బ్రిటిష్ వలసపాలన నుంచి స్వేచ్ఛ లభించి 71 ఏళ్లయింది. కొద్ది రోజుల్లో 72వ స్వాతంత్య్ర దినోత్సవం కూడా వచ్చేస్తోంది. అయితే ఏంటంటారా!! డాలరుతో మన దేశ కరెన్సీ మారకం విలువ 72 దిశగా జారిపోతుండటం!! అసలు భారతీయులు సేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజునే మన కరెన్సీ బానిసత్వంలోకి వెళ్లిపోయింది. ఇతర దేశాల కరెన్సీలతో మన రూపాయి విలువ పతనం ప్రారంభమైంది 1947లోనే. అప్పట్లో ఒక రూపాయి ఇస్తే... ఒక డాలరు వచ్చేది. అంటే డాలరుతో సమానంగా మారకం విలువ ఉండేది. మరి ఇప్పుడో... 69 రూపాయలిస్తే తప్ప ఒక డాలరు రాదు. ఈ 71 ఏళ్లలో ఏకంగా 69 రెట్లు విలువ కోల్పోయిందన్నమాట. దీనికి కారణాలేంటి..? రూపాయికి ఎదురైన దుర్భర పరిస్థితులేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ సమగ్ర కథనం... – సాక్షి, బిజినెస్ విభాగం
మనకు స్వాతంత్రం వచ్చే నాటికి దేశీ కరెన్సీ బ్రిటిష్ పౌండ్‌తో ముడిపడి ఉండేది. విదేశీ మారక కార్యకపాలుంటే పౌండ్లలో చెల్లింపులు జరిగేవి. భారత ప్రభుత్వానికి విదేశీ అప్పులు లేనే లేవు. అప్పటినుంచి జరిగిన అనేక భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆర్థికపరమైన మార్పులు మన కరెన్సీని కరిగిపోయేలా చేస్తూ వచ్చాయి.
1951లో మొదలెట్టిన పంచవర్ష ప్రణాళికలతో సామాజిక, అభివద్ధి కార్యకలాపాలకోసం ప్రభుత్వం విదేశీ రుణాలను సమీకరించాల్సి వచ్చింది. దీంతో రూపాయి విలువను తగ్గించాల్సిన (డీవేల్యుయేషన్) పరిస్థితి వచ్చింది. స్వాంతంత్య్రం వచ్చాక భారత్ స్థిర కరెన్సీ మారకం విలువను అమలు చేసింది. దీనివల్ల 1948 నుంచి 1966 మధ్య డాలరు మారకం విలువ 4.79గా కొనసాగింది. ఇక 1962లో చైనాతో యుద్ధం, 1965లో పాకిస్థాన్‌తో పోరు... భారతదేశ బడ్జెట్‌లో లోటును భారీగా పెంచాయి.
అంతేకాక 1965–66లో వచ్చిన తీవ్ర కరువుతో దేశంలో ధరలు ఆకాశాన్నంటాయి. ఇతర దేశాలనుంచి భారీగా దిగుమతులు పోటెత్తడంతో వాణిజ్యలోటు కూడా దూసుకెళ్లింది. చేసేదేమీలేక డాలరుతో రూపాయి మారకం విలువను మరింత తగ్గించాల్సి వచ్చింది. ఆర్థిక సరళీకరణకు కూడా కొంత గేట్లు తెరిచారు. అప్పుడు ఒక్కో డాలరుకు 7.57గా మారకం రేటును నిర్ణయించారు.
పెద్దన్న కబంధ హస్తాల్లో...
1971లో బ్రిటిష్ పౌండ్‌తో భారత్ కరెన్సీకి పూర్తిగా బంధం తెగిపోయింది. ప్రపంచ పెద్దన్న అమెరికా కరెన్సీ కబంధ హస్తాల్లో రూపాయి బందీ అయిపోయింది. అప్పటినుంచి మన విదేశీ చెల్లింపులు, ఇతరత్రా లావాదేవీలన్నీ అమెరికా డాలరుకి ముడిపడ్డాయి.
