
కరెన్సీ ఒడిదుడుకులపై అప్రమత్తత అవసరం
ప్రభుత్వాన్ని కోరిన నాస్కామ్
హైదరాబాద్: డాలర్‌తో రూపాయి మారకంలో తీవ్రమైన ఒడిదుడుకులు భారత్‌లోని ఏ పరిశ్రమకూ మంచిది కాదని నాస్కామ్ వ్యాఖ్యానించింది. అందుకని కరెన్సీ ఒడిదుడుకులకు సంబంధించి అంతర్జాతీయ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. అవసరమైనప్పుడు రూపాయి ఒడిదుడుకుల ప్రభావం కనిష్ట స్థాయిలో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చైనా యువాన్ కరెన్సీ తగ్గింపు కారణంగా దేశ ఐటీ పరిశ్రమపైఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఆయన తేల్చిచెప్పారు. డాలర్ బలపడడం వల్ల భారత ఎగుమతిదారులకు స్వల్పకాలిక లాభమే ఉంటుందని వివరించారు. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా లాభపడడం పరిశ్రమ అభిమతం కాదని, వ్యాపారం ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించడం ముఖ్యమని పేర్కొన్నారు.