సాక్షి, న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో సగానికి పైగా చలామణిలోఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి ప్రకంపనలు రేపారు. తాజాగా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్.సి.గార్గ్ డిమానిటైజేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మాట్లాడుతూ రూ. 2వేల నోటును కూడా రద్దు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో రూ. 2 వేల నోటు రద్దుపై పలు అనుమానాలు, అంచనాలు ఆందోళన రేపుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు షాకిస్తున్నాయి. ద్రవ్య చలామణిలో పెద్దదైన రూ.2వేల నోటును రద్దు చేస్తారా అనే భయాందోళనలు మరోసారి రేగాయి.
నవంబర్ 8, 2016 న డీమోనిటైజేషన్ ప్రకటించిన తర్వాత ప్రవేశపెట్టిన కొత్త రూ .2000 నోట్లు ప్రధానంగా ఉన్నాయనీ ఇపుడు వీటిని అక్రమ టెండర్‌గా ప్రకటించవచ్చని సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. రూ .2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవడం వల్ల ఎలాంటి అంతరాయం కలగదని ఆయన అన్నారు. పెద్ద నోట్ల స్థానంలో తెచ్చిన రూ.2000 నోటును కూడా ఇప్పుడు రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. రూ.2000నోట్లను కూడా దాచి ఉంచుతున్నట్లు ఆధారాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. కానీ, భారత్‌లో మాత్రం అది చాలా నెమ్మదిగా సాగుతోందని గార్గ్ పేర్కొన్నారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల విలువలో మూడో వంతు రూ.2000 నోట్లే ఉన్నప్పటికీ వీటిలో చాలావరకు చెలామణిలోకి రావడం లేదన్నారు. రోజువారీ లావాదేవీలకు ప్రజలకు ఇవి అందుబాటులో ఉండడం లేదనీ, ఈ నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకోవడం లేదా రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో 85 శాతానికి పైగా చెల్లింపు లావాదేవీలు ఇంకా నగదు రూపంలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల్ని డిజిటల్ చెల్లింపుల దిశగా మార్చే చర్యల్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు ఇందుకోసం నగదు చెల్లింపులపై పన్నులు, ఛార్జీలు విధించాలన్నారు. అదే సమయంలో డిజిటల్ చెల్లింపుల్ని మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా నగదు ఆధారిత చెల్లింపులు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారి ప్రజలు డిజిటల్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా నగదు లావాదేవీలకు పూర్తిగా స్వస్తి పలకాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో ఇలాంటి చర్యలే చేపట్టారని..ప్రస్తుతం ఆ దేశంలో 87శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ సైతం బ్యాంకింగేతర డిజిటల్ చెల్లింపు సాధనాల్ని వ్యవస్థలోకి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలన్నారు. కాగా 2016లో నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీని అడ్డుకోవడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూ .500, రూ .1,000 నోట్ల వాడకాన్ని నిషేధించినట్లు ప్రధానమంత్రి నరేంద మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment