Rs2000 notes
-
రేపే లాస్ట్ డేట్ - మిగిలిన రూ.2000 నోట్ల పరిస్థితి ఏంటి?
రూ. 2000 నోట్ల ఎక్స్చేంజ్ లేదా డిపాజిట్ కోసం ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు 93 శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సమయంలో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) గడువు పొడిగిస్తుందా? లేదా అనే దానిపైన చాలా మందికి సందేహం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రెండు వేలు నోట్లను బ్యాంకుల ద్వారా మార్చుకోవడానికి 2023 మే 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు సుమారు నాలుగు నెలలు గడువు కల్పించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఈ గడువు రేపటితో ముగుస్తుంది. ఇప్పటికి కూడా వెనక్కి రావాల్సిన నోట్లు 7 శాతం ఉన్నాయని, దీని కోసం ఆర్బీఐ గడువు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదీ చదవండి: ఆడి కారులో వచ్చి ఆకుకూర అమ్ముతున్నాడు - వీడియో ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, ఇతర వ్యాపారస్తులు తమ వద్ద ఉన్న రూ. 2000 నోట్లను బ్యాంకులో జమ చేయడానికి గడువు పొడిగించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ గడువు అక్టోబర్ 31 వరకు పొడిగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2023 మే 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు 93 శాతం రెండు వేలు నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయి సంబంధిత శాఖ వెల్లడించింది. -
రూ.2000 నోటు : ఎస్సీ గార్గ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో సగానికి పైగా చలామణిలోఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి ప్రకంపనలు రేపారు. తాజాగా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్.సి.గార్గ్ డిమానిటైజేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మాట్లాడుతూ రూ. 2వేల నోటును కూడా రద్దు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో రూ. 2 వేల నోటు రద్దుపై పలు అనుమానాలు, అంచనాలు ఆందోళన రేపుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు షాకిస్తున్నాయి. ద్రవ్య చలామణిలో పెద్దదైన రూ.2వేల నోటును రద్దు చేస్తారా అనే భయాందోళనలు మరోసారి రేగాయి. నవంబర్ 8, 2016 న డీమోనిటైజేషన్ ప్రకటించిన తర్వాత ప్రవేశపెట్టిన కొత్త రూ .2000 నోట్లు ప్రధానంగా ఉన్నాయనీ ఇపుడు వీటిని అక్రమ టెండర్‌గా ప్రకటించవచ్చని సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. రూ .2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవడం వల్ల ఎలాంటి అంతరాయం కలగదని ఆయన అన్నారు. పెద్ద నోట్ల స్థానంలో తెచ్చిన రూ.2000 నోటును కూడా ఇప్పుడు రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. రూ.2000నోట్లను కూడా దాచి ఉంచుతున్నట్లు ఆధారాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. కానీ, భారత్‌లో మాత్రం అది చాలా నెమ్మదిగా సాగుతోందని గార్గ్ పేర్కొన్నారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల విలువలో మూడో వంతు రూ.2000 నోట్లే ఉన్నప్పటికీ వీటిలో చాలావరకు చెలామణిలోకి రావడం లేదన్నారు. రోజువారీ లావాదేవీలకు ప్రజలకు ఇవి అందుబాటులో ఉండడం లేదనీ, ఈ నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకోవడం లేదా రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 85 శాతానికి పైగా చెల్లింపు లావాదేవీలు ఇంకా నగదు రూపంలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల్ని డిజిటల్ చెల్లింపుల దిశగా మార్చే చర్యల్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు ఇందుకోసం నగదు చెల్లింపులపై పన్నులు, ఛార్జీలు విధించాలన్నారు. అదే సమయంలో డిజిటల్ చెల్లింపుల్ని మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా నగదు ఆధారిత చెల్లింపులు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారి ప్రజలు డిజిటల్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా నగదు లావాదేవీలకు పూర్తిగా స్వస్తి పలకాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో ఇలాంటి చర్యలే చేపట్టారని..ప్రస్తుతం ఆ దేశంలో 87శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ సైతం బ్యాంకింగేతర డిజిటల్ చెల్లింపు సాధనాల్ని వ్యవస్థలోకి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలన్నారు. కాగా 2016లో నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీని అడ్డుకోవడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూ .500, రూ .1,000 నోట్ల వాడకాన్ని నిషేధించినట్లు ప్రధానమంత్రి నరేంద మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వచ్చే 50 రోజులు జనం ఏలా బతకాలి?
న్యూఢిల్లీ: ‘పాల ప్యాకెట్ల దగ్గర్నుంచి ప్రయాణాల దాకా అత్యవసరమైన ఏ చోటా రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవట్లేదు. నవంబర్ 8 ప్రకటనలో.. నాలుగైదు రోజుల్లో అంతా సర్దుకుంటుందని ప్రధాని చెప్పారు. ఇవ్వాళేమో 50 రోజులు టైమ్ కావాలని అడుగుతున్నారు. చేతిలో చెల్లుబాటయ్యే డబ్బులు లేకుండా 50 రోజుల పాటు జనం ఏం తిని బతకాలి? అసలీ మాట చెప్పడానికి మోదీకి నోరెలా వచ్చింది?’ అని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దును సమర్థించుకుంటూ ప్రధాని మోదీ ఆదివారం గోవాలో చేసిన ప్రసంగం ప్రజలను కించపర్చేలా ఉందని, కుంభకోణాలు చేసినవాళ్లూ బ్యాంకుల ముందు క్యూలైన్లో నిలబడ్డారు అనడం దారుణమని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన సీఎం.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి? స్విస్ బ్యాంకు నుంచి తెస్తానన్న బ్లాక్ మనీ ఏమైంది? అని ప్రధానిని ప్రశ్నించారు. అవినీతిపరులు బ్యాంకుల ముందు నిల్చున్నారన్న ప్రధాని ఒక్కసారైనా లైన్ లో నిలబడితే బాధేంటో తెలుస్తుందని అన్నారు. గతంలో రాబర్ట్ వాద్రాను జైలుకు పంపిస్తానన్న మోదీ ఇప్పుడాయనతో దోస్తానా చేస్తున్నారని, నల్లకుబేరులపై చర్యలకు కేంద్రం జంకుతోందని ఆరోపించారు. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన నాటి నుంచి మోదీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తోన్న కేజ్రీవాల్.. రూ.500, 1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రూ.2000 నోటుతో నల్లకుబేరులకు మేలు జరుగుతుందని, సామాన్య జనం సమస్యలు ఎప్పటిలాగే ఉంటాయని అన్నారు. 2011లో వెల్లడైన నల్లబాబుల జాబితోని 6000 మందిలో కనీసం కొందరిపైనైనా చర్యలు తీసుకోవాలని, తద్వారా మోదీ తన నిజాయితీని నిరూపించుకోవాలని కేజ్రీవాల్ అన్నారు. (బీజేపీ ‘మిత్రులకు’ ముందే తెలుసు) -
వచ్చే 50 రోజులు జనం ఏలా బతకాలి?