట్‌లో సభ్యులు. సమావేశమయిన నాటి నుంచీ 90 రోజుల్లో నిపుణుల కమిటీ నివేదికను సమర్పిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలను పరిశీలించి సెంట్రల్ బ్యాంక్ వద్ద నిధులు ఏ మేరకు ఉండాలి? మిగిలిన నిధుల బదలాయింపు ఎలా వంటి అంశాలపై కమిటీ నివేదికను రూపొందిస్తుంది. నేపథ్యం ఇదీ... ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవేల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఈ నిధుల్లో భారీ మొత్తాన్ని ప్రభుత్వం కోరుతోందన్న వార్తలు దేశంలో సంచలనానికి దారితీశాయి. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 10వ తేదీన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్ 19న జరిగిన ఆర్బీఐ బోర్డ్ సమావేశం నిర్ణయించింది. గతంలో కమిటీలు ఇలా... గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉఫా థోరట్ కమిటీ దీనిని 18 శాతంగా పేర్కొంది. ఆర్బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. తయారీ రంగం విక్రయాలు పటిష్టం: ఆర్బీఐ ఇదిలావుండగా, రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) తయారీ రంగం అమ్మకాలపై ఆర్బీఐ బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ కాలంలో తయారీ రంగం విక్రయాలు బాగున్నాయని ఆర్బీఐ పేర్కొంది. ముఖ్యంగా జౌళి, ఇనుము, స్టీల్ రంగాలు, కెమికల్, పెట్రోలియం ప్రొడక్టులు, మోటార్ వాహనాలు, రవాణా పరికరాలు, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలు మంచి అమ్మకాలను నమోదుచేసినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. 2,700 లిస్టెడ్ ప్రైవేట్ రంగ నాన్–ఫైనాన్షియల్ కంపెనీల డేటా విశ్లేషణతో ఈ గణాంకాలు విడుదలయ్యాయి. తయారీ రంగం నికర లాభం 29.4 శాతం వృద్ధితో (గత ఏడాది ఇదే కాలంతో పోల్చి) రూ.47,100 కోట్లుగా నమోదయినట్లు తెలిపింది. కాగా టెలికమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయేతర సేవలు నిరుత్సాహం కలిగించినట్లు గణాంకాలు వివరించాయి. కాగా వ్యయాల విషయంలో (ముడి పదార్థాల కొనుగోలు, సిబ్బంది జీత భత్యాలు) తయారీ రంగం కంపెనీలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నాయని నివేదిక తెలిపింది. -
రూపాయి కట్టడికి దిగుమతులపై ఆంక్షలు..
న్యూఢిల్లీ: రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ తెలిపారు. డాలర్‌తో రూపాయి మారకం విలువను 68–70 స్థాయికి తెచ్చే క్రమంలో నిత్యావసరయేతర ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించడంతో పాటు త్వరలో మరిన్ని చర్యలు ఉంటాయని వివరించారు. ఇందులో భాగంగా ఆంక్షలు విధించతగ్గ నిత్యావసరయేతర ఉత్పత్తులతో ఒక జాబితాను తయారు చేసినట్లు, అలాగే ప్రోత్సహించతగ్గ ఎగుమతులతో మరో జాబితాను కేంద్రం రూపొందించినట్లు వివరించారు. రూపాయి ఏకంగా 12 శాతం మేర పతనం కావటం తాత్కాలికమైనదేనని ఆయన చెప్పారు. ప్రతిపాదిత చర్యలన్నింటినీ పూర్తిగా అమల్లోకి తేలేదని.. మిగతావన్నీ కూడా త్వరలోనే కేంద్రం ప్రకటిస్తుందని గర్గ్ చెప్పారు. తయారీ కంపెనీల విదేశీ రుణాల సమీకరణ నిబంధనలను, కార్పొరేట్ బాండ్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులపై పరిమితులను సడలించడం తదితర చర్యలు ఇప్పటికే తీసుకున్నప్పటికీ.. రూపాయి పతనం మాత్రం ఆగకుండా దాదాపు 72.91కి పడిపోయిన సంగతి తెలిసిందే. -
రోజూ 3వేల కోట్ల విలువైన రూ. 500 నోట్ల ముద్రణ
మనీలా: దేశంలో నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో రూ. 3 వేల కోట్ల విలువైన రూ.500 నోట్లను ప్రతి రోజూ ముద్రిస్తున్నామని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం నగదు లభ్యత సంతృప్తికర స్థాయిలో ఉందని, అదనపు డిమాండ్‌ను అందుకుంటున్నామని ఆయన చెప్పారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు(ఏడీబీ) వార్షిక సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నగదు పరిస్థితిపై గతవారం తాను సమీక్షించానని, 85 శాతం ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని వెల్లడించారు.‘అవసరం మేరకు నగదును సరఫరా చేస్తున్నాం. అదనపు డిమాండ్ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం దేశంలో నగదు సంక్షోభం ఉందని నేను భావించడం లేదు’ అని చెప్పారు. దేశంలో రూ.7 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయని గార్గ్ తెలిపారు. అవసరాని కంటే ఎక్కువ లభ్యత ఉందని అందువల్ల కొత్తగా రూ. 2 వేల నోట్లు ముద్రించాల్సిన అవసరం లేదన్నారు. -
రూపాయికి 65–66 తగిన స్థాయే
మనీలా: అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 65– 66 స్థాయిలో ఉంటే సముచితమైనదేనని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కరెన్సీ పతనం ప్రతికూల ప్రభావాల గురించి ఆందోళన అక్కర్లేదని, రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ముడిచమురు ధర బ్యారెల్‌కు 75 డాలర్ల స్థాయిలో స్థిరపడుతుండటం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్‌ను (ఎఫ్‌పీఐ) ట్రెజరీ బిల్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించడం తదితర పరిణామాలతో రూపాయి మారకం విలువ కొంతకాలం పాటు 66–67 స్థాయిలో ఉండొచ్చన్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గర్గ్ ఈ విషయాలు తెలిపారు. రూపాయి మారకం విలువ 64 స్థాయిలో ఉండటం సరైన ఎక్స్చేంజీ రేటుగా పరిగణించలేమని, ఈ స్థాయిలో ఉంటే ఎగుమతులకు ప్రతికూలమని చెప్పారాయన. ‘రూపాయి మారకం విలువ 64 స్థాయికి పెరిగినప్పుడు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపింది. మళ్లీ 65– 66 స్థాయికి వస్తే సముచిత మారకం విలువగానే పరిగణించవచ్చు. దీని గురించి ఆందోళన అవసరం లేదు‘ అని గర్గ్ తెలిపారు. ఈ ఏడాది బాగా పతనమైన ఆసియా కరెన్సీల్లో రూపాయి రెండో స్థానంలో ఉంది. డాలర్‌తో పోలిస్తే గతేడాది 6.4 శాతం పెరగ్గా, ఈ ఏడాది ఇప్పటిదాకా 2.4 శాతం మేర క్షీణించింది. భారత్ ఇంధన అవసరాల్లో 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నందున... రూపాయి మారకం విలువ క్షీణిస్తే కరెంటు అకౌంటు లోటుపైనా ప్రభావం పడుతుంది. పుష్కలంగా విదేశీ మారక నిల్వలు: ఏడీబీ పుష్కలంగా విదేశీ మారక నిల్వలు ఉన్న భారత్... ప్రస్తుతం కరెన్సీ ఒడిదుడుకుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏడీబీ చీఫ్ ఎకనమిస్ట్ యసుయుకి సవాడా చెప్పారు. అయితే, రూపాయి క్షీణత వల్ల ఎగుమతుల రంగానికి ప్రయోజనం ఉన్నప్పటికీ.. ఎకానమీలో ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లు తలెత్తే అవకాశం ఉందన్నారు. మరోవైపు, ఇప్పటికే 75 డాలర్లకు చేరిన ముడిచమురు బ్యారెల్ ధర మరింత భారీగా పెరగకపోవచ్చని యసుయుకి తెలిపారు. ఏప్రిల్ 6తో ముగిసిన వారాంతంలో భారత విదేశీ మారక నిల్వలు ఆల్‌టైం గరిష్టమైన 424.