Published
Sun, Nov 13 2016 6:08 PM
| Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
వచ్చే 50 రోజులు జనం ఏలా బతకాలి?
న్యూఢిల్లీ: ‘పాల ప్యాకెట్ల దగ్గర్నుంచి ప్రయాణాల దాకా అత్యవసరమైన ఏ చోటా రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవట్లేదు. నవంబర్ 8 ప్రకటనలో.. నాలుగైదు రోజుల్లో అంతా సర్దుకుంటుందని ప్రధాని చెప్పారు. ఇవ్వాళేమో 50 రోజులు టైమ్ కావాలని అడుగుతున్నారు. చేతిలో చెల్లుబాటయ్యే డబ్బులు లేకుండా 50 రోజుల పాటు జనం ఏం తిని బతకాలి? అసలీ మాట చెప్పడానికి మోదీకి నోరెలా వచ్చింది?’ అని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.
నోట్ల రద్దును సమర్థించుకుంటూ ప్రధాని మోదీ ఆదివారం గోవాలో చేసిన ప్రసంగం ప్రజలను కించపర్చేలా ఉందని, కుంభకోణాలు చేసినవాళ్లూ బ్యాంకుల ముందు క్యూలైన్లో నిలబడ్డారు అనడం దారుణమని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన సీఎం.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి? స్విస్ బ్యాంకు నుంచి తెస్తానన్న బ్లాక్ మనీ ఏమైంది? అని ప్రధానిని ప్రశ్నించారు. అవినీతిపరులు బ్యాంకుల ముందు నిల్చున్నారన్న ప్రధాని ఒక్కసారైనా లైన్ లో నిలబడితే బాధేంటో తెలుస్తుందని అన్నారు. గతంలో రాబర్ట్ వాద్రాను జైలుకు పంపిస్తానన్న మోదీ ఇప్పుడాయనతో దోస్తానా చేస్తున్నారని, నల్లకుబేరులపై చర్యలకు కేంద్రం జంకుతోందని ఆరోపించారు.
నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన నాటి నుంచి మోదీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తోన్న కేజ్రీవాల్.. రూ.500, 1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రూ.2000 నోటుతో నల్లకుబేరులకు మేలు జరుగుతుందని, సామాన్య జనం సమస్యలు ఎప్పటిలాగే ఉంటాయని అన్నారు. 2011లో వెల్లడైన నల్లబాబుల జాబితోని 6000 మందిలో కనీసం కొందరిపైనైనా చర్యలు తీసుకోవాలని, తద్వారా మోదీ తన నిజాయితీని నిరూపించుకోవాలని కేజ్రీవాల్ అన్నారు. (బీజేపీ ‘మిత్రులకు’ ముందే తెలుసు)