అయితే, 1975లో మళ్లీ దేశ కరెన్సీని డాలరుతో పాటు జపాన్ యెన్, జర్మనీ మార్క్.. ఈ మూడు కరెన్సీలతో లింక్ చేశారు. అప్పటికి డాలరుతో రూపాయి మారకం విలువ 8.39 డాలర్లకు తగ్గింది. 1980లలో కొంత బలపడినప్పటికీ... 1985 నాటికి 12కు పడిపోయింది. ప్రధానంగా వాణిజ్యలోటు (ఎగుమతులు తగ్గిపోయి.. దిగుమతులు భారీగా ఎగబాకడం) ఎడాపెడా పెరిగిపోవడంతో డాలరుతో రూపాయి మారకం విలువ 1990 నాటికి 17.5కు క్షీణించింది.
చెల్లింపుల సంక్షోభంతో సీన్ రివర్స్...
1991లో భారత ఆర్థిక పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. దేశంలో విదేశీ కరెన్సీ (ఫారెక్స్) నిల్వలు దాదాపు అడుగంటిపోయాయి. దీంతో ఇతర దేశాలనుంచి చేసుకున్న దిగుమతులకు చెల్లింపులు జరపలేని స్థితి వచ్చేసింది. మూడు వారాలకు సరిపడా చెల్లింపులకు మాత్రమే ఫారెక్స్ నిల్వలు భారత్ వద్ద మిగలాయి.
చెల్లింపుల సంక్షోభం తలెత్తింది. దీనికితోడు ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయి జనం ధరల మంటతో అల్లాడారు. ఆ సమయం లోనే దేశంలోకి విదేశీ పెట్టుబడులు తరలివచ్చేలా కీలకమైన సరళీకరణకు ప్రభుత్వం తెరతీసింది. దీనికితోడు కరెన్సీ విలువను కూడా మరింత తగ్గించారు. 1993లో దేశ కరెన్సీ చరిత్రలో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రభుత్వం కరెన్సీపై నియంత్రణ ఎత్తేసింది.
ఆర్‌బీఐ కను సన్నల్లో మార్కెట్ వర్గాలు (ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ ఆధారంగా) రూపాయి మారకం విలువను నిర్ధేశించేలా సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే, భారీగా ఒడిదుడుకులు తలెత్తితే ఆర్‌బీఐ జోక్యం చేసుకునేలా నిబంధనలు రూపొందించారు. ఈ పరిణామాలతో 1995కు రూపాయి విలువ 32.42కు పడిపోయింది. 2000 ఏడాదికల్లా ఒక అమెరికా డాలరు కోసం 44.94 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
2009 నుంచీ 50 దిగువనే...
రూపాయి విలువ స్థిరంగా కొన్నాళ్లపాటు కొనసాగిందంటే అది 2000–2007 మధ్యనే. ఈ వ్యధిలో కరెన్సీ విలువ 40–50 మధ్యలో ఉంది. ఎక్కువగా 45 వద్ద కదలాడింది. 2007లో 39 స్థాయికి(పదేళ్ల గరిష్టం) వచ్చింది. 1991లో ఆర్థిక సంస్కరణలకు నేతత్వం వహించిన నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్... 2004లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆర్థిక వృద్ధి పతాక స్థాయికి చేరింది.
విదేశీ పెట్టుబడులు భారీగా రావడం, ప్రై వేటు రంగం పుంజుకోవడం, సరళీకరణ ఫలాలతో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ఏకంగా 9 శాతాన్ని కూడా తాకింది. అయితే, 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం మన వృద్ధి రేటుకు తూట్లు పొడిచింది. అప్పటినుంచీ రూపాయి విలువ పడుతూనే వస్తోంది. 2008 అక్టోబర్‌లో తొలిసారిగా 50 దిగువకు కుప్పకూలింది. అక్కడి నుంచి మళ్లీ ఎన్నడూ 50 ఎగువకు చేరనేలేదు.
2016 నవంబర్ 24న ఇంట్రాడేలో 68.86 కనిష్ఠాన్ని చూసింది. అక్కడి నుంచి నిన్నమొన్నటిదాకా 60–66 స్థాయిలోనే కదలాడిని రూపాయి మళ్లీ అంతర్జాతీయ ఆర్థిక ప్రతికూలతలతో కట్టలు తెంచుకుంది. గురువారం (జూన్ 28న) ఏకంగా ఇంట్రాడేలో 69.10కి పడిపోయి కొత్త ఆల్‌టైమ్ కనిష్టాన్ని చూసింది. ముగింపులో కూడా 68.79 వద్ద చరిత్రాత్మక కనిష్ట స్థాయికి చేరింది.
ట్రంపు.. ముంపు!
ప్రపంచ దేశాలకు ఇప్పుడేదైనా ముప్పు పొంచి ఉందంటే అది అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ నుంచేననటం అతిశయోక్తి కాదేమో!! ఏ క్షణాన ట్రంప్ స్వేతసౌధాన్ని అధిష్టించారో అప్పటి నుంచీ ఏ దేశానికీ కంటిమీద కునుకు లేదు. మొదట్లో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో తమ దేశంలోకి విదేశీ నిధులు, ఉద్యోగాలను రప్పించిన ఆయన.. ఇప్పుడు వాణిజ్య యుద్ధం మొదలెట్టడంతో అన్ని దేశాలూ లబోదిబోమంటున్నాయి. విదేశీ ఉత్పత్తులపై ఎడాపెడా దిగుమతి సుంకాలు విధిస్తుండటంతో ప్రపంచ వాణిజ్య రంగం అతలాకుతలం అవుతోంది. వర్ధమాన దేశాల కరెన్సీలు కుప్పకూలుతున్నాయి.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మన ఆర్థిక వ్యవస్థకు ఇది శరాఘాతమే. ఇక అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు రాకెట్‌లా దూసుకెళ్తుండం పులి మీద పుట్రలా మారింది. క్రూడ్ ధరల జోరుతో ఇటీవల దేశీయంగా దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడం కూడా కరెన్సీ పతనాన్ని వేగవంతం చేస్తోంది. అధిక వాణిజ్య లోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం. ఇది గతేడాది 160 బిలియన్ డాలర్లు. అంతక్రితం ఏడాది 110 బిలియన్ డాలర్లు), కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారకం మధ్య వ్యత్యాసం.
గతేడాది 1.9 శాతం. అంతక్రితం ఏడాది 0.6 శాతంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది) ఎగబాకుతుండటం కూడా కూడా మన కరెన్సీపై ఒత్తిడి పెంచుతున్నాయి. రూపాయి క్షీణత వల్ల ఎగుమతిదారులకు లాభమే అయినా... మన దేశం అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతుండటం సమస్యను తీవ్రం చేస్తోంది. ఇక అమెరికా వడ్డీరేట్లు అంతకంతకూ పెరిగిపోతూ ఉండటంతో డాలరు విలువ బలపడుతోంది. ఇదీ రూపాయిని దెబ్బతీస్తోంది. ఈ ప్రభావంతో విదేశీ పెట్టుబడులు వెనక్కిపోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా మన ఈక్విటీ, డెట్(బాండ్స్) మార్కెట్ల నుంచి 7 బిలియన్ డాలర్లకుపైగా (రూ.48,000 కోట్లు) విదేశీ నిధులు తిరోగమించడం తీవ్రతకు నిదర్శనం.
దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు కూడా తీవ్ర కుదుపులకు గురవుతున్నాయి. వెరసి ఈ ప్రభావమంతా రూపాయికి ముచ్చెమటలు పట్టిస్తోంది. మన దగ్గర విదేశీ మారక నిల్వలు భారీగా ఉండటం (దాదాపు 410 బిలియన్ డాలర్లు), ఆర్థిక వ్యవస్థ రికవరీ.. రూపాయి దెబ్బను తట్టుకోవడం కాస్త తోడ్పాటునందించే అంశాలు. అయితే, ప్రస్తుత కరెన్సీ పతనానికి దేశీ అంశాలకంటే అంతర్జాతీయ పరిస్థితులే ప్రధాన కారణం కావడంతో దీనికి ఎక్కడ అడ్డుకట్టపడుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే!!
Comments
Please login to add a commentAdd a comment