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఐదు రోజుల్లో మొదటి పతనం! ముంబై: అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ ఐదురోజుల్లో తొలిసారి శుక్రవారం 23 పైసలు బలహీనపడింది. ఇంట్రాడే ఫారెక్స్ మార్కెట్లో 66.87 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల బలహీనత, క్రమంగా వెనక్కెళుతున్న పెట్టుబడులు, క్రూడ్ ధరల పరుగు, దీనితో క్యాడ్ భయాలు వంటి అంశాలు ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఏప్రిల్ 25వ తేదీన రూపాయి 14 నెలల కనిష్టస్థాయి 66.91 స్థాయిని తాకి అటు తర్వాత కొంత రికవరీ అవుతూ వచ్చింది. అయితే నేటి బలహీనతతో వారం చివరకు 21పైసలు బలహీనపడింది. క్రూడ్ ధరలు బెంబేలు.. మరోవంక ఈ వార్త రాసే సమయం రాత్రి 10.30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయిలను చూశాయి. బ్రెంట్ బ్యారల్ ధర 75.06 డాలర్లను తాకింది. ఇక నైమెక్స్ ధర 69.97ను చేరింది. 70 డాలర్లు కీలక నిరోధం. దీనిని అధిగమిస్తే, తక్షణం 72 డాలర్లకు ఎగిసే అవకాశం ఉందని నిపుణుల విశ్లేషణ. -
పెట్రో ధరలు అంత భారీగా ఏం లేవు
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాల్సినంత భారీగా పెట్రో ఉత్పత్తుల ధరలేమీ లేవనీ, కాబట్టి ఇప్పుడు ఎక్సైజ్ సుంకం తగ్గింపు అంశాన్ని ప్రభుత్వం పరిశీలించడమే లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దాదాపు వారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను సవరించలేదు. పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గార్గ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్పీజీ మినహా మిగిలిన అన్ని ఇంధనాలకూ ప్రభుత్వం రాయితీని ఎత్తివేసిందనీ, పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగితే ఎక్సైజ్ సుంకం తగ్గింపు రూపంలో వాటిపై పరోక్ష రాయితీని ఇచ్చే అవకాశం ఉండొచ్చని చెప్పారు. లీటర్ పెట్రోల్/డీజిల్‌పై ఒక రూపాయి ఎక్సైజ్ సుంకం తగ్గించినా ప్రభుత్వానికి రూ. 13 వేల కోట్ల ఆదాయం తగ్గుతుందని గార్గ్ వెల్లడించారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై రూ. 19.48, లీటర్ డీజిల్‌పై రూ. 15.33ల ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం విధిస్తోంది. -
2025కి జీడీపీ 325 లక్షల కోట్లు!
వాషింగ్టన్: దేశ జీడీపీ 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.325 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌చంద్ర గర్గ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల కాలంలో చేపట్టిన సంస్కరణలు ఫలితాలనివ్వడం మొదలైందని చెప్పారు. 2017లో భారత్ జీడీపీ 2.44 లక్షల కోట్ల డాలర్లుగా (రూ. 161 లక్షల కోట్లు) అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి వేగాన్ని సంతరించుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ పేర్కొనగా, భారత ఏనుగు పరిగెత్తేందుకు సిద్ధంగా ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. వాషింగ్టన్లో శనివారం జరిగిన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో వీరు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గైర్హాజరు నేపథ్యంలో భారత బృందానికి గార్గ్ నేతృత్వం వహించారు. 2018లో 7.4 శాతం వృద్ధితో భారత్ తిరిగి ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందే పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని గార్గ్ పేర్కొన్నారు. జీఎస్టీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ), బ్యాంకుల రీక్యాపిటలైజేషన్, మౌలిక రంగంలో పెట్టుబడులు వృద్ధికి తోడ్పడతాయని చెప్పారు. గడిచిన కొన్నేళ్లలో ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడం, డిజిటల్ ఆర్థిక సేవల విస్తృతికి చర్యలు తీసుకున్నట్టు ఆయన వివరించారు. స్థిరమైన వృద్ధికి కోసం మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందుకు వివిధ మార్గాల ద్వారా వనరుల సమీకరణకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. డిజిటైజేషన్ విభాగంలో భారత్‌నెట్ ప్రాజెక్టు తొలి దశలో లక్ష గ్రామ పంచాయతీలను అధిక వేగంతో కూడిన బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించినట్టు తెలిపారు. దీనిద్వారా 20 కోట్లమందికి బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జన్‌ధన్ యోజన కింద బ్యాంకింగ్ సేవలను పేదవారికి చేరువ చేసినట్టు చెప్పుకొచ్చారు. వృద్ధికి వేగం: ఉర్జిత్ పటేల్ భారత ఆర్థిక వ్యవస్థ 2017–18 ఆర్థిక సంవత్సరంలో బలమైన పనితీరు చూపించిందని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. పెట్టుబడులకు తిరిగి డిమాండ్ ఏర్పడటం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19)లో వృద్ధి వేగం అందుకుంటుందని చెప్పారు. తయారీ రంగం, విక్రయాలు, సామర్థ్య వినియోగం పుంజుకోవడం, సేవల రంగంలో బలమైన కార్యకలాపాలు, సాగు ఆశాజనకంగా ఉండటం వంటివి గడిచిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి తోడ్పడినట్టు ఉర్జిత్ పటేల్ వివరించారు. అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతుండటంతో ఎగుమతులకు ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొని పెట్టుబడులు పుంజుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ కలసి వాస్తవ జీడీపీని 2018–19లో 7.4 శాతానికి తీసుకెళతాయన్నారు. 2016 నవంబర్ నుంచి ద్రవ్యోల్బణం మధ్యకాలిక లక్ష్యం 4 శాతం లోపే ఉందని, ఇటీవల కూరగాయల ధరల కారణంగా కొంత పెరిగినప్పటికీ తిరిగి 4.3 శాతానికి దిగొచ్చిందన్నారు. ప్రభుత్వం ద్రవ్య క్రమశిక్షణకు కట్టుబడి ఉందన్నారు. సంస్కరణల అమలు కీలకం స్థిరమైన ఆర్థిక సంస్కరణల బలంతో ‘ఏనుగు పరిగెట్టేందుకు సిద్ధంగా ఉందని’ భారత్‌ను ఉద్దేశించి ఐఎంఎఫ్ డైరెక్టర్ చాంగ్‌యాంగ్ అన్నారు. నాలుగేళ్ల సంస్కరణల మార్గం నేపథ్యంలో ఈ విషయాన్ని ఇన్వెస్టర్లు తనకు చెప్పినట్టు ఆయన వెల్లడించారు. సంస్కరణల విషయంలో మోదీ సర్కారు చక్కగా పనిచేస్తోందని కితాబిచ్చారు. అయితే, ఈ సంస్కరణలను అమలు చేయడంతోపాటు, స్థిరమైన వృద్ధికి బలమైన బ్యాంకు బ్యాలన్స్ షీట్లు అవసరమని గుర్తు చేశారు. భారత్‌కు ఎన్నో మంచి ప్రణాళికలు ఉన్నప్పటికీ ప్రగతి ఆశించిన మేర లేదని విదేశీ ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నట్టు చాంగ్‌యాంగ్ తెలిపారు. -
ప్రథమార్ధంలో రూ. 2.88 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్) కేంద్రం రూ. 2.88 లక్షల కోట్ల మేర రుణ సమీకరణ జరపనుంది. ఇది బడ్జెట్లో నిర్దేశించుకున్న స్థూల రుణ సమీకరణలో 47.56 శాతంగా ఉండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కేంద్రం రూ. 3.72 లక్షల కోట్ల మేర స్థూల రుణ సమీకరణ జరిపింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, రిటైల్ ద్రవ్యోల్బణ ఆధారిత ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్లు కూడా ప్రభుత్వం జారీ చేయనుందని ఆయన వివరించారు. అలాగే 1–4 సంవత్సరాల స్వల్పకాలిక వ్యవధి ఉండే బాండ్లు కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. గడిచిన అయిదేళ్లుగా బడ్జెట్లో నిర్దేశించుకున్న దాంట్లో 60–65 శాతం రుణ సమీకరణ ప్రథమార్ధంలో జరిగిందని, కొత్త ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గుతుందని గర్గ్ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం గవర్నమెంట్ సెక్యూరిటీస్ బైబ్యాక్ పరిమాణం రూ. 25,000 కోట్ల మేర తగ్గించుకోవడంతో పాటు జాతీయ చిన్న మొత్తాల పొదుపు ఫండ్ (ఎన్ఎస్ఎఫ్) నుంచి రూ. 1 లక్ష కోట్ల దాకా ప్రభుత్వం ఉపసంహరించుకోనుంది. -
రూ.1,000 నోట్లా .. ఆ ప్రతిపాదనేమీ లేదు...
