
ముంబై : రూపాయి విలువ రోజురోజుకు మరింత క్షీణిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సరికొత్త కనిష్ట స్థాయిల్లోకి కుదేలైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.32 మార్కును తాకి, ఇన్వెస్టర్లలో గుండె గుబేల్‌మనిస్తోంది. ఇప్పట్లో రూపాయి కోలుకునే అవకాశాలేమీ కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఆసియా కరెన్సీలు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీనంతటికీ కారణం టర్కీ రాజకీయ సంక్షోభం. ఈ సంక్షోభం ప్రపంచ మార్కెట్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచ కరెన్సీలు, దేశీయ కరెన్సీ పాతాళంలోకి పడిపోతుండటంతో డాలర్ విలువ పైపైకి 13 నెలల గరిష్టంలోకి ఎగిసింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి అత్యంత కనిష్ట స్థాయి 70.25 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత మరింత క్షీణిస్తూ ట్రేడవుతోంది.
తాజాగా 43 పైసల్ ఢమాలమని 70.32 వద్ద చరిత్రాత్మక కనిష్ట స్థాయిని తాకింది. రూపాయి విలువ భారీగా పడిపోతుండటంతో, వాణిజ్య లోటు ఐదేళ్ల గరిష్టాన్ని తాకుతున్నట్టు విశ్లేషకులు చెప్పారు. టర్కీ కరెన్సీ లీరా కోలుకుని గ్లోబల్ మార్కెట్లు స్థిరత్వానికి వచ్చినప్పుడే రూపాయి విలువ కోలుకుంటుందని ఆనంద్ సేథి షేర్, స్టాక్ బ్రోకర్స్, రీసెర్చ్ విశ్లేషకుడు రుషబ్ మరు తెలిపారు. మరికొన్ని సెషన్ల వరకు రూపాయి విలువ ఒత్తిడిని ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై విధించిన టారిఫ్‌లు, టర్కీ లీరాను దెబ్బతీస్తున్నాయని, ఈ ఒత్తిడి భారత రూపాయిపై పడుతుందని చెప్పారు.