కనిష్టానికి రూపాయి, సెన్సెక్స్ భారీ పతనం
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నాటి మార్కెట్ లో రూపాయి రికార్డు స్థాయి కనిష్ట విలువను నమోదు చేసుకుంది. తొలిసారి 62 రూపాయల కనిష్టాన్ని అధిగమించి సరికొత్తగా 62.03 చారిత్రాత్మక రికార్డును నమోదు చేసుకుంది. ఆగస్టు 6 తేదిన నమోదు చేసిన 61.80 రికార్డును శుక్రవారం తిరగరాసింది.
బుధవారం మార్కెట్ లో 61.43 వద్ద ముగిసింది. ఆగస్టు 15 తేది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు కావడంతో గురువారం వ్యాపార లావాదేవిలు జరుగలేదు. శుక్రవారం ఆరంభంలో రూపాయి క్రితం ముగింపుకు 10 పైసలు లాభపడింది. అయితే వెంటనే రూపాయి నష్టాల్లోకి జారుకుని చారిత్రాత్మక కనిష్టస్థాయిని చేరుకుంది.
రూపాయి పతన ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 700 పాయింట్ల నష్టంతో 18665 పాయింట్ల వద్ద, నిఫ్టీ 217 పాయింట్ల పతనంతో 5526 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.