న్యూఢిల్లీ: రూమర్లకు చెక్ పెడుతూ ఆర్థిక మంత్రిత్వశాఖ తాజాగా రూ.1,000 నోట్లను తిరిగి చలామణిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనేమీలేదని స్పష్టంచేసింది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ రూ. 1,000 నోట్లను మార్కెట్లోకి తీసుకువస్తోందంటూ వార్తలు జోరందుకున్నాయి. ఇలాంటి వదంతులు నమ్మవద్దని, రూ. 1,000 నోట్లను మళ్లీ తీసుకువచ్చే ప్రతిపాదనేమీ లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ ట్వీట్ చేశారు. నల్లధనానికి చెక్ చెప్పడం కోసం గతేడాది మోదీ సర్కారు రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడం తెలిసిందే. వీటి స్థానంలో కొత్తగా రూ.500 నోట్లను, 2,000 నోట్లను తెచ్చింది. తాజాగా రూ.200 నోట్లను కూడా చెలామణిలోకి తీసుకువచ్చింది. అలాగే త్వరలో కొత్త రూ.50 నోట్లను కూడా తీసుకువస్తోంది. -
లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్
♦ 7 శాతం వృద్ధి రేటుతో ♦ 2050 నాటికి సాధ్యమే ♦ ప్రపంచబ్యాంక్ అంచనా న్యూయార్క్ : వచ్చే 30-35 సంవత్సరాల పాటు ఏటా ఏడు శాతం వృద్ధి రేటు కొనసాగించగలిగితే 2050 నాటికి లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగే సత్తా భారత్‌కి ఉందని ప్రపంచ బ్యాంకు ఈడీ సుభాష్ చంద్ర గర్గ్ చెప్పారు. ప్రస్తుతం 2,000 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 40,000 డాలర్లకు చేరగలదని తద్వారా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడంతో పాటు ప్రజలు కూడా సంపన్నులు కాగలరని ఆయన వివరించారు. ఇండియన్ కాన్సులేట్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గర్గ్ ఈ విషయాలు తెలిపారు. అయితే, ఏకంగా 35 సంవత్సరాల పాటు ఏడు శాతం వృద్ధి రేటును నిలకడగా కొనసాగించగలగడం చాలా కష్టంతో కూడుకున్నదని, ఇందుకోసం ఎకానమీ నిర్వహణ తీరును భారీగా మార్చుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. వ్యవసాయాన్ని సమూలంగా సంస్కరించుకోవాలని, సర్వీసులు, తయారీ రంగాలతో పాటు హెల్త్‌కేర్, టూరిజం మొదలైన వాటికి ఊతమివ్వాలని గర్గ్ తెలిపారు. ప్రస్తుతం భారత జనాభాలో 55 శాతం మంది ఇప్పటికే సర్వీసుల రంగంలో ఉన్నారని, దీన్ని 80-85 శాతానికి పెంచుకోవాలని గర్గ్ తెలిపారు. కానీ వ్యవసాయం నుంచి ప్రజలను తయారీ, సర్వీసుల రంగాల వైపు మళ్లించడం పెద్ద సవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదైనా కొత్త అంశంలో నైపుణ్యం పొందిన పది-ఇరవై లక్షల మంది సుశిక్షితులను ప్రపంచానికి అందించేలా భార త్ ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు.