ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం భారీగా కుదేలయ్యింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్ఛంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో రూపాయి విలువ ఎన్నడూ లేనంత కనిష్టానికి పడిపోయి 69.93 వద్ద ముగిసింది. శుక్రవారం ముగిసిన ధరతో పోల్చితే ఇది 110 పైసలు తక్కువ. గత శుక్రవారం రూపాయి ముగింపు ధర 68.83. అయితే సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో 41 పైసలు లాభంతో ప్రారంభమైంది.
కానీ అక్కడ నిలదొక్కుకోలేక నష్టాల్లోకి జారిపోయింది. చివరకు 110 పైసలు (1.60 శాతం) నష్టంతో ముగిసింది. ఒకేరోజు రూపాయి ఈ స్థాయిలో పతనం కావడం ఐదేళ్లలో ఇదే తొలిసారి. 2013 ఆగస్టులో ఒకసారి ఒకేరోజు రూపాయి 148 పైసలు (2.4 శాతం) పడిపోయింది. రూపాయి పతనానికి సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...
♦ అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఆరు దేశాల కరెన్సీలతో (యూరో, జపాన్ యెన్, పౌండ్ స్టెర్లింగ్, కెనెడియన్ డాలర్, స్వీడిష్ క్రోనా, స్విస్ ఫ్రాంక్) ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 88 స్థాయిని చూసిన తర్వాత క్రమంగా కోలుకుంటూ గత నాలుగు నెలలుగా 95 వద్ద తీవ్ర నిరోధాన్ని ఎదుర్కొంటూ వస్తోంది. అయితే అమెరికా 4 శాతంపైబడి జీడీపీ వృద్ధి నమోదు చేయటంతో గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో 96 స్థాయి పైకి చేరింది. ఇది రూపాయి బలహీనతకు ఒక కారణంగా నిలిచింది.
♦ టర్కీ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు భారత కరెన్సీ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి.
♦ ఆయా పరిస్థితుల్లో కరెన్సీ ట్రేడర్లలో కొంత ఆందోళన నెలకొంది. దేశీయ కరెన్సీని నిలబెట్టడానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి ఎటువంటి సంకేతాలూ అందకపోవడంతో రూపాయి పతనం వేగంగా జరిగింది. బ్యాంకర్లు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
♦ ఇక విదేశీ వ్యవస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ) తగ్గడం, చమురు ధరలు పెరుగుతుండటం కూడా రూపాయి సానుకూల సెంటిమెంట్‌పై ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపుతోంది.
♦ భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు ఏడు వారాల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఆగస్టు 3వ తేదీతో ముగిసిన వారంలో ఏడు నెలల కనిష్ట స్థాయి 402. 7 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. జూలై 27వ తేదీతో ముగిసిన వారంలో భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు 404.19 బిలియన్ డాలర్లు.
♦ బ్రిటన్ పౌండ్, యూరో, జపాన్ యెన్‌పై కూడా రూపాయి బలహీనపడింది. పౌండ్ స్టెర్లింగ్ 87.86 నుంచి 89.13కు పడిపోయింది. యూరో 78.83 నుంచి 79.52 స్థాయికి దిగింది. ఇక జపాన్ యెన్ 62.03 స్థాయి నుంచి 63.37కు పడింది. టర్కీ కరెన్సీ సంక్షోభం నేపథ్యంలో జపాన్ యెన్ పెట్టుబడులకు సురక్షిత అసెట్ హోదా పొందుతోంది.
♦ డాలర్ మారకంలో రూపాయి విలువ 71 వద్ద ఉండటమే భారత్ ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం మంచిదని మాజీ చీఫ్ ఎకనమిక్ ఎడ్వైజర్ కౌశిక్ బసుసహా కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఎగుమతులకు ఇది మంచి పరిణామం అవుతుందని వారి అభిప్రాయం.
♦ అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది దాదాపు 10 శాతం పతనమైంది. రెండేళ్ల క్రితం దాదాపు 68.90 స్థాయికి రూపాయి దిగినప్పుడు... 72కు చేరుతుందని ఊహాగానాలు వెలువడ్డాయి. దీనికి భిన్నంగా రూపాయి 63 స్థాయికి బలపడింది. ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక ప్రతికూలతలు, అనిశ్చితుల నేపథ్యంలో తిరిగి భారీ పతన స్థాయిలను చూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment